UNHCR
-
ఉక్రెయిన్ వలసలు 5 లక్షలు: ఐరాస
జెనీవా: రష్యా ఆక్రమణతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు భారీగా వలస బాట పట్టారు. దేశం వీడి వెళ్లే వారితో సరిహద్దు పాయింట్లు రద్దీగా మారాయి. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక ఉక్రెయిన్ నుంచి 5లక్షల మందికి పైగా ప్రజలు వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి వలసల విభాగం(యూఎన్‌హెచ్‌సీఆర్) హై కమిషనర్ ఫిలిపో గ్రాండి చెప్పారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ పోతోందని ఆయన సోమవారం ట్విట్టర్లో తెలిపారు. -
ఐరాస సిబ్బందిని నిర్బంధించి వదిలేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులతో పాటు పలువురు ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) సిబ్బందిని రాజధాని కాబూల్‌లో తాలిబన్లు కొద్ది గంటల పాటు నిర్బంధించారు. తర్వాత వారిని సురక్షితంగా వదిలేశారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సాంస్కృతిక, సమాచార శాఖ ఉప మంత్రి జబియుల్లా ముజాహిద్ చెప్పారు. నిర్బంధించిన వారిలో అఫ్గాన్‌లో చిరకాలంగా పని చేస్తున్న బీబీసీ మాజీ జర్నలిస్టు ఆండ్రూ నార్త్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూఎన్‌హెచ్‌సీఆర్ కోసం పని చేస్తున్నారు. -
"మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)కు భారీ ఆదరణ లభిస్తోంది. సినీ తారల నుంచి మొదలుకొని అగ్ర కంపెనీల వరకు ప్రత్యేకంగా ఎన్ఎఫ్టీ కలెక్షన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా బ్రిటన్ నెట్ వర్క్ దిగ్గజం వొడాఫోన్ ఎన్ఎఫ్టీ తీసుకొని వచ్చింది. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా 1992 డిసెంబరు 3న పంపిన "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వొడాఫోన్ వేలానికి ఉంచింది. పారిస్ ఆక్షన్ హౌస్‌లో 'నాన్ ఫంజిబుల్ టోకెన్స్'గా ఈ వారం ప్రారంభంలో ప్రపంచంలోని మొట్టమొదటి టెక్స్ట్ సందేశాన్ని 121,000 డాలర్ల(సుమారు రూ.90 లక్షలు)కు వొడాఫోన్ విక్రయించింది. 30 ఏళ్ల క్రితం(డిసెంబర్ 3, 1992న) వొడాఫోన్ కంపెనీలో ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌పై పనిచేసిన ఇంజినీర్ నీల్ పాప్‌వర్త్ తన మొదటి టెస్టింగ్ ఎస్ఎంఎస్ 'మెర్రీ క్రిస్మస్' సందేశాన్ని రిచార్డ్ జార్విస్(బిజినెస్‌మ్యాన్)కు పంపించారు. అతను తన 2 కిలోల ఆర్బిటెల్ పరికరంలో ఈ సందేశాన్ని అందుకున్నాడు. ఈ ఆర్బిటెల్ పరికరం డెస్క్ ఫోన్ తరహాలోనే ఉంటుంది. ఈ "మెర్రీ క్రిస్మస్" అనే టెక్స్ట్ సందేశాన్ని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ- యుఎన్‌హెచ్‌సిఆర్‌కు యూఎన్ హైకమిషనర్ ఫర్ రిఫ్యూజికి విరాళంగా అందిస్తారు. ఈ వేలం తర్వాత ప్రపంచంలోని మొదటి ఎస్ఎంఎస్కు సంబంధించి ఎటువంటి ఎన్ఎఫ్టీని లేదా కాయిన్‌ను ఇష్యూ చేయబోమని వొడాఫోన్ ప్రకటించింది. (చదవండి: భూమివైపుగా ముంచుకొస్తున్న పెను ఉపద్రవం! నాసా హెచ్చరిక) -
శరణార్థులుగా మరో 5 లక్షల మంది అఫ్గాన్లు
జెనీవా: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న అనంతర పరిణామాలతో మరో 5 లక్షల మంది ప్రజలు స్వదేశాన్ని వీడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థుల విభాగం యూఎన్‌హెచ్‌సీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికీ ఆ దేశంలో అనిశ్చితి కొనసాగుతోందని, రానున్న రోజుల్లో పరిస్థితులు మరింతగా దిగజారి 5.15 లక్షల మంది వరకు ప్రజలు శరణార్థులుగా మారే ప్రమాదముందని పేర్కొంది. వీరికి ఆహారంతోపాటు తగు వసతులు కల్పించేందుకు సుమారు 30 కోట్ల డాలర్లు అవసరమని అంచనా వేసింది. ఇప్పటికే ఇరాన్, పాకిస్తాన్ తదితర దేశాల్లో 22 లక్షల మంది అఫ్గాన్లు శరణార్థులుగా నమోదై ఉన్నారని తెలిపింది. ‘ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలి, దేశంలో హింస పెచ్చరిల్లిపోవడంతో ఆ ప్రభావం సామాన్య పౌరులపై తీవ్రంగా పడుతోంది. వారంతా ఉన్న చోటును వదిలి వేరే సురక్షిత ప్రాంతాలను వెదుక్కుంటూ మరోచోటుకు తరలివెళ్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా కేవలం ఈ ఏడాదిలోనే 5.58 లక్షల మంది ఇలా తరలివెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు, చిన్నారులే. పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చి.. అంతర్గతంగా, విదేశాలకు తరలివెళ్లే వారి సంఖ్య ముందుముందు మరింత పెరిగే ప్రమాదముంది. అఫ్గాన్ ప్రజలకు రానున్నవి చీకటి రోజులు’ అని యూఎన్ హెచ్‌సీఆర్ ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ నెట్వర్క్ సీఈవో నజీబా వజెదాఫోస్ట్ శుక్రవారం వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో తెలిపారు. -
ప్లీజ్.. ఇకనైనా మౌనం వీడండి.. మా బాధను అర్థం చేసుకోండి
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఆ దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అరాచక పాలనలో తమ బతుకులు బుగ్గిపాలవడం ఖాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఉందంటూ ఆందోళన పడుతున్నారు. ఈ క్రమంలో వేలాది మంది అఫ్గన్లు దేశం విడిచి పారిపోతుండగా.. మరికొందరు తాలిబన్లను ఎదురించే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, అఫ్గన్‌లో నెలకొన్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న మెజారిటీ దేశాలు.. అమాయక ప్రజలకు అండగా నిలుస్తూనే.. తాలిబన్ల తీరు పట్ల వ్యూహాత్మక మౌనం, సమదూరం పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశం విడిచి భారత్‌కు చేరిన శరణార్థులు సోమవారం ఢిల్లీలోని యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యజీస్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తాలిబన్ల అరాచకాలపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉండొద్దని నినాదాలు చేశారు. అఫ్గన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని తమను కాపాడాలంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘మాకు మెరుగైన భవిష్యత్తు కావాలి’’, ‘‘న్యాయం కావాలి’’, ‘‘ఇకనైనా మౌనం వీడండి. మా బాధను అర్థం చేసుకోండి’’ అంటూ తమకు మద్దతుగా నిలవాలని కోరారు. చదవండి: ‘వాళ్లిద్దరే దేశాన్ని నాశనం చేశారు.. తాలిబన్లకు ఇదే నా విజ్ఞప్తి’ -
ఈ భూమిపై మాకింత చోటేది?
ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది. ఒకప్పుడు విదేశీయుల ఏలుబడిలో ఉన్న దేశాలు స్వాతంత్య్రం సాధించుకున్నాయి. తమ పాలకులను, ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నాయి. కానీ కొన్ని దేశాల్లోని ప్రజలకు ఆ స్వాతంత్య్ర ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. బాధ వస్తే కన్నీళ్లు కార్చడం, ఆకలి వేస్తే పొట్ట చేత పట్టుకోవడం అక్కడ ప్రజలకు సర్వసాధారణం. ఎందుకంటే.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నిరంతరం జరుగుతున్న యుద్ధాలు, అంతర్గత పోరాటాలు, జాతుల మధ్య ఘర్షణలు, హింస, సైనిక పోరాటాలతో ఎంతోమంది నిరాశ్రయులవుతున్నారు. అలాంటి అభాగ్యులు ఆశ్రయం కోసం సొంత దేశాన్ని విడిచి పరాయి దేశంలో 'శరణార్థులు'గా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది నిరాశ్రయులై, ఏ దేశ పౌరసత్వం, గుర్తింపునకూ నోచుకోవడం లేదు. నివాసం, విద్య, ఆరోగ్యం, ఉద్యోగ, ఉపాధి, ఆహారం కొరతతో అనునిత్యం సంఘర్షణకు గురవుతున్నారు. 2001 నుంచి ఐక్యరాజ్య సమితి, 100కి పైగా దేశాలు జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి. మరి ఆ కన్నీటి గాథలు ఓసారి తెలుసుకుందాం! యూఎన్‌హెచ్‌సీఆర్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 65.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో 21 మిలియన్లకు పైగా ప్రజలు శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ 10 మిలియన్ల మందికి సరియైన ఉందామంటే గూడు లేదు. రోజుకు సగటున 42,500 మంది రక్షణ కోసం తమ ఇళ్లను వదిలి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్తున్నారు. గత సంవత్సరం 13.9 మిలియన్ల మంది కొత్తగా నిరాశ్రయులయ్యారు. ఇక సిరియాలో అంతర్యుద్ధం అక్కడి ప్రజల జీవితాల్లో అత్యంత భయంకరమైన మానవతా సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం 11 మిలియన్లకు పైగా సిరియన్లు నిరాశ్రయులయ్యారు. ఇది సిరియా జనాభాలో 45శాతం. ప్రపంచంలోని 86శాతం శరణార్థులకు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. గత దశాబ్దంలో వివిధ దేశాలకు శరణార్థులుగా వేళ్లే వారి సంఖ్య 16 శాతం పెరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద శరణార్థుల శిబిరం కెన్యాలోని దాదాబ్‌లో ఉంది. అక్కడ దాదాపు 3,29,000 మందికి పైగా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే గతంలో భద్రతాపరమైన ప్రమాదాల కారణంగా దాదాబ్ శరణార్థుల శిబిరాన్ని మూసివేస్తామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మిలియన్ల శరణార్థులలో 18 ఏళ్లలోపు ఉన్నవారు 51 శాతం. రెండవ ప్రపంచ యుద్థ తరువాత అత్యధిక సంఖ్యలో బాలలు శరణార్థులుగా మారడం ఇదే ప్రథమం. ఇక 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ పోటీలో మొట్టమొదటిసారిగా ‘‘శరణార్థుల జట్టు’’ పోటీ పడింది. ఈ జట్టులో ఇథియోపియా, దక్షిణ సూడాన్, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సిరియా దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లోని శరణార్థుల్లో ప్రధానభాగం సిరియా, అఫ్గానిస్థాన్, దక్షిణ సూడాన్, పాలస్తీనా, ఇరాక్, ఉగాండా, సోమాలియా, మయన్మార్‌లలోనే ఉన్నారు. ఇప్పటికీ సిరియాను 'శరణార్థుల ఉత్పత్తి దేశం'గా పిలుస్తారు. ప్రపంచీకరణ కారణంగా దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య, విదేశాంగ దౌత్య సంబంధాలు, భూభాగ సరిహద్దుల అంశాల్లో కట్టుదిట్టమైన విధానాలను అవలంబిస్తున్నారు. కొన్ని దేశాల్లో సరిహద్దు భూభాగంలో ఇనుప కంచెల ఏర్పాటు, గట్టి భద్రత, పౌరసత్వ గుర్తింపు తనిఖీ, నియంత్రణ కోసం గస్తీ బలగాలను పెద్దఎత్తున మోహరిస్తున్నారు. ప్రధాన రహదారులనూ మూసివేస్తూ, శరణార్థులు చొరబడకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఐరాస చొరవతో ప్రపంచంలోని అన్ని దేశాలతో చర్చలు జరిపి, ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వలస వెళ్లిన వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు ప్రాణరక్షణ, పునరావాసం, విద్య, వైద్యం, ఆహారం, మందులు, ఉద్యోగ, ఉపాధి వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించి, జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు అంత పరిహారం ఇవ్వలేం: కేంద్రం -
తొలిసారిగా కశ్మీర్ భారత రాష్ట్రమని అంగీకరించిన పాక్!
జెనీవా : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన వేళ పాక్ మరోసారి ఐక్యరాజ్య సమితి ఎదుట కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు సిద్ధమైంది. జెనీవాలో జరుగుతున్న యూఎన్ మానవ హక్కుల కమిషన్ మండలి సమావేశానికి పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పే క్రమంలో భారత దేశంలోని రాష్ట్రమైన జమ్మూ కశ్మీర్ అంటూ సంబోధించారు. ‘ కశ్మీర్లో పరిస్థితులను సమీక్షించేందుకు యూఎన్ ఆధ్వర్యంలో కమిటీ నియమించాలి. కమిటీ సభ్యులకు మేము పూర్తి మద్దతునిస్తాం అని పేర్కొన్నారు. అదే విధంగా కశ్మీర్లో సాధారణ పరిస్థితులు ఉన్నాయంటూ భారత్ చెప్పడం విడ్డూరంగా ఉంది’ అని ఖురేషి విమర్శలు గుప్పించారు. #WATCH: Pakistan Foreign Minister Shah Mehmood Qureshi mentions Kashmir as “Indian State of Jammu and Kashmir” in Geneva pic.twitter.com/kCc3VDzVuN — ANI (@ANI) September 10, 2019 కాగా పాక్ ఆరోపణలకు ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కశ్మీర్ అంశంపై పాక్ వాదనలను తిప్పికొట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని.. తమకు అవకాశం వచ్చినపుడు వాళ్లకు సరైన సమాధానం చెబుతామని వెల్లడించారు. కాగా కశ్మీర్ భారత అంతర్గత అంశమని ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలైన రష్యా, యూకే, అమెరికా సహా ఫ్రాన్స్ వంటి ఇతర దేశాలు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పరువు తీయాలని భావించిన పాక్ మంత్రి... కశ్మీర్ భారత రాష్ట్రం అని సంబోధించి నాలుక కరుచుకున్నారు. దీంతో దేశ విభజన నాటి నుంచి ఇప్పటిదాకా దాయాది దేశం వెంట ఈ మాట వినాలని ఎదురు చూస్తున్న వాళ్లకు ఖురేషి మాటలు హాయినిస్తాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తద్వారా కశ్మీర్ భారత అంతర్గత అంశమని పాక్ కూడా ఒప్పుకున్నదంటూ తమదైన శైలిలో పాక్ తీరును ఎండగడుతున్నారు. -
‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’
కరాకస్ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మంగళవారం షేర్ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: అమెరికాతో తెగదెంపులు! ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
‘ప్రమాదంలో ఉన్నాం.. కచ్చితంగా చంపేస్తారు’
‘మేము ప్రమాదంలో ఉన్నాము. దయచేసి మాకు సహాయం చేయండి. ఇప్పుడు గనుక ఇంటికి(సౌదీ అరేబియా) తిరిగి వెళ్తే కచ్చితంగా చంపేస్తారు. ఏ సురక్షిత దేశంలోనైనా సరే మాకు ఆశ్రయం కల్పించండి. మా దేశంలో ఉన్న బలహీన చట్టాల కారణంగా మాకు రక్షణ లేకుండా పోయింది. అందుకే ఇంటి నుంచి పారిపోయి వచ్చాము’ అంటూ సౌదీ అరేబియాకు చెందిన అక్కాచెల్లెళ్లు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పాస్‌పోర్టులను పునరుద్ధరించి సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజానికి మొరపెట్టుకుంటున్నారు. సౌదీ అరేబియాలో మహిళలను బానిసలుగా చూడటాన్ని భరించలేక.. ఆ దేశ యువతి రహాఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్ కొన్నిరోజుల క్రితం థాయ్‌లాండ్‌కు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో యూఎన్ శరణార్థి సంస్థ ఆమెకు కెనడాలో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలో సౌదీకి చెందిన ఇద్దరు యువతులు మహా అల్‌సుబే(28), వఫా అల్‌సుబే(25)కూడా ఇదేవిధంగా ఇంటి నుంచి పారిపోయి జార్జియాకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పాస్‌పోర్టులను రద్దు చేశారు. చదవండి : ‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’ ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన సదరు యువతులు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యను అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన యూఎన్ శరణార్థి సంస్థ.. బాధితులకు రక్షణ కల్పించాల్సిందిగా జార్జియా అధికారులకు విఙ్ఞప్తి చేసింది. కాగా ఇంతవరకు తమ అధికారులను బాధితులెవరూ కలవలేదని జార్జియా హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోఫో డినారడిజే గురువారం తెలిపారు. ఆశ్రయం కల్పించాల్సిందిగా తమను కోరలేదని, కనీసం సహాయం కోసం కూడా అర్థించలేదని పేర్కొన్నారు. చదవండి : అమెరికాలో సౌదీ అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య ఇక ఆడపిల్లగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న దుబాయ్ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం కొంతకాలం క్రితం ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆమె తరహాలోనే పలు యువతులు కూడా ఇటీవలి కాలంలో సౌదీ నుంచి పారిపోయి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. సౌదీకి తిరిగి వెళ్లాల్సి వస్తుందనే భయంతో రొటానా ఫారియా(22), ఆమె సోదరి తాలా(16) ఫారియా అనే అక్కాచెల్లెళ్లు న్యూయార్క్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయాల పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
‘దాని కంటే చావడమే నయం.. అందుకే’
వాషింగ్టన్ : గతేడాది అక్టోబరులో అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సౌదీ అక్కాచెల్లెళ్ల మరణ మిస్టరీ వీడింది. వీరిద్దరు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని న్యూయార్క్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మంగళవారం నివేదిక అందించారు. వివరాలు.. సౌదీ అరేబియాకు చెందిన రొటానా ఫారియా(22), ఆమె సోదరి తాలా(16) ఫారియా శవాలు హడ్సన్ నది సమీపంలో లభ్యమైయ్యాయి. వీరిద్దరి కాళ్లు టేప్‌తో చుట్టబడి ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో వీరిది ఆత్మహత్య అని తేలడంతో ఫారియా సిస్టర్స్ గురించి ఆరా తీయగా ఆశ్చర్యకర విషయాలు బయటికి వచ్చాయి. సౌదీకి వెళ్లడం కంటే చావడమే నయం! సౌదీకి చెందిన రొటానా, తాలాలు కుటుంబ సభ్యుల ఆంక్షలు తట్టుకోలేక న్యూయార్క్‌లో ఆశ్రయం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఇందుకు అనుమతి లభించకపోవడంతో వర్జీనియా నుంచి తిరిగి సౌదీకి పంపిస్తారేమోనని భావించిన ఈ అక్కాచెల్లెళ్లు న్యూయార్క్‌కు పారిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో సౌదీకి తిరిగి వెళ్లడం కంటే చావడమే నయమని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.(‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’) ఇక ఈ విషయంపై అమెరికా ఎంబసీలోని సౌదీ అరేబియా అధికార ప్రతినిధి ఫాతిమా బాసిన్ స్పందించారు. ‘ సౌదీకి చెందిన అక్కాచెల్లెళ్లు తాలా, రొటానా ఫారియాల బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారి శవాలను తీసుకువెళ్లగలరు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. అమెరికాలో ఆశ్రయం పొందడానికి వారు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు అవాస్తవం’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. వర్జీనియాలో ఉండే ఇంటి నుంచి వారిద్దరు అనేకసార్లు పారిపోయారని.. 2017 నుంచి న్యూయార్క్‌లోని వివిధ హోటళ్లలో బస చేసినట్లు తేలిందని ఆమె పేర్కొన్నారు. కాగా కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేక సౌదీకి చెందిన రహాఫ్ మహ్మద్ మలేషియాకు పారిపోయి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస శరణార్థి సంస్థ జోక్యం చేసుకుని కెనడాలో ఆమెకు ఆశ్రయం కల్పించింది. అంతేకాకుండా , ఆంక్షల చట్రం బయటపడేందుకు ప్రయత్నించిన దుబాయ్ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇటీవలే ఇంటికి చేరుకున్నారు కూడా. ఈ క్రమంలో సంప్రదాయాల పేరిట సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ఇంటి నుంచి పారిపోయిన ఫారియా సిస్టర్స్ ఆత్మహత్యపై సౌదీ ఎలా స్పందిస్తుందోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.(‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’) -
‘నేటితో ఈ కథ ముగిసింది..తను అక్కడే ఉంటుంది’
బ్యాంకాక్ : గృహహింస తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి థాయ్‌లాండ్‌కు వచ్చిన సౌదీ యువతి రహఫ్ ముహమ్మద్ అల్‌ఖునన్.. ఇకపై కెనడాలో ఆశ్రయం పొందనున్నారని థాయ్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ ముఖ్య అధికారి సురాచత్ హక్‌పర్న్ తెలిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ కెనడియన్ అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ‘ఈ కథ నేటితో ముగిసింది. కుమారి రహాఫ్ తన అభీష్టం మేరకు కెనడాకు వెళ్తున్నారు. థాయ్‌లాండ్ నుంచి టొరంటో వెళ్లే విమానంలో ఆమె బయల్దేరారు. ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రహాఫ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. కెనడాకు బయల్దేరుతున్నపుడు ఆమె ముఖం నవ్వుతో వెలిగిపోయింది’ అంటూ సురాచత్ పేర్కొన్నారు. కాగా సౌదీకి చెందిన పద్దెమినిదేళ్ల యువతి రహాఫ్ మహ్మద్ అల్‌ఖునన్ తల్లిదండ్రుల ఆంక్షలను తట్టుకోలేక, తనకు నచ్చినట్టుగా బతకాలని ఉందంటూ గత శనివారం థాయ్‌లాండ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రహాఫ్ వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో థాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను తిరిగి స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని మీడియా, ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకువెళ్లిన రహాఫ్... ప్రస్తుతం శరణార్థిగా గుర్తింపు పొంది కెనడాలో ఆశ్రయం పొందనున్నారు. (చదవండి : ‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’) ఆమె కెనడాలో ఉండవచ్చు : ట్రూడో రహాఫ్ కెనడాలో జీవించేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకారం తెలిపారు. ‘ మానవ హక్కులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో కెనడా అర్థం చేసుకోగలదు. బాధితుల తరపున నిలబడేందుకు మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాం. మహిళల హక్కులను కాపాడాల్సిన బాధ్యతను అనుసరించి ఐక్యరాజ్య సమితి శరణార్థి సంస్థ చేసిన అభ్యర్థనను మన్నిస్తున్నా’ అని జస్టిన్ ట్రూడో వ్యాఖ్యానించారు. కాగా రహాఫ్ వ్యవహారంతో కెనడా- సౌదీల మధ్య ఉన్న బంధం మరింత బలహీనపడనుంది. గతంలో.. మహిళా కార్యకర్తలను అడ్డుకున్న సౌదీ అధికారుల తీరును విమర్శిస్తూ కెనడా ప్రతినిధులు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కెనడియన్ రాయబారి రియాద్ రాకుండా సౌదీ అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. -
‘ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తే.. కచ్చితంగా చంపేస్తారు’
ఆడపిల్లగా పుట్టినందుకు స్వేచ్ఛ లేదని, రాచకుటుంబ ఆంక్షల చట్రం నుంచి బయటపడి, అమెరికాలో ఆశ్రయం పొందాలనుకున్న దుబాయ్ యువరాణి షికా లతీఫా... అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఇటీవలే ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే. సంప్రదాయాల పేరిట మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందంటూ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సౌదీకి చెందిన రహాప్ మహ్మద్ అల్-కునున్ అనే పద్దెనిమిదేళ్ల యువతి తనకు నచ్చినట్టుగా బతకాలని ఉందంటూ ఇంట్లో నుంచి పారిపోయి రావడంతో ‘ఆంక్షల’ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాలో స్థిరపడాలని నిర్ణయించుకున్న రహాప్ తల్లిదండ్రులకు చెప్పకుండా ఒంటరిగా శనివారం కువైట్ నుంచి బయలుదేరింది. అయితే ఆమె బ్యాంకాక్ చేరుకోగానే ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రహాప్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె రెండు రోజులపాటు బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులోని హోటల్లో తలదాచుకుంది. ఈ నేపథ్యంలో రహాప్ వ్యవహారం థాయ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు దృష్టికి రావడంతో సోమవారం ఆమెను తిరిగి కువైట్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రహాప్ అప్పటికే ఈ విషయం గురించి ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ దృష్టికి తీసుకువెళ్లింది. ‘నేను ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను. నన్ను చంపేస్తానంటూ నా కుటుంబ సభ్యులే బెదిరిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు గనుక నేను ఇంటికి తిరిగి వెళ్లినట్లైతే వాళ్లు కచ్చితంగా నన్ను చంపేస్తారు’ అంటూ రాయిటర్స్‌కు ఆడియో, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా రహాప్ తన పరిస్థితిని వివరించింది. ఈ క్రమంలో రహాప్ విషయం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ తరపున బ్యాంకాక్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న థాయ్ ప్రతినిధి సోమవారం రహాప్తో మాట్లాడి ఆమెకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకాక్‌లోనే ఓ సురక్షిత ప్రాంతంలో రహాప్కు ఆశ్రయం కల్పిస్తామని, ఆమెను వెనక్కి పంపించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. సౌదీలో మాది శక్తిమంతమైన కుటుంబం ‘నన్ను శారీరకంగా, మానసికంగా, మాటలతో దారుణంగా హింసించారు. కొన్ని నెలలపాటు ఇంట్లో బంధించి నరకం చూపించారు. ఇంకా చదువుకుంటానని పట్టుబడితే చంపేస్తామని బెదిరించారు. అస్సలు బయటికి వెళ్లనివ్వరు. డ్రైవింగ్ చేస్తానన్నా వద్దంటారు. నాకేమో జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉంటుంది. అలాగే ఉన్నత చదువులు చదివి ఆదర్శప్రాయంగా నిలవాలని ఉంటుంది. అందుకే అతి కష్టం మీద ఆస్ట్రేలియా వీసా సంపాదించా. కొన్ని రోజుల థాయ్‌లాండ్‌లో ఉండి ఎవరికీ అనుమానం రాకుండా ఆస్ట్రేలియా వెళ్లిపోదాం అనుకున్నా. కానీ మా వాళ్లకు ఇదంతా ఇష్టం ఉండదు. సౌదీలో మాది ఓ పవర్ఫుల్ ఫ్యామిలీ. అందుకే ఇప్పుడు నన్ను ఆపేయాలని ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ రాయిటర్స్‌తో తన పరిస్థితి గురించి రహాప్ వివరించింది. తనను తాను హోటల్లో బంధించుకుని, ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వందలాది మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. (‘వాళ్ల అమ్మ రమ్మంటేనే వెళ్లాను.. తను చాలా మంచిది’) అదంతా అబద్ధం.. రహాప్ చెప్పినట్లుగా ఆమె వద్ద ఆస్ట్రేలియా వీసా లేదని థాయ్ ఇమ్మిగ్రేషన్ ముఖ్య అధికారి తెలిపారు. రహాప్ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని ఆమె భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందడంతో సౌదీ ఇమ్మిగ్రేషన్ పోలీసులు తమని సంప్రదించారని పేర్కొన్నారు. తన డాక్యుమెంట్లన్నీ పరిశీలించాం. ‘పాస్‌పోర్టు తప్ప రిటర్న్ టికెట్ గానీ, ఇతర ట్రావెల్ ప్లాన్‌గానీ ఏమీ లేదు. ఏ హోటల్లోనూ బస చేసేందుకు కూడా తను రిజర్వేషన్ చేయించుకోలేదు. అందుకే నిబంధనలను అనుసరించే తనని వెనక్కి పంపాలని నిర్ణయించుకున్నాం’ అని వెల్లడించారు. went out of the room to figure out if they’re watching me closely or not I’m under there sight all times “been asked to get back to the room” She was checking when I’m going to be send back to Kuwait before 11h of the flight time they must want it to end as soon as possible pic.twitter.com/mwBbKQ9QN7 — Rahaf Mohammed رهف محمد القنون (@rahaf84427714) January 6, 2019 -
మూడు లక్షల మంది మరణించారు
సిరియా యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరేళ్లు కావొస్తోంది. ఈ కాలంలో ఆ దేశంలోని కీలక భాగాలు నాశనమయ్యాయి. యుద్ధంలో ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది మరణించగా.. దేశ జనాభాలో సగానికిపైగా జనాభా శరణార్ధులుగా పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. భారీగా మరణాలు 2011 మార్చిలో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నినాదాల నుంచి ఇప్పటివరకూ మూడు లక్షల పన్నెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ గత వారం పేర్కొంది. వీరిలో 90 వేల మందికి పైగా పౌరులు ఉన్నట్లు తెలిపింది. యుద్ధానికి ముందు 23 మిలియన్లు జనాభా కలిగిన సిరియాలో యుద్ధం కారణంగా 6.6 మిలియన్ల జనాభా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పింది. శరణార్ధులు యుద్ధం కారణంగా 48 లక్షల మంది ప్రజలు సిరియాను వదిలి వెళ్లిపోయారని యూనైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్(యూహెచ్ సీఆర్) పేర్కొంది. వీరిలో 27 లక్షల మంది పైగా టర్కీకి వలస వెళ్లారని చెప్పింది. టర్కీ తర్వాత లెబనాన్, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు శరణార్ధులకు ఆశ్రయం కల్పించాయి. అయితే, పెద్ద సంఖ్యలో శరణార్ధులు యూరప్ చేరుకోవడానికి సముద్రమార్గాన్ని ఎంచుకుని ప్రాణాలు కోల్పోయారు. యూరప్ చేరుకున్న కొంతమంది శరణార్ధులను అక్కడ అధికారులు జైళ్లలో బంధించి చిత్రవధ చేశారు. దాదాపు 17,700 మంది యూరప్ జైళ్లలో మరణించగా, వేల మంది జీహాదిస్టుల చెరలో ప్రాణాలు వదిలారని యూహెచ్ సీఆర్ చెప్పింది. నాశమైన ఆర్ధిక వ్యవస్ధ సిరియా యుద్ధం కారణంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ మూడు దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి వచ్చే అన్ని రకాల ఆదాయాలకు గండి పడగా.. వసతులు, ఆరోగ్య, విద్యావ్యవస్ధలు సమూలంగా నాశనమయ్యాయి. సిరియా మొత్తం(కొన్ని ప్రాంతాల మినహా) విద్యుత్తు సౌకర్యం లేకుండా జీవనం సాగిస్తోందని ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ 2015లో చెప్పింది. 80శాతం జనాభా పేదరికంలో బతుకీడుస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్యలో 55శాతం మేర సిరియా ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలింది. -
గ్రీస్‌కు మరో తలపోటు
తాహతుకు మించి అప్పులు చేసి రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొని.. కొత్త అప్పుతో తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గ్రీస్‌కు మరో తలపోటు పెరిగింది. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోన్న లిబియా, సిరియా, ఆఫ్ఘన్ లాంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు గ్రీస్‌కు తరలిరావడమే ఇందుకు కారణం. ఇప్పటికే సంక్షేమ పథకాలు, పెన్షన్లలో భారీ కోతలు విధించి ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్న సైప్రస్ ప్రభుత్వం.. వెల్లువలా దూసుకొస్తున్న వలసలను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక మిన్నకుండిపోయింది. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీచేసింది. ఐక్యరాజ్యసమితి శరణార్థుల సహాయ కమిషన్ (యూఎన్‌హెచ్‌సీఆర్) అధికార ప్రతినిధి విలియం స్ప్లిండ్లర్ మంగళవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 21 వేల మంది శరణార్థులు గ్రీస్ లోకి ప్రవేశించారని, జనవరి 1 నుంచి ఆగస్టు 14 వరకు గ్రీస్‌కు వచ్చిన వలసదారుల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. వీరంతా ఏజియన్ సముద్రం గుండా గ్రీస్ ద్వీపాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రధాన భూభాగానికి తోడు దాదాపు 6 వేల ద్వీపాలు కూడా గ్రీస్ దేశంలో భాగంగా ఉన్నాయి. చెల్లాచెదురుగా విస్తరించిన ఈ ద్వీపాల వద్ద సైన్యాల మోహరింపు పరిమిత స్థాయిలో ఉండటం కూడా వలసదారుల పనిని సులువు చేసింది. సాధారణంగా శరణార్థులు లిబియా తీరం నుంచి మధ్యదారా సముద్రం గుండా యూరప్‌కు చేరుకుంటారు. అయితే గత కొద్దికాలంగా ఆ మార్గంలో పడవ ప్రమాదాలు జరిగి భారీ సంఖ్యలో శరణార్థులు చనిపోయారు. దీంతో యూరప్ కు వలసపోయేందుకు శరణార్థులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అటు ద్వీపాలతోపాటు ప్రధాన భూభాగంలోనూ భద్రతను కట్టుదిట్టం చేసి వలసలను నిరోధించకపోతే గ్రీస్‌కు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విలియం స్ప్లిండ్లర్.