సమస్యలు పరిష్కరిస్తాం
♦ రెండు రాష్ట్రాల సీఎంలతో కూర్చొని మాట్లాడుకుంటాం
♦ తెలంగాణకే గవర్నర్ అన్న ఆరోపణల్లో వాస్తవం లేదు
♦ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి/విజయవాడ(ఇంద్రకీలాద్రి): రెండు రాష్ట్రాలమధ్య చిన్నచిన్న సమస్యలున్నా.. వాటిని సమష్టిగా పరిష్కరించుకుంటామని ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గురువారం ఆయన సీఎం చంద్రబాబుతో కలసి వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించారు.
మొదటిసారిగా వెలగపూడికి వచ్చిన గవర్నర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ స్వాగతం పలికారు. అనంతరం నేరుగా ఐదో బ్లాక్‌లోకి తీసుకెళ్లారు. గత నెల 29న ప్రారంభించిన మంత్రులు, అధికారుల చాంబర్లను చూపించారు. ఏఏ శాఖలు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయనున్నదీ గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించారు.
అనంతరం నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. నిన్న రాత్రి(బుధవారం) సీఎం చంద్రబాబుతో ఫలప్రదమైన చర్చలు జరిగాయన్నారు. చంద్రబాబు అనేక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకునేలా రెండు రాష్ట్రాలు వ్యవహరించాలని కోరారు. అందుకే రెండు రాష్ట్రాల సీఎంలతో కూర్చొని సమస్యలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సీఎం నివాసానికి, సచివాలయానికి తాను వెళ్లటంలో తప్పులేదన్నారు. తాను కేవలం తెలంగాణకు మాత్రమే గవర్నర్ అనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. సమస్యలున్నా ఉద్యోగులు రాజధానికి రావడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి తాను కూడా వస్తానని, అక్కడ తనకూ కార్యాలయాన్ని కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.
దుర్గమ్మ సన్నిధిలో గవర్నర్
గవర్నర్ నరసింహన్ గురువారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. మంగళగిరిలోని శ్రీపానకాలస్వామిని కూడా దర్శించుకున్నారు.
900 ఎకరాల్లో శాశ్వత రాజధాని: సీఎం
వెలగపూడికి ఐదు కిలోమీటర్ల దూరంలో 900 ఎకరాల్లో శాశ్వత రాజధాని వస్తుందని గవర్నర్‌కు వివరించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని నిర్మాణంపై ఎప్పటికప్పుడు గవర్నర్‌కు వివరించి ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అదేవిధంగా విభజన సమస్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.