TUGLAQ
-
కేజ్రీవాల్‌పై గౌతమ్ గంభీర్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశరాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దాంతో ఎక్కడికక్కడ వర్షపు నీరు రోడ్డు మీద నిలిచిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద విమర్శల వర్షం కురిపించారు. ఓ వీడియోను ట్వీట్ చేసిన గంభీర్ ఢిల్లీ సీఎంని తుగ్లక్తో పోల్చారు. ఈ వీడియోలో 10-15 మంది ప్రయాణికులతో ఉన్న ఓ ఒంటెద్దు బండి వాన నీటితో నిండిన వీధులగుండా ప్రయాణం చేస్తోంది. కొద్ది దూరం వెళ్లగానే బ్యాలెన్స్ తప్పి ప్రయాణికులు పడిపోతారు. కిందపడ్డవారిని వదిలేసి బండి వెళ్లి పోతుంది. ఈ సంఘటనను ఉద్దేశించి గంభీర్.. ‘ఇది 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలించిన ఢిల్లీ కాదు.. 21వ శతాబ్దపు తుగ్లక్ పాలన ఇది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (‘ఈ ఫోటో నా జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది’) ये 14वीं सदी के तुग़लक़ की नहीं बल्कि 21वीं सदी के तुग़लक़ की दिल्ली है! pic.twitter.com/zM9ug41cXI — Gautam Gambhir (@GautamGambhir) August 13, 2020 గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలోని జకీరాలో ఓ బస్సు, ఆటో, కారు నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రయాణికులు కారు, ఆటోను బయటకు లాగడంలో విజయం సాధించారు కానీ బస్సును బయటకు తీసుకురాలేకపోయారు. ఇదిలా ఉండగా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్టాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. పాలమ్ అబ్జర్వేటరీలో గురువారం తెల్లవారుజామున 5:30గంటల వరకు 86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రంలో 42.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్‌గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్ కుమార్ రాసిన ‘డీమానెటైజేషన్ అండ్ ద బ్లాక్ ఎకానమీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు. -
గురితప్పని వ్యంగ్యాస్త్రం
- శ్రీనివాస అయ్యర్ రామస్వామి (చో రామస్వామి) 1934 అక్టోబరు 5న ప్రముఖ లాయర్ శ్రీనివాస అయ్యర్- రాజమ్మాళ్ దంపతులకు జన్మించారు. మద్రాసులోని మైలాపూర్ ప్రాంతంలో పెరిగిన ఆయన లా చదివారు. నాటక రంగంపై ఆసక్తితో ఓ నాటకగ్రూపులో చేరారు. తల్లి సంధ్యతో కలిసి రిహార్సల్స్‌కు వచ్చే జయలలిత తొలినాళ్ల నుంచే రామస్వామికి తెలుసు. వీరిద్దరూ కలిసి సినిమాల్లోనూ నటించారు. ఆరేళ్లపాటు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి... తర్వాత టీటీకే గ్రూపులో లీగల్ అడ్వైజర్‌గా చేరారు. మరోవైపు నాటికలు రాస్తూ నటించేవారు. మొత్తం 23 నాటికలు రాశారు. ఇందులో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ ప్రముఖంగా చెప్పుకోదగ్గది. తుగ్లక్ మళ్లీ పుట్టి భారతదేశానికి ప్రధానమంత్రి కావడం దీని ఇతివృత్తం. ఇది బాగా జనాదరణ పొంది సినిమాగానూ వచ్చింది. దాదాపు రెండు వందల సినిమాల్లో రామస్వామి నటించారు. 14 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశారు... నాలుగింటికి దర్శకత్వం వహించారు. కామెడీ బాగా చేసేవారు. తెన్మోజియాల్ అనే నాటకంలో ‘చో’ పేరుతో ఉన్న పాత్రను చేసినప్పటి నుంచి ఆయన పేరు చో రామస్వామిగా మారింది. ఎంజీఆర్, రజనీకాంత్, జయలలిత లాంటి హేమాహేమీలతో కలిసి నటించారు. 1970లో రాజకీయ వారపత్రిక ‘తుగ్లక్’ను ప్రారంభించారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వాలను నిలదీయడంలో చో రామస్వామి సుప్రసిద్ధుడు. సమకాలీన రాజకీయ పరిణామాలపై నిశిత పరిశీలనా దృష్టి, ఎంతటి వారినైనా నిర్మొహమాటంగా విమర్శించే తెగువ, సందర్భోచితంగా వ్యంగ్యాస్త్రాలు... చో రామస్వామిని విలక్షణ సంపాదకుడిగా నిలబెట్టాయి. ప్రభుత్వాలు సుపరిపాలన అందించాలని... ఆ దిశగా తుగ్లక్ వారపత్రిక బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలని నమ్మేవారాయన. మతపరమైన విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ... హిందూత్వవాదులకు, వామపక్ష భావజాలమున్న వారినీ... అందరినీ సమదృష్టితో కడిగేసేవారు. తమిళనాడులో పౌరహక్కుల ఉద్యమంలోనూ చో రామస్వామి చురుకుగా పనిచేశారు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్త శ్రీలన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమానికీ సారథ్యం వహించారు. ఎంజీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే గట్టిగా వ్యతిరేకించారు. నక్సలైట్ల హింసను వ్యతిరేకించి... పీయూసీఎల్తో విబేధించారు. ప్రతి సంవత్సరం జనవరి 14న తుగ్లక్ వ్యవస్థాపక దినోత్సవం రోజున తన పాఠకులను కలుసుకోవడం, సిబ్బందిని సన్మానించడాన్ని వార్షిక కార్యక్రమంగా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠకుల ప్రశ్నలకు తనదైన శైలిలో వ్యంగ్యంగా, చలోక్తులతో జవాబులిచ్చేవారు. ఈ వార్షిక కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెందరో అతిథులుగా హాజరయ్యారు. వీరిలో మోదీ కూడా ఒకరు. 1999లో రాష్ట్రపతితో రాజ్యసభకు నామినేట్ అయిన చో రామస్వామి 2005దాకా పెద్దల సభ సభ్యుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన చోకు ఇందిరాగాంధీతో పాటు వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీలతో మంచి పరిచయడం ఉండేది. ఎంత తీవ్రంగా విమర్శించినా... పార్టీలకతీతంగా చో అగ్రనేతలతో సంబంధాలు నెరిపారు. జయలలిత గౌరవించే కొద్దిమందిలో చో రామస్వామి ఒకరు. చిన్నతనం నుంచే ఆయనతో కలిసి నటించిన జయలలిత రాజకీయంగా కష్టకాలంలో ఉన్నపుడు పలుమార్లు చో సలహాలు తీసుకున్నారు. అయితే ఆయన జయలలితనూ వదల్లేదు. ముఖ్యమంత్రిగా ఆమె పదవీకాలంలో పలు అవినీతి ఆరోపణలు రావడం, శశికళతో ఆమె సాన్నిహిత్యం... వీటిపై చో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. చో రాజకీయ ఎత్తుగడలు కూడా వీరి మధ్య విబేధాలను పెంచాయి. 1996లో జీకే ముపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)కి డీఎంకేతో పొత్తు కుదుర్చడంలో చో ముఖ్యభూమిక పోషించారు. అలాగే రాజకీయంగా ఏనాడూ పెద్దగా బయటపడని తన మిత్రుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఎన్నికలకు ముందు పిలుపు ఇప్పించారు. ‘జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు’ అని రజనీ విసిరిన పంచ్ డైలాగ్‌తో కరుణానిధి అధికారంలోకి వచ్చారు. తర్వాతికాలంలో చో, జయలలిత మళ్లీ దగ్గరయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రిగా సలహాదారు పాత్రను పోషించారు. 2010లో విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు కుదరడంలోనూ కీలకంగా పనిచేశారు. 2011లో జయ అధికారం చేపట్టిన వెంటనే శశికళను దూరం పెట్టాలని సలహా ఇచ్చారు. కానీ కొద్దినెలల్లోనే శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌లో అడుగుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో అన్నాడీఎంకేకు పొత్తు కుదుర్చాలని చో గట్టిగానే ప్రయత్నించినా... కార్యరూపం దాల్చలేదు. కిందటేడాది చో రామస్వామి ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో ఉన్నపుడు జయలలిత వచ్చి పరామర్శించారు. నరేంద్ర మోదీతోనూ చో రామస్వామికి మంచి సంబంధాలుండేవి. 2014 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడే ... మోదీని ప్రధాని అభ్యర్థిని చేయాలని తొలుత మాట్లాడింది చో రామస్వామియే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై వచ్చినపుడు ప్రధాని ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఈ ఏడాది జనవరి 14 తుగ్లక్ పత్రిక వార్షికోత్సవానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి.కరుపయ్యను చో ఆహ్వానించారు. శశికళకు బద్ధ వ్యతిరేకి అయిన కరుపయ్య... జయలలిత హయాంలో పెరిగిపోయిన అవినీతి గురించి ఆ కార్యక్రమంలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి చోతో జయ మాట్లాడటం మానేశారని అంటారు. తుగ్లక్ వారపత్రికకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటనలు కూడా ఆగిపోయాయి. గురుశిష్య సంబంధం నెరిపిన వీరిలో జయలలిత సోమవారం రాత్రి మరణించగా... అదే అపోలో ఆసుపత్రిలో చో బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో
తుగ్లక్ వారపత్రికను చో రామస్వామి 1970 జనవరి 14న ‘తమిళ సంక్రాంతి’ రోజు ప్రారంభించారు. వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్న చో ఎన్నో సంఘటనల మీద పదునైన కాలమ్స్ రాశారు. ముఖచిత్రంగా పొలిటికల్ కార్టూన్ ఉండే ఈ పత్రిక సర్క్యులేషన్ 75,000. నలబై ఆరేళ్లుగా నిరాటంకంగా వస్తున్న తుగ్లక్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం రెండు వారాల పాటు నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితికి నిరసనగా, తర్వాతి వారం పూర్తి నల్లటి ముఖచిత్రంతో సంచికను విడదుల చేశారు చో. ఎమర్జెన్సీ సమయంలో తుగ్లక్లోని వాణిజ్య ప్రకటనలు కూడా సెన్సార్ కావడం గమనార్హం. బాబ్రీ మసీదు ధ్వంసానంతరం కూడా ముఖచిత్రాన్ని నలుపు రంగులో ముద్రించారు. పత్రిక వార్షికోత్సవం రోజున వివిధ రంగాల్లోని ప్రముఖులు సహా, తుగ్లక్ అభిమానులందరూ ఒకచోట చేరతారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు చో ఇచ్చే చురుకైన సమాధానాలు ఈ ఉత్సవంలోని హైలైట్! మహమ్మద్ బిన్ తుగ్లక్ 1968లో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ పేరుతో తమిళంలో నాటకం రాశారు చో. రాజకీయ అనౌచిత్యాల మీద వ్యంగ్యాస్త్రం ఇది. మూడేళ్ల తర్వాత దాన్నే సినిమాగా తీశారు. రచన, దర్శకత్వ బాధ్యతలతో పాటు, తుగ్లక్ పాత్రను కూడా చో పోషించారు. 14వ శతాబ్దానికి చెందిన తుగ్లక్ 1968లో ఉన్నట్టుండి ఒక మూలికవల్ల శవపేటికలోంచి నిద్ర లేస్తాడు. దేశవ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో తుగ్లక్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతాడు. తన పార్టీలో చేరిన 450 మందిని ఉపప్రధానులను చేస్తాడు. ఇలా సాగే ఈ చిత్రం బెస్ట్ పొలిటికల్ సెటైర్‌గా నిలిచింది. నాగభూషణం ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెలుగులోనూ వచ్చింది. పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో 1981లో సంజయ్ గాంధీ స్మృత్యర్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కోపోద్రిక్తుడయ్యారు చో. సంజయ్‌గాంధీతో పాటు విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుభాష్ సక్సేనా కూడా అలాంటి స్టాంపునకు అర్హుడే అని భావించారు. తుగ్లక్ పత్రికలో అచ్చమైన పోస్టల్ స్టాంపుల్లాగా పూర్తిపేజీ సక్సేనా స్టాంపులు ముద్రించారు. చిత్రంగా, చాలామంది పాఠకులు వాటిని చించి కవర్ల మీద అంటించడమే కాదు, పోస్టల్ శాఖ కూడా వాటిని నిజమైనవిగా నమ్మి స్టాంపులు కొట్టింది. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
చిట్యాల : రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. టేకుమట్ల మండలం చేయాలని పార్టీ నేత పులి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం గిద్దెముత్తారం నుంచి టేకుమట్ల వరకు 11 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు. ఈసందర్భంగా రేవూరి మాట్లాడుతూ కేసీఆర్ జిమ్మిక్కు పాలన చేస్తున్నాడన్నారు. రోజుకో మాటతో ప్రజలను మభ్యపెడుతున్నాడని, జిల్లా, మండల పునర్విభజన శాస్త్రీయంగా లేవని ఆరోపించారు. టేకుమట్లను మండలం చేస్తానని ప్రకటించిన స్పీకర్ మధుసూదనాచారి ఇప్పుడు పట్టించుకోవడం లేద న్నారు. మాజీ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ జనగాం, ములుగు సమ్మక్క–సారలమ్మ జిల్లా లు చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. మండలాలను కుమారులకు పంచారు.. స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ మధుసూధనాచారి పాలన తీరు అధ్వానంగా ఉందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు అన్నా రు. ఆరు మండలాలను ముగ్గురు కొడుకులకు అప్పగించి వసూళ్ల దందా కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. వారి ఆగడాలు, బెదిరింపులు భరించలేక కాంట్రాక్టర్లు, అధికారులు పారిపోతున్నారని అన్నారు. టేకుమట్ల మండలం అయిందని స్థలాన్ని పరిశీలించి సంబరాలలో పాల్గొన్న స్పీకర్ మళ్లీ ఎందుకు రద్దు చేయిం చారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి శ్రీదేవి, నాయకులు రత్నాకర్‌రెడ్డి, తోట గట్టయ్య, ఓరం సమ్మయ్య, దొడ్డి కిష్టయ్య, లింగయ్య, రాజ మౌళి, లచ్చిరెడ్డి, శంకర్, రాజేందర్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, కొంరయ్య, సాంబ శివుడు, వెంకట్‌నాయక్, శివ, రాజు, కుమార్ పాల్గొన్నారు.