- శ్రీనివాస అయ్యర్ రామస్వామి (చో రామస్వామి) 1934 అక్టోబరు 5న ప్రముఖ లాయర్ శ్రీనివాస అయ్యర్- రాజమ్మాళ్ దంపతులకు జన్మించారు. మద్రాసులోని మైలాపూర్ ప్రాంతంలో పెరిగిన ఆయన లా చదివారు. నాటక రంగంపై ఆసక్తితో ఓ నాటకగ్రూపులో చేరారు. తల్లి సంధ్యతో కలిసి రిహార్సల్స్‌కు వచ్చే జయలలిత తొలినాళ్ల నుంచే రామస్వామికి తెలుసు. వీరిద్దరూ కలిసి సినిమాల్లోనూ నటించారు. ఆరేళ్లపాటు మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి... తర్వాత టీటీకే గ్రూపులో లీగల్ అడ్వైజర్‌గా చేరారు. మరోవైపు నాటికలు రాస్తూ నటించేవారు. మొత్తం 23 నాటికలు రాశారు. ఇందులో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ ప్రముఖంగా చెప్పుకోదగ్గది.
తుగ్లక్ మళ్లీ పుట్టి భారతదేశానికి ప్రధానమంత్రి కావడం దీని ఇతివృత్తం. ఇది బాగా జనాదరణ పొంది సినిమాగానూ వచ్చింది. దాదాపు రెండు వందల సినిమాల్లో రామస్వామి నటించారు. 14 సినిమాలకు స్క్రీన్‌ప్లే రాశారు... నాలుగింటికి దర్శకత్వం వహించారు. కామెడీ బాగా చేసేవారు. తెన్‌మోజియాల్ అనే నాటకంలో ‘చో’ పేరుతో ఉన్న పాత్రను చేసినప్పటి నుంచి ఆయన పేరు చో రామస్వామిగా మారింది. ఎంజీఆర్, రజనీకాంత్, జయలలిత లాంటి హేమాహేమీలతో కలిసి నటించారు.
1970లో రాజకీయ వారపత్రిక ‘తుగ్లక్’ను ప్రారంభించారు. రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో ప్రభుత్వాలను నిలదీయడంలో చో రామస్వామి సుప్రసిద్ధుడు. సమకాలీన రాజకీయ పరిణామాలపై నిశిత పరిశీలనా దృష్టి, ఎంతటి వారినైనా నిర్మొహమాటంగా విమర్శించే తెగువ, సందర్భోచితంగా వ్యంగ్యాస్త్రాలు... చో రామస్వామిని విలక్షణ సంపాదకుడిగా నిలబెట్టాయి. ప్రభుత్వాలు సుపరిపాలన అందించాలని... ఆ దిశగా తుగ్లక్ వారపత్రిక బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరించాలని నమ్మేవారాయన. మతపరమైన విశ్వాసాలు బలంగా ఉన్నప్పటికీ... హిందూత్వవాదులకు, వామపక్ష భావజాలమున్న వారినీ... అందరినీ సమదృష్టితో కడిగేసేవారు. తమిళనాడులో పౌరహక్కుల ఉద్యమంలోనూ చో రామస్వామి చురుకుగా పనిచేశారు. సీపీఐ (ఎంఎల్) కార్యకర్త శ్రీలన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఉద్యమానికీ సారథ్యం వహించారు.
ఎంజీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై ఆంక్షలు విధించడానికి ప్రయత్నిస్తే గట్టిగా వ్యతిరేకించారు. నక్సలైట్ల హింసను వ్యతిరేకించి... పీయూసీఎల్‌తో విబేధించారు. ప్రతి సంవత్సరం జనవరి 14న తుగ్లక్ వ్యవస్థాపక దినోత్సవం రోజున తన పాఠకులను కలుసుకోవడం, సిబ్బందిని సన్మానించడాన్ని వార్షిక కార్యక్రమంగా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠకుల ప్రశ్నలకు తనదైన శైలిలో వ్యంగ్యంగా, చలోక్తులతో జవాబులిచ్చేవారు. ఈ వార్షిక కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెందరో అతిథులుగా హాజరయ్యారు. వీరిలో మోదీ కూడా ఒకరు. 1999లో రాష్ట్రపతితో రాజ్యసభకు నామినేట్ అయిన చో రామస్వామి 2005దాకా పెద్దల సభ సభ్యుడిగా పనిచేశారు. ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించిన చోకు ఇందిరాగాంధీతో పాటు వాజ్‌పేయి, ఎల్.కె.అద్వానీలతో మంచి పరిచయడం ఉండేది. ఎంత తీవ్రంగా విమర్శించినా... పార్టీలకతీతంగా చో అగ్రనేతలతో సంబంధాలు నెరిపారు.
జయలలిత గౌరవించే కొద్దిమందిలో చో రామస్వామి ఒకరు. చిన్నతనం నుంచే ఆయనతో కలిసి నటించిన జయలలిత రాజకీయంగా కష్టకాలంలో ఉన్నపుడు పలుమార్లు చో సలహాలు తీసుకున్నారు. అయితే ఆయన జయలలితనూ వదల్లేదు. ముఖ్యమంత్రిగా ఆమె పదవీకాలంలో పలు అవినీతి ఆరోపణలు రావడం, శశికళతో ఆమె సాన్నిహిత్యం... వీటిపై చో విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. చో రాజకీయ ఎత్తుగడలు కూడా వీరి మధ్య విబేధాలను పెంచాయి. 1996లో జీకే ముపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)కి డీఎంకేతో పొత్తు కుదుర్చడంలో చో ముఖ్యభూమిక పోషించారు. అలాగే రాజకీయంగా ఏనాడూ పెద్దగా బయటపడని తన మిత్రుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఎన్నికలకు ముందు పిలుపు ఇప్పించారు. ‘జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా రక్షించలేడు’ అని రజనీ విసిరిన పంచ్ డైలాగ్‌తో కరుణానిధి అధికారంలోకి వచ్చారు. తర్వాతికాలంలో చో, జయలలిత మళ్లీ దగ్గరయ్యారు. అన్నాడీఎంకే అధినేత్రిగా సలహాదారు పాత్రను పోషించారు. 2010లో విజయ్‌కాంత్ నాయకత్వంలోని డీఎండీకేకు అన్నాడీఎంకేతో పొత్తు కుదరడంలోనూ కీలకంగా పనిచేశారు. 2011లో జయ అధికారం చేపట్టిన వెంటనే శశికళను దూరం పెట్టాలని సలహా ఇచ్చారు. కానీ కొద్దినెలల్లోనే శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌లో అడుగుపెట్టారు.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీతో అన్నాడీఎంకేకు పొత్తు కుదుర్చాలని చో గట్టిగానే ప్రయత్నించినా... కార్యరూపం దాల్చలేదు. కిందటేడాది చో రామస్వామి ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రిలో ఉన్నపుడు జయలలిత వచ్చి పరామర్శించారు. నరేంద్ర మోదీతోనూ చో రామస్వామికి మంచి సంబంధాలుండేవి. 2014 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పుడే ... మోదీని ప్రధాని అభ్యర్థిని చేయాలని తొలుత మాట్లాడింది చో రామస్వామియే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను చెన్నై వచ్చినపుడు ప్రధాని ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఈ ఏడాది జనవరి 14 తుగ్లక్ పత్రిక వార్షికోత్సవానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి.కరుపయ్యను చో ఆహ్వానించారు. శశికళకు బద్ధ వ్యతిరేకి అయిన కరుపయ్య... జయలలిత హయాంలో పెరిగిపోయిన అవినీతి గురించి ఆ కార్యక్రమంలో విమర్శలు గుప్పించారు. అప్పటి నుంచి చోతో జయ మాట్లాడటం మానేశారని అంటారు. తుగ్లక్ వారపత్రికకు తమిళనాడు ప్రభుత్వం ప్రకటనలు కూడా ఆగిపోయాయి. గురుశిష్య సంబంధం నెరిపిన వీరిలో జయలలిత సోమవారం రాత్రి మరణించగా... అదే అపోలో ఆసుపత్రిలో చో బుధవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.
-సాక్షి నాలెడ్జ్ సెంటర్