పీసెట్ షెడ్యూల్ విడుదల
7న నోటిఫికేషన్.. 11 నుంచి దరఖాస్తులు
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీసెట్-2014 (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు. గుంటూరులోని ఏఎన్‌యూలో మంగళవారం జరిగిన పీసెట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల చేస్తారని, ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవటానికి ఏప్రిల్ 22 ఆఖరు తేదీ. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఏప్రిల్ 30 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకున్నవారు మే 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పీసెట్ పరీక్షలు, స్క్రాచ్ కార్డుల పంపిణీ మే 5 తరువాత ప్రారంభమవుతుందని చెప్పారు. ఫలితాలను పరీక్షలు ముగిసిన వారంలో వెల్లడిస్తామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, ఉన్నత విద్యామండలి కార్యదర్శి సతీష్ రెడ్డి, ఏఎన్‌యూ వీసీ, పీసెట్ చైర్మన్ కె.వియ్యన్నారావు, పీసెట్ కన్వీనర్ వై.కిషోర్ పాల్గొన్నారు.