ఆవులకూ ‘ఆధార్’ తరహా కార్డులు!
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని ఆవులకు, వాటి సంతతికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు (యూఐడీ) సంఖ్య కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దు గుండా పశువుల స్మగ్లింగ్ నిరోధం కోసం వాటికి యూఐడీ కేటాయించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్లు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఈ కమిటీ.. ట్యాంపర్ చేయడానికి వీలుకాని పాలీయురేథేన్ (ప్లాస్టిక్) ట్యాగులను పశువులకు జోడించాలని సిఫార్సు చేసింది.
‘దీన్ని అన్ని ఆవులకు, వాటి సంతతికి తప్పనిసరి చేయొచ్చు. పశువు వయసు, జాతి, ఎత్తు, రంగు, కొమ్ముల రకం, ఇతర ప్రత్యేక వివరాలు యూఐడీలో ఉండాలి. రాష్ట్రవ్యాప్త సమాచారాన్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి జాతీయ డేటాబేస్కు అనుసంధానించవచ్చు. పోలీసులు, రోడ్డు రవాణా, పశుసంవర్ధక శాఖల అధికారులు పశువుల స్మగ్లింగ్ నిరోధానికి తీసుకుంటున్న చర్యలపై రాష్ట్రాలు దశలవారీగా సమీక్షలు జరపాలి’ అని కమిటీ సిఫార్సు చేసింది. సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, ఈ అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక కోర్టు ఆదేశాలు జారీ చేయాలని సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్.. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ చంద్రచూడ్‌ల బెంచ్‌కు నివేదించారు.