ఈ సంవత్సరం యుకెలో జరిగిన సంక్రాంతి సంబరాలు సుమారు 1300 మంది ఆహూతులతో లండన్ హారో లీజర్ సెంటర్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత కొద్ది సంవత్సరాలుగా యుకెలో తెలుగువారు నిర్వహించుకునే వేడుకలలో గోదారోళ్ళ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక స్థానం ఉంది. గోదావరి రుచులకు, అక్కడి పిండివంటలకు, ఆప్యాయతలకు, ఆచారాలకు, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ భోగిపళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు, హరిదాసు, ముగ్గులు ఇంకా ఎన్నో పాటలు, నృత్యాలు, నృత్యరూపకాలు ఆద్యంతం అలరించాయి.
సంబరానికి హాజరైన వారందరినీ పేరుపేరునా మర్యాదపూర్వక పిలుపులతో ఆహ్వానించి గ్రూప్ సభ్యులు తమదైన శైలిని చాటిచెప్పారు. అరిటాకులలో సహబంతి భోజనాలు, అన్నవరం ప్రసాదం, పనసపొట్టు పులావు, కొబ్బరన్నం, మామిడికాయ పనసగింజల కూర, పొన్నగంటి పప్పు, వంకాయ పకోడీ కూర, ములక్కాడ జీడిపప్పు కూర్మ, బెల్లం మాగాయి, మజ్జిగ పులుసు, ఉసిరికాయ చారు,
కంద ఆవకాయ, సొరకాయ రోటి పచ్చడి, గారెలు, పెరుగు చట్నీ, కోడి కూర, మటన్ ఫ్రై, రొయ్యల ఇగురు మొదలైన వివిధ రకాల వంటకాలను గోదారోళ్ళ గ్రూప్ సభ్యులు స్వయంగా వండి వడ్డించడం ఇందులో విశేషం. ఇవేకాక రాజమండ్రి రోజ్ మిల్క్, జున్ను వంటివి అందరినీ ఆశ్చర్యపరిచి కొస మెరుపుగా నిలిచాయి.
ఈ వేడుకలకు హాజరైన వివిధ ప్రాంతాల వారు గోదారోళ్ళ రుచులతో పాటు వారి సహకారాన్ని, వెటకారాన్ని, మమకారాన్ని మెచ్చుకోవడమే కాక అక్కడ నిర్వహించిన లక్కీడ్రాలో బంగారం, వెండి మొదలైన బహుమతులను గెలుచుకొన్నారు. జంతికలు, మైసూరుపాకు మరియు కరకజ్జంతో కూడిన సారెను అందరికీ పంచడంతో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment