పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో
తుగ్లక్ వారపత్రికను చో రామస్వామి 1970 జనవరి 14న ‘తమిళ సంక్రాంతి’ రోజు ప్రారంభించారు. వ్యవస్థాపక సంపాదకుడిగా ఉన్న చో ఎన్నో సంఘటనల మీద పదునైన కాలమ్స్ రాశారు. ముఖచిత్రంగా పొలిటికల్ కార్టూన్ ఉండే ఈ పత్రిక సర్క్యులేషన్ 75,000. నలబై ఆరేళ్లుగా నిరాటంకంగా వస్తున్న తుగ్లక్ ఎమర్జెన్సీ సమయంలో మాత్రం రెండు వారాల పాటు నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితికి నిరసనగా, తర్వాతి వారం పూర్తి నల్లటి ముఖచిత్రంతో సంచికను విడదుల చేశారు చో. ఎమర్జెన్సీ సమయంలో తుగ్లక్‌లోని వాణిజ్య ప్రకటనలు కూడా సెన్సార్ కావడం గమనార్హం. బాబ్రీ మసీదు ధ్వంసానంతరం కూడా ముఖచిత్రాన్ని నలుపు రంగులో ముద్రించారు. పత్రిక వార్షికోత్సవం రోజున వివిధ రంగాల్లోని ప్రముఖులు సహా, తుగ్లక్ అభిమానులందరూ ఒకచోట చేరతారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు చో ఇచ్చే చురుకైన సమాధానాలు ఈ ఉత్సవంలోని హైలైట్!
మహమ్మద్ బిన్ తుగ్లక్
1968లో ‘మహ్మద్ బిన్ తుగ్లక్’ పేరుతో తమిళంలో నాటకం రాశారు చో. రాజకీయ అనౌచిత్యాల మీద వ్యంగ్యాస్త్రం ఇది. మూడేళ్ల తర్వాత దాన్నే సినిమాగా తీశారు. రచన, దర్శకత్వ బాధ్యతలతో పాటు, తుగ్లక్ పాత్రను కూడా చో పోషించారు. 14వ శతాబ్దానికి చెందిన తుగ్లక్ 1968లో ఉన్నట్టుండి ఒక మూలికవల్ల శవపేటికలోంచి నిద్ర లేస్తాడు. దేశవ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టిస్తుంది. ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో తుగ్లక్ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అవుతాడు. తన పార్టీలో చేరిన 450 మందిని ఉపప్రధానులను చేస్తాడు. ఇలా సాగే ఈ చిత్రం బెస్ట్ పొలిటికల్ సెటైర్‌గా నిలిచింది. నాగభూషణం ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెలుగులోనూ వచ్చింది.
పోస్టల్ శాఖను తప్పుదోవ పట్టించిన చో
1981లో సంజయ్ గాంధీ స్మృత్యర్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగానే కోపోద్రిక్తుడయ్యారు చో. సంజయ్‌గాంధీతో పాటు విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సుభాష్ సక్సేనా కూడా అలాంటి స్టాంపునకు అర్హుడే అని భావించారు. తుగ్లక్ పత్రికలో అచ్చమైన పోస్టల్ స్టాంపుల్లాగా పూర్తిపేజీ సక్సేనా స్టాంపులు ముద్రించారు. చిత్రంగా, చాలామంది పాఠకులు వాటిని చించి కవర్ల మీద అంటించడమే కాదు, పోస్టల్ శాఖ కూడా వాటిని నిజమైనవిగా నమ్మి స్టాంపులు కొట్టింది.