మరో ర్యాన్సమ్వేర్!
బీజింగ్: వాన్నా క్రై ర్యాన్సమ్వేర్ ముప్పు తొలగిపోక ముందే మరో ర్యాన్సమ్వేర్ వెలుగుచూసింది. యూఐడబ్ల్యూఐఎక్స్ అనే మాల్వేర్ను తాము గుర్తించామని చైనా నేషనల్ కంప్యూటర్ వైరస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్(సీవీఈఆర్సీ) బుధవారం తెలిపింది. ‘ఇది వాన్నా క్రై మాదిరే వ్యాపిస్తోంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని బగ్ సాయంతో కంప్యూటర్లలోకి చొరబడుతోంది.
ఎన్క్రిప్షన్ తర్వాత ఫైళ్ల పేర్లను మారుస్తోంది. మార్పు తర్వాత ఫైళ్ల పేర్ల చివరన ‘.యూఐడబ్ల్యూఐఎక్స్’ అని కనిపిస్తుంది’ అని సంస్థ ఉన్నతాధికారి చెన్ జియాన్మిన్ తెలిపారు. సమస్యను ఎదుర్కోవడానికి మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ అప్డేట్ను జారీ చేసిందన్నారు. అయితే ఈ కొత్త వైరస్ చైనాలో ఉన్నట్లు నిర్ధారణ కాలేదని, దీన్ని సీవీఈఆర్సీ విశ్లేషిస్తోందని ప్రభుత్వ వార్తా సంస్థ జినువా వెల్లడించింది.