లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేశారు!
మూలపడిన ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు
తొగుట: రైతులు మార్కెట్కు తెచ్చిన ధాన్యం శుభ్రపరించేందుకు యంత్రాలను లక్షలు వెచ్చించి కొన్నారు... అధికారుల నిర్లక్షంతో మూలకు పడేశారు. దీంతో ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు వానకు నాని, ఎండకు ఎండి తుప్పుపడుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం మండలంలోని వివిద గ్రామాలలో మహిళా సంఘాల ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం శుభ్రపరిచేందుకు స్థానిక వ్యవసాయ మార్కేట్ నుంచి వీటిని తీసుకు పోయారు.
కొనుగోలు ముగియగానే వాటిని మార్కెట్కు అప్పగించాల్సి ఉండగా, ఆయా కొనుగోలు కేంద్రాలు ముగియగానే వాటిని అక్కడే మూలకు పడేశారు. దీంతో నిర్వాహకులు దాని అవసరం తీరాక అక్కడే వదిలేసి పోవడంతో లక్షలు విలువైన యంత్రాలు పాడైపోతున్నాయి. సుమారు పదేండ్ల క్రితం తొగుట వ్వయసాయ మార్కేట్ కమిటీ అదికారులు 27 యంత్రాలను కొనుగోలు చేశారు.
అందులో 12 యంత్రాలను మండలంలోని పెద్దమాసాన్పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి, ఘణపురం, కాన్గల్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లేపహడ్, వెంకట్రావుపేట, లింగాపూర్, జప్తిలింగారెడ్డిపల్లి, లింగంపేట గ్రామల ఐకేపీ సంఘాలకు అప్పగించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు మూలకే పడ్డాయి. మళ్లీ సీజన్ ప్రారంభం అయినప్పుడే వాటి విలువ అధికారులకు తెలిసివస్తుంది! అప్పుడు అధికారులు వాటి రిపేర్ల పేరుతో డబ్బులు వెచ్చిస్తారు. తప్పా వాటిని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేకపోవడం సోచనీయం.