కొలువు వేటలో విజేతగా నిలవాలంటే..
భారత్‌లో నిరుద్యోగుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. చాలా మందికి తమ అర్హతలకు తగిన కొలువులు దొరకడం లేదు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో దాదాపు సగం మంది ఖాళీగానే ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుంటే ఏ సబ్జెక్టు విద్యార్థులైనా కొలువు వేటలో విజేతలుగా మారొచ్చు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే రిక్రూటర్లను ఆకట్టుకునే ప్రత్యేక నైపుణ్యాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. అనుకున్న లక్ష్యం నెరవేరడంలో ఇవి కచ్చితంగా ఉపయోగపడతాయి. జాబ్ సాధించడానికే కాదు, వచ్చింది నిలుపుకోవాలన్నా స్కిల్స్ ఉండాల్సిందే.
రైటింగ్ స్కిల్స్
రైటింగ్ స్కిల్ ఉండటం అభ్యర్థులకు ప్రధాన అర్హతగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ పేజీలు, ఈ-మెయిళ్ల ద్వారానే సమాచార మార్పిడి జరుగుతోంది. నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో రాత నైపుణ్యాలు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా నిలిచేలా చేస్తాయి. సొంత బ్లాగ్లు ఉన్నవారికి ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఉంది. రిక్రూటర్లు అభ్యర్థుల బ్లాగుల్లోని రాతలను పరిశీలిస్తున్నారు. సంతృప్తి చెందితే జాబ్ ఆఫర్ ఇచ్చేం దుకు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోండి.
వెబ్ మార్కెటింగ్
ప్రస్తుతం వెబ్ మార్కెటింగ్ హవా కొనసాగుతోంది. కంపెనీలు తమ కస్టమర్లకు చేరువ కావడానికి వెబ్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఉత్పత్తుల ప్రచారం, అమ్మకాలు, సేవలు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్ యాడ్లు, వెబ్సైట్ కంటెంట్, ఈ-మెయిల్ మార్కెటింగ్‌పై పట్టు సాధిస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్
సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్(ఎస్ఈఎం) కూడా వెబ్ మార్కెటింగ్ లాంటిదే. పెయిడ్ సెర్చ్ యాడ్స్, ఫ్రీ వెబ్సైట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ద్వారా కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌ను సందర్శించేలా చేయడమే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. ప్రస్తుతం చాలా కంపెనీలు దీనిపై మొగ్గుచూపుతున్నాయి. ఎస్ఈఎంలో మంచి ప్రావీణ్యం సంపాదించివారికి బోలెడు అవకాశాలు ఉన్నాయి. ఎస్ఈఎంకు సంబంధించి మన దేశంలో ప్రత్యేకంగా కోర్సులు, శిక్షణ అందుబాటులో లేవు. అభ్యర్థులు సొంతంగానే దీనిపై పట్టు సంపాదించాలి. ఎస్ఈఎంపై ఆన్లైన్ పాఠాలున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.
సోషల్ మీడియా
‘ఎప్పుడూ ఆ ఫేస్బుక్, ట్విట్టరేనా..?’ అని తల్లిదండ్రులు మందలిస్తున్నా మీరు వెనక్కి తగ్గాల్సిన పనిలేదు. నేను ఉద్యోగ సాధనలో బిజీగా ఉన్నా అంటూ ధైర్యంగా చెప్పండి. ఎందుకంటే సోషల్ మీడియా నేటి సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. కంపెనీలు సోషల్ మీడియా ద్వారానే తమ కార్యకలాపాలను నిర్విహ స్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉండి సృజనాత్మక ఆలోచనలు కలిగిన వారికి ఎర్ర తివాచీ పరుస్తున్నాయి. ప్రస్తుతం క్లాస్రూమ్ మార్కుల కంటే క్లౌట్ స్కోర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. సోషల్ మీడియాలో మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారో క్లౌట్ స్కోర్ వెల్లడిస్తుంది.
ప్రోగ్రామింగ్
ఉద్యోగం కావాలంటే ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం పొందడం చాలా అవసరం. మం చి ప్రోగ్రామర్ కావాలంటే కంప్యూటర్ సైంటిస్ట్ అయి ఉండాలని అభ్యర్థులు భావి స్తుంటారు. కానీ, అది పొరపాటు. ప్రతిభావంతులైన ప్రోగ్రామర్లుగా గుర్తింపు పొందినవారంతా సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే తప్ప సాంకేతిక నిపుణులు కాదు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పనులు కంప్యూటర్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి పనికీ సాఫ్ట్వేర్ అవసరం. అందుకు ప్రోగ్రామింగ్ తెలుసుండాలి. ఈ స్కిల్ నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. కోర్స్ఎరా, ఉడాసిటీ లాంటి వాటి ద్వారా ప్రోగ్రామింగ్ కోర్సులను ఆన్లైన్లో సులువుగా అభ్యసించొచ్చు.