కారుణ్య నియామకాల్లోనూ వివక్ష
టీఎస్పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి
పరిగి: కారుణ్య నియామకాల్లోనూ ప్రభుత్వాలు వివక్ష కొనసాగిస్తున్నాయని టీఎస్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మొగులయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి వెంకటయ్య అన్నారు. ఆదివారం పరిగిలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వారు కులం పేరుతో జరుగుతున్న వివక్షను ఖండించారు. 22 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి ఐదు సంవత్సరాల క్రితం మండలంలోని ఖుదావంద్‌పూర్‌కు చెందిన లక్ష్మయ్య అనే ఉపాధ్యాయుడు మరణిస్తే వారి కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవటం లేదన్నారు. అతను దళితుడు అయినందునే ప్రభుత్వం, అధికారులు, నాయకులు విస్మరిస్తున్నారని తెలిపారు. వెంటనే అతడి భార్యకు ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సకాలంలో ఉద్యోగం కల్పించనందున ఇప్పటికే వారి కుటుంబం ఐదు సంవత్సరాలు నష్టపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అనంతయ్య, శ్రీనివాస్, బిచ్చయ్య, నాగవర్ధన్, కుమార్, రాజేందర్, హన్మయ్య, మంగమ్మ, యాదగిరి, రాంచంద్రయ్య, నరేందర్, లక్ష్మీనరసింహ, కరుణాకర్, లాలయ్య, రాజు పాల్గొన్నారు.