ఎవరబ్బాయో!
సుమారు రెండేళ్ల బాలుడు తప్పిపోయాడు. నాటకీయ పరిణామంలో వీరబల్లి పోలీసులకు చిక్కాడు. ఆ అబ్బాయిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. ఆ అబ్బాయి తమ బిడ్డేనంటూ హైదరాబాదు నుంచి దంపతులు వచ్చారు. తమ బాబు పేరు అరుణ్ అని చెబుతున్నారు. కాదు ఆ పిల్లోడు తమ పిల్లోడేనంటూ తిరుపతి నుంచి భార్య, భర్త వచ్చారు. తమ బిడ్డ పేరు దీపక్ అని చెప్పారు. దిక్కుతోచని ఐసీడీఎస్ సిబ్బంది ఆ బాలున్ని బాలసదన్‌కు అప్పగించారు. బాలసదన్ సిబ్బంది ఆ పిల్లవాడికి సాయి చరణ్ అని నామకరణం చేశారు. ఇంతకీ ఆ పిల్లోడు ఎవరబ్బాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కడప రూరల్ : ఓ బాలుడి ఉదంతం మిస్టరీగా మారింది. ఆ బాలుడు తప్పిపోయాడా.. లేక కిడ్నాపర్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా.. అనేది తెలియాల్సి ఉంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో గురువారం బాలుడిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, శుక్రవారం కడప ఐసీడీఎస్ చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లిలో ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేరు. వైద్య పరీక్షల నిమిత్తం గత ఆదివారం తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ బాలుడిని వెంట తెచ్చుకున్నారు. ఈ సంఘటన వీరబల్లిలో చర్చనీయాంశమైంది. ఆ బాలుడిని కొని తెచ్చుకున్నారని ఆ నోటా, ఈనోటా పోలీసుస్టేషన్ వరకు చేరింది. దీంతో పోలీసులు గురువారం రంగప్రవేశం చేసి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని కడపకు తెచ్చి శుక్రవారం ఐసీడీఎస్‌కు అప్పజెప్పారు.
కాగా, ఆ దంపతులు తాము తిరుపతికి వెళ్లినపుడు రుయా హాస్పిటల్ గేటు వద్ద ఒక వృద్దుని వద్ద బాలుడు ఉండగా, ఆ వృద్దునికి రూ.10 వేలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ బాలుడే అంటూ హైదరాబాదు నుంచి వచ్చిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు కడప ఐసీడీఎస్ వద్దకు వచ్చారు. వెంకటయ్య మాట్లాడుతూ తమది హైదరాబాద్‌లోని సంసల ప్రాంతమని, తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తనకు అనిత, సునీత, అరుణ్ సంతానమని తెలిపారు. అరుణ్ గత జనవరి 5వ తేదిన పిల్లలతో బయట ఆటలాడుకుంటుండగా అపహరణకు గురయ్యాడన్నారు. ఈ విషయమై స్థానిక నార్సింగ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు.
ఈ బిడ్డ తమ బిడ్డేనని అన్నారు. మరోవైపు తిరుపతి నుంచి వచ్చిన లక్ష్మి, చందు అలియాస్ భాష దంపతులు ఈ పిల్లాడు తమ పిల్లాడే అని, పేరు దీపక్ అని తెలిపారు. భాష మాట్లాడుతూ తాము తిరుపతిలో ఉంటున్నామని, తానూ బండల పని చేస్తున్నట్లు తెలిపారు. తమకు దీపక్ ఒక్కడే సంతానమన్నారు. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చామన్నారు. బయట ఉన్న ఓ వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి పోయామన్నారు. అప్పటి నుంచి పిల్లాడు కనిపించక వెదుకుతున్నామని చెప్పారు. కడపలో ఉన్నాడని తెలుసుకుని వచ్చామన్నారు. బాలుడికి మాటలు రావు. ఎవరినీ పెద్దగా గుర్తించలేకపోతున్నాడు.
విచారణ తర్వాత అప్పగింత
రెండు ప్రాంతాల నుంచి ఆ బాలుడు తమ పిల్లోడేనంటూ దంపతులు వచ్చారు. దీంతో ఆ బాలుడిని బాలసదన్‌కు అప్పగించాము. సంఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాము. వారు కూడా నిర్దారించలేకపోతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాము.
- రాఘవరావు, ఐసీడీఎస్ పీడీ
విచారిస్తాం
బాలుడి విషయమై సమగ్రంగా విచారణ చేపడతాం. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాం. అనంతరం బాలుడిని నిజమైన తల్లిదండ్రులకు అప్పగిస్తాం. అంతవరకు బాలుడిని బాలసదన్‌లో ఉంచుతాం.
- శారదమ్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్