umdanagar railway station
-
మేడ్చల్– ఉందానగర్ మార్గంలో వాహనదారులకు బ్రేక్‌లు.. అదొక్కటే పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: అది సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గం. మేడ్చల్‌లో రైలు ఎక్కితే నేరుగా ఉందానగర్ వరకు వెళ్లొచ్చు. అక్కడి నుంచి శంషాబాద్ విమానశ్రయానికి మరో ఆరు కిలోమీటర్లు మాత్రమే. ఎంఎంటీఎస్ రెండో దశలో ఈ లైన్‌ను దక్షిణమధ్య రైల్వే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పూర్తి చేసింది. జీఎమ్మార్ సంస్థ అనుమతిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు కూడా ఎంఎంటీఎస్ రైళ్లను నడపాలనేది అప్పటి ప్రతిపాదన. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెచ్చించి మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ తదితర పనులను పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు రైల్వేభద్రతా తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ.. ఆ మార్గంలో రైళ్లను ప్రారంభించాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ రైళ్లను నడిపేందుకు లైన్ క్లియర్‌గా ఉన్నా వెనుకడుగు వేస్తున్నారు. కేవలం 10 కిలోమీటర్ల మార్గంలో కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉండడమే ఇందుకు కారణం. వీటితో నగరవాసులకు తీవ్ర ఆటంకం ఏర్పడనుంది. వాహనదారుల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఎలాంటి కార్యాచరణ లేకుండానే పట్టాలు పరిచారు. దీంతో ఇప్పుడు ఆ లైన్ ఉన్నా లేనట్లుగానే మారింది. అక్కరకొచ్చేది ఎలా..? ఎంఎంటీఎస్ రెండో దశలో చేపట్టిన రైల్వే లైన్ల విస్తరణతో ఇప్పుడు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు మార్గం సుగమమైంది. సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా పూర్తి చేసిన ఫలక్‌నుమా– ఉందానగర్ మార్గంలోనే రైళ్లు నడిపేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకే కనీసం 10 చోట్ల లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. కనీసం ప్రతి 2 కిలోమీటర్లకు ఒకటి చొప్పున లెవల్ క్రాసింగ్ ఉంది. అంటే ట్రైన్ బయలుదేరిన తర్వాత రెండు, మూడు నిమిషాలకోసారి గేట్లు వేసి వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ రద్దీ నెలకోనుంది. దయానంద్‌నగర్, సఫిల్‌గూడ, తుకారంగేట్, అమ్ముగూడ, మల్కాజిగిరి, అల్వాల్, బొల్లారం తదితర ప్రాంతాల్లో లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. ఈ రూట్ పూర్తిగా కాలనీలు, బస్తీల్లోంచే వెళ్తుంది. దీంతో లెవల్ క్రాసింగ్‌లు తీసివేసేందుకు కొన్ని చోట్ల జనావాసాలను, దుకాణాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. పైగా రైల్ ఓవర్ బ్రిడ్జీల (ఆర్ఓబీ)ను నిర్మించాలంటే చాలా చోట్ల భూమి లభ్యత సమస్యగా మారింది. ఈ క్రమంలో రైల్ అండర్ బ్రిడ్జీలు (ఆర్యూబీ) ఒక్కటే పరిష్కారం. ఇందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాల కల్పన తప్పనిసరి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడడంతో నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. లెవల్ క్రాసింగ్‌లు తొలగిస్తే తప్ప రైళ్లు నడపడం సాధ్యం కాదని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. -
హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు, జీఎమ్మార్ అంగీకరిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు లింగంపల్లి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా వరకు పరిమితమైన ఈ సర్వీసులను ఉందానగర్‌కు విస్తరించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. రెండో దశలో ఉందానగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మరో 6 కిలోమీటర్ల మార్గా న్ని కొత్తగా నిర్మించి ఎయిర్‌పోర్టుకు రైళ్లు నడిపేం దుకు దక్షిణమధ్య రైల్వే సిద్ధంగా ఉన్నా జీఎమ్మార్ నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉందా నగర్ వరకు నడిపేందుకే అధికారులు పరిమితమ య్యారు. భవిష్యత్తులో జీఎమ్మార్ అంగీకరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకొనేలా విస్తరిం చనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 95 కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ నెల 31 నాటికి పూర్తి కానున్నాయి. దీంతో ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించేందుకు అవకాశం లభించింది. అలాగే సికింద్రాబాద్ నుంచి మహబూ బ్‌నగర్ వరకు ఇంటర్సిటీ సర్వీసులు నడిచే అవకా శం ఉంది. ప్రస్తుతం 8 ప్యాసింజర్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. డబ్లింగ్ పూర్తయిన దృష్ట్యా మరో రెండు సర్వీసులు కొత్తగా ప్రవేశపెట్ట నున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూర్, తిరుపతికి వెళ్లే రైళ్లు ఇకపై సికింద్రాబాద్–డోన్ మార్గంలోనూ రాకపోకలు సాగిస్తాయి. ఫలితంగా దూరంతో పాటు, కనీసం గంటకు పైగా ప్రయాణ సమయం తగ్గనుంది. -
హైదరాబాద్‌లో భూగర్భ రైలు!
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో తొలి భూగర్భ రైల్వే మార్గానికి అడుగులు పడుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉందానగర్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు దీన్ని నిర్మించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై సర్వే చేసి నివేదిక అందజేయాల్సిందిగా ‘రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ (రైట్స్)’ను రైల్వే శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో ఆ సంస్థ నివేదికను అందజేయనుంది. హైదరాబాద్ నగరానికి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా రైల్వే భావిస్తోంది. నగరంలో ట్రాఫిక్ చిక్కులకు కొంతమేర పరిష్కారంగా గతంలో నిర్మించిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఫలక్‌నుమా స్టేషన్‌తో నిలిచిపోయింది. శివారు ప్రాంతాలను ఎంఎంటీఎస్ పరిధిలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు రెండో దశను కూడా రైల్వే ప్రారంభిం చింది. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫలక్‌నుమా నుంచి విమానాశ్రయం వరకు కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించిన రైల్వే.. ప్రాజెక్టుకు రూ.200 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. విమానాశ్రయానికి చేరువగా కాచిగూడ-మహబూబ్‌నగర్ రైలు మార్గంపై ఉన్న ఉందానగర్ స్టేషన్ మీదుగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అక్కడినుంచి విమానాశ్రయం ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయి తే విమానాశ్రయం వరకు రైల్వే లైను ఏర్పాటు చేయడాన్ని జీఎంఆర్ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భవిష్యత్తులో విమానాశ్రయాన్ని విస్తరిస్తామని, ఇందుకు అదనపు టెర్మినళ్లు, రన్‌వే అవసరం ఉంటుందని, వీటిని దృష్టిలో ఉంచుకుని కొంత స్థలాన్ని సిద్ధంగా ఉంచుకున్నామని చెబుతోంది. రైల్వే లైన్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో విస్తరణ సాధ్యం కాదని సర్వేలో తేలితే.. ఎట్టి పరిస్థితిలో ఎంఎంటీఎస్ లైన్ ఏర్పాటుకు అంగీకరించబోమని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రాష్ట్రప్రభుత్వం ద్వారా జీఎంఆర్‌తో మాట్లాడించి ఆమోదం వచ్చే లా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ జీఎంఆర్ అంగీకరించకపోతే భూగర్భ లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌తో విమానాశ్రయాన్ని అనుసంధానించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానితో ఆదివారం నగరానికి వచ్చిన ప్రభు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన సందర్భంలో దీనిపై చర్చించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. జీఎంఆర్‌తో మాట్లాడినా ఫలితం రాలేదు. ఇప్పుడు మరోమారు మాట్లాడినా సానుకూల ఫలితం వచ్చే అవకాశం లేదని, భూగర్భ ట్రాక్ నిర్మాణం తప్పదనే అభిప్రాయాన్ని రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు.