TSRTC special buses
-
భక్తులకు గమనిక.. రథసప్తమికి టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు 80 ప్రత్యేక బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖ ఆలయాలు వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడెం ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులను సంస్థ నడపనుంది. కరీంనగర్ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్ నుంచి గూడెంకు 5, హైదరాబాద్ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్ మహంకాళి, హిమాయత్‌నగర్ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వారు సురక్షితంగా ఆలయాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్నీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వారు స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర, వర్గల్‌కు 108 బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
సంక్రాంతికి అదనంగా 4940 బస్సులు: టీఎస్ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంక్రాంతికి సన్నాహాలు ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే పండగల్లో సంక్రాంతి ఒకటి కావడంతో ఇప్పటికే తమ సొంత ఊర్లకు చేరుకునేందుకు ప్రజలు టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని రంగారెడ్డి ఆర్ఐ కార్యాలయంలో ఆర్టీసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా 4940 అదనపు బస్సులను సిద్ధం చేసినట్లు రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. వీటిలో తెలంగాణకు 3414 బస్సులను ఆంధ్ర ప్రాంతానికి 1526 బస్సులను అదనంగా కేటాయించామన్నారు.. జనవరి 9వ తేది నుంచి 13 వరకు ఈ అదనపు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అలాగే ఊర్ల నుంచి తిరిగి వచ్చే వారి కోసం జనవరి 17న అదనపు బస్సలు నడుపుతున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా గతేడాది రూ. 5 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది రూ. 6 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
మేడారానికి పోటెత్తిన లక్షలాది భక్తులు
మేడారం: వరంగల్ జిల్లా మేడారం పండుగ కళను సంతరించుకుంది. అతిపెద్ద గిరిజనోత్సవమైన సమ్మక్క సారలమ్మ వేడుక ప్రారంభమైన తొలిరోజున భారీ సంఖ్యలో తరలివచ్చారు. జాతర నేపథ్యంలో ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ 2,745 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కల్పించిన బస్సు సర్వీసుల సాయంతో సాయంత్రం ఆరు గంటల వరకు 1,24,238 మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని టీఎస్ ఆర్టీసీ జేఎండీ జీవీ రమణారావు తెలిపారు. ఈ నెల 20 వరకు కన్నుల పండువగా ఈ జాతర కొనసాగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.