TS Icet results
-
టీఎస్‌ఐసెట్‌లో తొలి 3 ర్యాంకులు ఏపీ విద్యార్థులవే
కేయూ క్యాంపస్(వరంగల్): తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022–2023 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకుగాను జూలై 27, 28 తేదీల్లో నిర్వహించిన టీఎస్ఐసెట్–2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు, ఫైనల్ కీని శనివారం విడుదల చేశారు. తెలంగాణలోని 14 రీజియన్ సెంటర్లు, ఏపీలో 4 రీజియన్ సెంటర్ల పరిధిలో నిర్వహించిన టీఎస్ ఐసెట్‌కు 68,781 మంది అభ్యర్థులు హాజరుకాగా, 61,613 మంది(89.58%)ఉత్తీర్ణులయ్యారు. అందులో పురుషులు 33,855 మంది పరీక్షకు హాజరుకాగా 30,409 మంది (89.82%), మహిళలు 34,922మందికి 31,201మంది (89.34%)ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్జెండర్లు నలుగురు హాజరుకాగా అందులో ముగ్గురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో 20 ర్యాంకులు ప్రకటించగా అందులో మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు దక్కాయి. వీరిలో గుంటూరుకు చెందిన దంతాల పూజితవర్ధన్ 170.61 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ పొందగా, వైఎస్సార్ కడపకు చెందిన అంబవరం ఉమేష్‌చంద్రరెడ్డి రెండో ర్యాంకు (167.36 మార్కులు), గుంటూరుకే చెందిన కాట్రగడ్డ జితిన్‌సాయి మూడో ర్యాంకు (166.74 మార్కులు) సాధించారు. నాలుగో ర్యాంకు తెలంగాణాకు చెందిన మహబూబాద్ జిల్లా కేసముద్రం వాసి, 8వ ర్యాంకు వరంగల్ జిల్లా వాసి దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన త్రివేది సువర్ణ సాత్విక (151.20 మార్కులు) పదో ర్యాంక్ పొందారు. ఫలితాలు టీఎస్ఐసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
సాక్షి , హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–2022 ఫలితలు నేడు (ఆగస్టు 27) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను కాకతీయ యూనివర్సిటీలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. ఈ టీఎస్ ఐసెట్ 2022 ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఐసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్ మొదటి ర్యాంకు కైవసం చేసకోగా.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేష్ చంద్రారెడ్డి రెండవ ర్యాంకు సాధించారు. అలాగే గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన కాట్రగడ్డ జితిన్ సాయికి మూడో ర్యాంకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన వెలిశాల కార్తీక్ నాలుగో ర్యాంక్ సాధించారు. కాగా ఐసెట్ ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 విద్యార్థులు పరీక్ష రశారు. వారిలో 61,613 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 30,409 మంది పురుషులు (89 శాతం), 31,201 మంది మహిళలు (89.34 శాతం) 3 ట్రాన్స్జెండర్లు (75 శాతం) ఉన్నారు. ఫలితాలు https://icet.tsche.ac.in అందుబాటులో ఉన్నాయి. టీఎస్ ఐసెట్-2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి -
ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
ఈ నెల 23న టీఎస్ఐసెట్ ఫలితాలు
కేయూ క్యాంపస్: రాష్ట్రం లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఐసెట్–2021 ఫలితాలను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది అగస్టు 19, 20వ తేదీల్లో మూడు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి 56,962 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. -
విషాదంలోనూ విజయం..
హైదరాబాద్: పది నెలల క్రితం ఆ ఇంట్లో సంతోషాలు దూరమైనా.. ఆ విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. శుక్రవారం విడుదలైన టీఎస్ఐసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించి తన తల్లి ఆకాంక్షను నెరవేర్చాడు. హనుమాన్‌పేట్‌కు చెందిన రైల్వే ఉద్యోగి మండవ శ్రీనివాసరావు, కల్యాణి దంపతులు. వారికి కుమారుడు హనీస్ సత్య, కుమార్తె హర్షిత ఉన్నారు. తల్లి కల్యాణి 10 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. హనీస్ గండిపేటలోని ఎంజీఐటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా.. హర్షిత శ్రీకాకుళంలో ఎంబీబీఎస్ చదువుతోంది. గత నెల 23న ఐసెట్ పరీక్ష రాసిన హనీస్.. శుక్రవారం విడుదలైన ఐసెట్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించా డు. ఈ సందర్భంగా హనీస్ మాట్లాడుతూ.. ఎంబీఏ చేసి మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలనుందని, ఉస్మానియా వర్సిటీలో సీటు దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. హనీస్ కు చదువంటే మొదటి నుంచి ఇష్టమని, మొదటి ర్యాంక్ తెచ్చుకొని తల్లి కోరికను తీర్చాడని తండ్రి శ్రీనివాసరావు, నాయనమ్మ వెంకటమ్మ అన్నారు. -
టీఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 23, 24 తేదీల్లో నిర్వహించిన ఐసెట్–2019 ఫలితాలు విడుదలఅయ్యాయి. వరంగల్ అర్బన్ కాకతీయ యూనివర్సిటీ హాల్లో సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి.. కేయూ వీసీ ఆచార్య ఆర్.సాయన్న, టీఎస్ ఐసెట్ కన్వీనర్ ఆచార్య సీహెచ్ రాజేశం, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తంతో కలిసి ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. 92.01 శాతం ఉత్తీర్ణత..: టీఎస్ ఐసెట్‌కు మొత్తం 49,565 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 44,561మంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాశారు. వీరిలో 41,002మంది అభ్యర్థులు(92.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. పురుషులు 22,362 మంది పరీక్షకు హాజరుకాగా 20,696 మంది (92.55శాతం), మహిళలు 22,191 మంది హాజరుకాగా 20,299 మంది (91,47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ట్రాన్స్‌జెండర్స్ ఎనిమిది మందిలో ఏడుగురు (87.50 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన మండవ హనీస్ సత్య 160 మార్కులు సాధించి మొదటి ర్యాంకు, హైదరాబాద్ మాచారానికి చెందిన ఎన్ఎస్వీ.ప్రకాశ్‌రావు 159 మార్కులు సాధించి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. కాగా, 20 ర్యాంకుల్లోను అబ్బాయిలదే పైచేయిగా ఉంది. ఇక 5, 11, 19, 20వ ర్యాంకులు మహిళలు సాధించారు. కాకతీయ వర్సిటీ ఎనిమిదోసారి టీఎస్ ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించడంపై వీసీ, రిజిస్ట్రార్, ఐసెట్ కన్వీనర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అభినందించారు. -
రేపు టీఎస్ ఐసెట్ ఫలితాలు
కేయూక్యాంపస్: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ నెల 18న నిర్వహించిన టీఎస్ఐసెట్– 2017 పరీక్ష ఫలితాలు ఈ నెల 31న విడు దల చేయనున్నట్టు టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం వెల్లడించారు. ఈ నెల 30నే ఫలితాలను విడుదల చేయాలని తొలుత షెడ్యూల్ లో ప్రకటించామని, కానీ, 31న సాయంత్రం 4 గంటల కు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విడు దల చేస్తామన్నారు. ఐసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,172 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఈ నెల 21న ప్రాథమిక కీ విడుదల చేసి 27వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించామన్నారు. 60 నుంచి 70 వరకు అభ్యంతరాలు వచ్చాయని ఓంప్రకాశ్ చెప్పారు. హైదరాబాద్‌లో బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న ఫలితాలు విడుదల చేస్తారని, అదేరోజు ఫైనల్ కీ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.