టాప్ ఐఐటీల్లో మళ్లీ ఫీజు పెంపు?
► నాణ్యతా ప్రమాణాల కోసం పెంచుకునే దిశగా కసరత్తు
► పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అగ్ర శ్రేణి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో మరోసారి ఫీజులు పెరగనున్నాయి. ఈ దిశగా ఐఐటీలతోపాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆలోచనలు చేస్తోంది. గత విద్యా సంవత్సరంలోనే ఐఐటీల కౌన్సిల్ ఫీజులను పెంచింది. రూ.90 వేలుగా ఉన్న వార్షిక ఫీజును రూ.2 లక్షలకు పెంచింది. ప్రస్తుతం మళ్లీ ఫీజుల పెంపు అంశం చర్చకు వచ్చింది. అయితే అన్ని ఐఐటీల్లో ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వాలా, లేదా టాప్ ఐఐటీలకే ఆ అధికారాన్ని ఇవ్వాలా, అనే అంశంపైనా కేంద్రం పరిశీలన జరుపుతోంది. ప్రపంచస్థాయి విద్యా సంస్థల జాబితాలో ఐఐటీలు చోటు పొందాలంటే మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టడం, పరిశోధనలను విస్తృతం చేసేందుకు అవసరమైన ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది.
ఈ మేరకు ప్రపంచస్థాయి ర్యాంకింగ్ కోసం పోటీ పడే కొన్ని ఐఐటీలకే ఫీజులను నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులకు పది శాతం అదనపు సీట్లు కేటాయించి, వారి నుంచి వసూలు చేసేలా చర్యలు చేపట్టాలన్న మరో ప్రతిపాదన పరిశీలనలో ఉంది. అయితే సీట్ల పెంపునకు కౌన్సిల్ ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఖరగ్‌పూర్, ముంబై సహా అరడజను ఐఐటీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో (ఎన్ఐఆర్ఎఫ్) ప్రపంచ స్థాయి విద్యా సంస్థల జాబితాలో ప్రభుత్వ విద్యా సంస్థలకంటే ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యా సంస్థలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే ఆ విద్యా సంస్థలు ఒక్కోటి రూ.200 కోట్ల కార్పస్ ఫండ్‌తో కొనసాగుతున్నాయి. అదే స్థాయిలో 20 ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే ముఖ్యమైన ఐఐటీల్లో ఫీజు పెంపు అంశం తెరపైకి వచ్చింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల సమయం నాటికి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.