UK (yunetaid Kingdom)
-
మూడు దారులు.. చరిత్రకు సాక్ష్యాలు
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన మూడు దారులు పుస్తకాన్ని లండన్‌లో ఆవిష్కరించుకున్నారు ప్రవాసాంధ్రులు. లండన్‌లో డాక్టర్ ప్రదీప్ చింతా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాకర్ అవుతాల, షాన్ పద్మనాభన్, శ్రీనివాసన్ జనార్థన్, విజయ్ పెండేకంటి తదితరులు పాల్గొన్నారు. నేటి తరానికి, ముఖ్యంగా తెలుగు ప్రజలకు తెలియాల్సిన ఎన్నో అంశాలను, రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ఘటనలను దేవులపల్లి అమర్ పుస్తకం ద్వారా లైవ్‌లో ఉంచారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్, వైస్రాయ్ వేదికగా చంద్రబాబు చేసిన పనులను రచయిత కళ్లకు కట్టినట్లు వివరించారనీ, ఎన్నో ఆధారాలతో పాఠకుల ముందు ఉంచారని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం మొదలు, విలీనం, విభజన వంటి పరిణామాలు, వాటి వెనుక ఉద్యమాలు, రాజకీయాలను రచయిత సాధికారికంగా ఆవిష్కరించారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పరిపాలన స్వయంగా చూసి రూపొందించిన ఈ పుస్తకం.. భావి తరాలకు ఓ గైడ్‌గా ఉంటుందని కార్యక్రమానికి హాజరైన అతిథులు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ఎన్నో వాస్తవాలు.. పూర్తి ఆధారాలతో వెలుగులోకి వచ్చినట్టయిందని తెలిపారు. ఈ ప్రయత్నం చేసిన దేవులపల్లి అమర్‌ను ప్రశంసించారు. -
యుకెలో అంబరాన్నంటిన గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలు
ఈ సంవత్సరం యుకెలో జరిగిన సంక్రాంతి సంబరాలు సుమారు 1300 మంది ఆహూతులతో లండన్ హారో లీజర్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత కొద్ది సంవత్సరాలుగా యుకెలో తెలుగువారు నిర్వహించుకునే వేడుకలలో గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి రుచులకు, అక్కడి పిండివంటలకు, ఆప్యాయతలకు, ఆచారాలకు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ భోగిపళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు, హరిదాసు, ముగ్గులు ఇంకా ఎన్నో పాటలు, నృత్యాలు, నృత్యరూపకాలు ఆద్యంతం అలరించాయి. సంబరానికి హాజరైన వారందరినీ పేరుపేరునా మర్యాదపూర్వక పిలుపులతో ఆహ్వానించి గ్రూప్ సభ్యులు తమదైన శైలిని చాటిచెప్పారు. అరిటాకులలో సహబంతి భోజనాలు, అన్నవరం ప్రసాదం, పనసపొట్టు పులావు, కొబ్బరన్నం, మామిడికాయ పనసగింజల కూర, పొన్నగంటి పప్పు, వంకాయ పకోడీ కూర, ములక్కాడ జీడిపప్పు కూర్మ, బెల్లం మాగాయి, మజ్జిగ పులుసు, ఉసిరికాయ చారు, కంద ఆవకాయ, సొరకాయ రోటి పచ్చడి, గారెలు, పెరుగు చట్నీ, కోడి కూర, మటన్ ఫ్రై, రొయ్యల ఇగురు మొదలైన వివిధ రకాల వంటకాలను గోదారోళ్ళ గ్రూప్ సభ్యులు స్వయంగా వండి వడ్డించడం ఇందులో విశేషం. ఇవేకాక రాజమండ్రి రోజ్ మిల్క్, జున్ను వంటివి అందరినీ ఆశ్చర్యపరిచి కొస మెరుపుగా నిలిచాయి. ఈ వేడుకలకు హాజరైన వివిధ ప్రాంతాల వారు గోదారోళ్ళ రుచులతో పాటు వారి సహకారాన్ని, వెటకారాన్ని, మమకారాన్ని మెచ్చుకోవడమే కాక అక్కడ నిర్వహించిన లక్కీడ్రాలో బంగారం, వెండి మొదలైన బహుమతులను గెలుచుకొన్నారు. జంతికలు, మైసూరుపాకు మరియు కరకజ్జంతో కూడిన సారెను అందరికీ పంచడంతో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. -
విదేశీ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాల ఏర్పాటుకు తీర్మానం
ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : తెలుగును ప్రపంచ భాషగా గుర్తించాలని, విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠాలు ఏర్పాటు చేయాలని కోరుతూ యూకే (యునెటైడ్ కింగ్డమ్) తెలుగు సంఘం సభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. ఆయన స్థానిక తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. బ్రిటన్, అమెరికాలో పర్యటిం చిన తాను, తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో చర్చించినట్లు చెప్పారు. గూగుల్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి ప్రపంచ భాషగా తెలుగును గుర్తించి, గూగుల్‌లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించినా సంస్థ ప్రతినిధులు మరుసటి రోజే గూగుల్‌లో తెలుగుకు స్థానం కల్పించారని, ప్రత్యేక తెలుగు పాంట్లు రూపొందించారని వివరించారు. ప్రపంచ విద్యావ్యవస్థలో తెలుగుకు రెండో భాషగా ప్రాముఖ్యత కల్పించడానికి తాముచేసిన కృషి సత్ఫాలితలనిచ్చే దిశగా సాగుతోందన్నారు. గత నెల 26, 27 తేదీల్లో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక కార్యక్రమంలో ప్రపంచ భాషగా తెలుగుకు గుర్తింపు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. విదేశీయులు సైతం తెలుగు అభ్యసించటానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. జన్మభూమిపై ప్రవాసాంధ్రుల ఆసక్తి రాష్ట్రంలో అమలుచేస్తున్న జన్మభూమి కార్యక్రమంపై ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపుతున్నారని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమం స్ఫూర్తితో వారు జన్మించిన గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అమెరికాలో సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే తుపాను నష్టంపై ప్రాథమిక సమాచారం అందించటంతో స్పందించిన అమెరికాలోని తెలుగువారు విరాళాలు ప్రకటించారని బుద్ధప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులను భాగస్వాములను చేయటానికి వారికి సహకారం అందించటానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రవాసాంధ్రులు ఆసక్తితో ఉన్నారని పేర్కొన్నారు.