ఫైనల్లో మెదక్, నిజామాబాద్
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా అండర్-14 వన్డే క్రికెట్ టోర్నీలో మెదక్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెదక్ 64 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెదక్ 221 పరుగులు చేసి ఆలౌటైంది. అబ్దుల్ గఫూర్ (45), ఉదయ్ కిరణ్ (37) ముఖేశ్ (37) ఫర్వాలేదనిపించారు. అనంతరం బరిలోకి దిగిన కరీంనగర్ 157 పరుగులకే కుప్పకూలింది. సాయి వినయ్ (34) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. మరో సెమీఫైనల్లో నిజామాబాద్ జట్టు 81 పరుగుల తేడాతో ఆదిలాబాద్ జట్టుపై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
మొదట నిజామాబాద్ 8 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. హర్షవర్ధన్ (89), అఫ్రోజ్ ఖాన్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బరిలోకి దిగిన ఆదిలాబాద్ 180 పరుగుల వద్ద ఆలౌటైంది. హిమతే జ్ (51 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. నిజామాబాద్ బౌలర్ అనిరుధ్ రెడ్డి 3 వికెట్లు తీసుకున్నాడు.
రాణించిన త్రిశాంక్, అజీమ్
ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ వాండరర్స్ బౌలర్లు త్రిశాంక్ గుప్తా (5/32), అజీమ్ (5/32) చెరో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టుకు చుక్కలుచూపించారు. దీంతో ఆ జట్టు 156 పరుగుల భారీ తేడాతో మహబూబ్ కాలేజి జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట హైదరాబాద్ వాండరర్స్ 240 పరుగులు చేసి ఆలౌటైంది. భవేశ్ (58) అర్ధ సెంచరీతో చెలరేగగా... ఓవైసీ (43) మెరుగ్గా ఆడాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబ్ కాలేజి 84 పరుగులకే చేతులెత్తేసింది.