tuda
-
మాస్క్ ధరించమన్నందుకు దాడి, సెల్‌ఫోన్ ధ్వంసం
తిరుపతి తుడా: మాస్కులు ధరించకపోవడంతో రూ.100 జరిమానా విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో కొందరు సచివాలయ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక అమెరికన్ బార్ సమీపంలో సచివాలయ సిబ్బంది కరోనా కట్టడి చర్యల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దాడిలో పగిలిపోయిన ప్రభుత్వ ఫోన్ తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కమిషనర్ గిరీషా ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది రంగంలోకి దిగారు. మాస్కులు లేకుండా ముగ్గురు ప్రజల మధ్య తిరుగుతుండడం గుర్తించి మాస్కు ధరించాలని సచివాలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినిపించుకోలేదు. దీంతో రూ.100 జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆ ముగ్గురూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంమత్తులో ఉన్న వారు సచివాలయ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. జరిమానా విధించే ప్రభుత్వ మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. శానిటరీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
తుడా: ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీ సహా మరో 13 మండలాలను తుడా(టీయూడీఏ)లో విలీనం చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వరదయపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తరించిన శ్రీసిటీ సెజ్ ఉన్న11 గ్రామాలను మినహాయించి, తుడా పరిధిలోకి కొత్తగా 3260 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దీంతో తుడా పరిధి 4472 చదరపు కిలోమీటర్లకు చేరింది.(చదవండి: మహిళలూ..! మహరాణులూ..!!) -
స్వచ్ఛత సాగేదిలా..
తిరుపతి తుడా: స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పోటీల్లో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసేందుకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్ టన్నుల చెత్తను జీరో స్టోరేజ్‌గా అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛత కోసం చేస్తున్న ప్రయోగాలు, మార్పులపై కమిషనర్ గిరీషా అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ యాత్రను చేపట్టారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్ ఇంజినీర్ ఉదయ్‌కుమార్, డి ప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వరరెడ్డి, మున్సి పల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డీఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి స్వచ్ఛత, సాలిడ్ వేస్టు నిర్వహణపై అందించిన వివరాలు ఇవి.. ♦ చెత్త రోడ్డుపైకి రాకముందే ఇంటి వద్దే సేకరించేందుకు పూర్తిస్థాయిలో కార్మికులను నియమించుకుని 100 శాతం సేకరిస్తున్నారు. 60 శాతం ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి సేకరిస్తున్నారు. ఇందుకోసం 905 మంది కార్మికులు, 371 పుష్కాట్లు, 25 ఆటోలు, 20 కాంప్యాక్టర్లు, 15 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, 6 చిన్న జేసీబీలు ఉపయోగిస్తున్నారు. ♦ నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్ టన్నుల చెత్తలో 120 టన్నుల తడి చెత్త ఉంది. 52 టన్నుల పొడి చెత్త, 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాల తరలింపునకు 3 ట్రాన్స్ఫర్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోమల్‌రెడ్డి కూడలి వద్ద ఒక స్టేషన్‌ను రూ.8 కోట్ల ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. ♦ నగరంలో రోజుకు ఉత్పత్తయ్యే 120 టన్నుల తడి చెత్తలో 50 టన్నుల చెత్తను బయోగ్యాస్‌కు ఉపయోగిస్తున్నారు. 1,500 వందల కేజీల గ్యాస్ ఉత్పత్తులను ఇక్కడ నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద బయోగ్యాస్ ప్లాంట్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఈ గ్యాస్‌ను నగరంలోని 10 హోటళ్లకు సరఫరా చేసి మిగిలిన దాన్ని చెన్నై, బెంగళూరు హోటళ్లకు తరలిస్తున్నారు. ♦ నిత్యం ఉత్పత్తయ్యే 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిష్) ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ♦ తూకివాకంలోని గ్రీన్ సిటీలో విన్డ్రో కంపోస్టు ద్వారా రోజుకు 60 టన్నుల చెత్తను విన్డ్రో, బాక్స్ కంపోస్టు ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువులను పార్కులు, మొక్కల పెంపకానికి ఉపయోగస్తున్నారు. బయో మైనింగ్ 35 ఏళ్ల నాటి నుంచి రామాపురం సమపంలోని డంపింగ్ యార్డులో సుమారు 5 లక్షల టన్నుల చెత్త నిల్వ ఉంది. ఈ చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్ చేపట్టడం ద్వారా జీరో స్థాయి నిల్వ లక్ష్యంగా బయో మైనింగ్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. రోజుకు 600 టన్నుల చెత్తను సెగ్రిగేషన్ (వేరుచేయడం), రీసైక్లింగ్(తిరిగి వినియోగంలోకి) చేస్తున్నారు. తద్వారా ఆరు నెలల్లో డంపింగ్ యార్డుల్లోని చెత్తను కనుమరుగు చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఇక్కడ వెలికి తీసుకున్న ఇనుము, ప్లాస్టిక్, రాయి, టైర్లను రీసైక్లింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఏళ్ల నాటి చెత్త కావడంతో ఇప్పటి వరకు 10 వేల టన్నుల ఎరువును విక్రయానికి సిద్ధంగా ఉంచారు. మిగులు చెత్తను సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో.. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తిరుపతి కిరీటాన్ని దక్కించుకుంటాం. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్ చేస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్ అమలు చేస్తున్న కొత్త ప్రయోగాలతో వచ్చే ఏడాది కల్లా దేశంలో మరేనగరం పోటీ పడనంతగా ఉండబోతోంది. ఇంటింటా చెత్త సేకరణ ఇకపై వాహనాల ద్వారానే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు స్వచ్ఛ పోటీలకు అత్యంత కఠినమైన రోజులు, ఈ నేపథ్యంలో ప్రజలు మరింతగా సహకరించాల్సి ఉంది. – పీఎస్ గిరీష, కమిషనర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ -
తుడా అధికారులతో చెవిరెడ్డి సమీక్ష సమావేశం
-
తుడా చైర్మన్‌గా వెంకటరమణ
అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ తుడా చైర్మన్‌గా నియమితు లయ్యారు. తుమ్మితే ఊడే ముక్కులాంటి ఈ పదవిని ఆయన ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాక కాంగ్రెస్ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) చైర్మన్‌గా మాజీ ఎమ్మెలే ్య వెంకటరమణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 2010లో తుడా చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఆ పదవిపై కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశలు పెంచుకుని తమ ప్రయత్నాలు సాగించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సాహసించని పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే వెంకటరమణకు తుడా చైర్మన్ పదవిని కట్టబెట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తుడా చైర్మన్‌గా వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటరమణ అభిమానులు కార్యాలయం వెలుపల పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చి హర్షం ప్రకటించారు. పలువురునాయకులు, కార్యకర్తలు వెంకటరమణకు పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందనలు తెలిపారు. కాగా 1982 ఆగస్టు 11న తుడా ఆవిర ్భవించింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాల్లోని 160 పంచాయతీలు తుడా పరిధిలో ఉన్నాయి. తుడా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు 11 మంది చైర్మన్లుగా పనిచేశారు. వెంకటరమణ 12వ వారు. -
మూడో కంటికి తెలియకనే..
సాక్షి, తిరుపతి: తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా ఆయన నియామకం జరిగిపోయింది. కాంగ్రెస్ నేతలందరూ రాష్ట్ర విభజనకు సంబంధించి జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తే మాజీ ఎమ్మెల్యే మాత్రం తుడా చైర్మన్ పదవిపై కన్నేసి మూడో కంటికి తెలియకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టడానికి కొద్ది గంటల ముందు మాత్రమే విషయం లీక్ అయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలా జరగడం చాలా అరుదు. నామినేటెడ్ పదవుల నియామకం దాదాపుగా ఉండదనుకుం టున్న సమయంలో వెంకటరమణ రాజధానిలో చక్రం తిప్పారు. తుడా చైర్మన్ పదవి 2010 నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో చివరి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీకాలం ముగిసే సమయంలో వెంకట రమణను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తుడా చైర్మన్ పదవి కోసం వెంకటరమణతో పాటు మాజీ మంత్రి ఆర్.చెంగారెడ్డి కుమార్తె ఇందిర ప్రియదర్శిని, మంత్రి గల్లా అరుణకుమారి వర్గానికి చెందిన ఎమ్మార్సీ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. వీరితో పాటుశ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ.నాయుడు సైతం ప్రయత్నించారు. అయితే కిందటి ఏడాది తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వెంకటరమణ ఇప్పుడు దానినే అస్త్రంగా ఎంచుకున్నారు. ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి నష్టపోయానని కనీసం తుడా చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద వాపోయినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సుముఖంగా లేనప్పటికీ వెంకటరమణ అభ్యర్థనను మన్నించి ఈ నియామకానికి మొగ్గు చూపినట్టు తెలిసింది. ప్రభుత్వానికి కాలం చెల్లనున్న సమయంలో కీలకమైన తుడా చైర్మన్ నియామకం రహస్యంగా చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేసింది. మూణ్ణాళ్ల ముచ్చటేనా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి తుడా చైర్మన్‌గా నియమితులైనప్పటికీ వెంకటరమణకు ఈ పదవి మూణ్ణాళ్ల ముచ్చటేనని తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు సంఘీభావంగా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా కాంగ్రెస్ ప్రముఖులు కూడా పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంకటరమణ తుడా చైర్మన్ పదవిని ఆశించడమే పొరబాటు నిర్ణయమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పార్టీలో తన పట్టు సడలలేదని నిరూపించుకునేందుకు తమ నాయకుడు ఈ పదవిని తెచ్చుకున్నారని మాజీ ఎమ్మెల్యే అనుయాయులు అంటున్నారు. కొద్ది రోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చుకోవడం కాని, ఉన్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం కానీ లేనందున తుడా చైర్మన్ పదవి కేవలం అలంకారప్రాయంగా మారనుందని తెలుస్తోంది. ఎవరి అభిప్రాయాలు, వాదనలు ఎలా ఉన్నా వెంకటరమణ మాత్రం పార్టీలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, రెండు సార్లు మున్సిపల్ వైస్ ైచె ర్మన్‌గా పనిచేసిన ఆయన 2004 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పలు కీలక పదవులు అలంకరించిన వెంకటరమణ ప్రస్తుతం తుడా 12వ చైర్మన్‌గా నియమితులయ్యారు. గతంలో ఏ.మోహన్, భూమన కరుణాకరరెడ్డి తుడా చైర్మన్లుగా పనిచేసిన తరువాత శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వెంకటరమణ మాత్రం శాసనసభ్యునిగా పనిచేసిన తరువాత తుడా చైర్మన్‌గా నియమితులయ్యారు.