చిరకాల శత్రువుల కరచాలనం
ప్రమాదంలోనూ ఓ సుగుణం ఉంది. ఊహింపశక్యంకాని కూటములకు అది దారితీస్తుంది. ఐఎస్ఐఎస్ విషయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన మౌన ఒప్పందం అలాంటిదే. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్‌కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ తిక్రిత్‌లో ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించారు. అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది.
పౌరులకు సౌఖ్యంగా అనిపించేలా చేయడానికి దేశాలు కనిపెట్టిన భ్రమే స్థిరత్వం. ప్రభుత్వాల నియంత్రణకు మించిన గురుత్వాకర్షణ శక్తి ఈడ్చుకు పోతుంటే దేశాలు మునిగిపోతాయి. లేదంటే మంచిగా ఒక్కొక్క మెట్టే పైకి పోతాయి. గమన వేగం తరచుగా మెల్లగానూ, కొన్నిసార్లు అదృశ్యంగానూ సాగుతుంది. అంతేగానీ సమాజం ఎన్నటికీ స్థిరంగా ఉండదు. 21వ శతాబ్ది మొదటి పదిహేనేళ్లలో ఆఫ్రికా ఖండపు అట్లాంటిక్ తీరప్రాంతాల నుంచి పసిఫిక్ మహాసముద్రంలోని జపాన్ తీరం వరకు ఉన్న ప్రాంతం ఒక వాలు గా మారింది. అందులోని పశ్చిమ భాగం ఊబిలోకి దిగజారిపోతుండగా, భారత్ మొదలు తూర్పు భాగం ఒక్కొక్క అంగుళమే పైకి లేస్తోంది. ఇది ఒక సరిసమాన వాస్తవం కాకపోవచ్చు. కొన్ని మినహాయింపులు దీనికి ఉన్నాయి.
ఒంటరిగా, విడిగా ఉన్న భూభాగంగా ఇజ్రాయెల్ దీనికి మినహాయింపు కాదు. ఆ దేశ రాజధాని టెల్ అవీవ్‌లోని రియల్ ఎస్టేట్ ధరలే ఉదాహణ. శతఘు్నల గురికి అందుబాటులో, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆ నగరంలో కంటే మీరు యూరప్‌లోనే అపార్ట్‌మెంట్‌ను కొనుక్కోవ చ్చు. కానీ అక్కడా ఇక్కడా రియల్ ఎస్టేట్ ధరలు ఒకేలా ఉంటాయి. ఇజ్రాయెల్‌ను చట్టుముట్టి ఉన్న దేశాల రాజకీయాల వల్ల ఆ దేశ భౌగోళిక- రాజకీయాలు మారాయి. ఇజ్రాయెల్ ప్రథమ శ్రేణి దేశంగానే ఉంటున్నా... పలు యుద్ధాలు వ్యాపించి ధ్వంసమైన ఆ ప్రాంతంలో దాని అస్తిత్వం నేడు అనుబంధమై నదిగా మారింది. ఇజ్రాయెల్ నేత బెంజమిన్ నెతన్యాహూ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతూనే ఉండి ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఏకాకి గా ఉండటం ద్వారానే తన భద్రతను అత్యుత్తమంగా పరిరక్షించుకుంటోంది. వివేకంతో దగ్గరగా నిలచి జాగ్రత్తగా గమనిస్తున్న వీక్షక పాత్రధారిగా మారిం ది. ఇజ్రాయెల్ తన శత్రువులను బలహీనపర్చాల్సిన పనే లేదు. అవి వాటికవే తమను తాము బలహీనపరచుకుంటున్నాయి.
ఇజ్రాయెల్ చుట్టూ వ్యాపించిన సంఘర్షణ అంచులు ఇక ఎంత మాత్రమూ జాతీయ సరిహద్దుల వెంబడి సాగడం లేదు. అట్టోమన్ సామ్రా జ్య పతనంతో మొదలైన జాతీయ సరిహద్దుల విచ్ఛిన్నం వలస పాలనలో సుదీర్ఘంగా కొనసాగింది. వారి ఆదేశాల ఫలితంగానే పలు దేశాల సరిహద్దు లు సాధారణ సరళ రేఖలుగా మారాయి. అందుకే ఉద్రిక్తతల రేఖలు భౌగోళి కమైనవి కావు, జనాభాపరమైనవి. పాత శత్రుత్వాలకు సంబంధించినవి.
ప్రజాభీష్టానుసారం, ప్రజల ఇచ్ఛకు అనుగుణంగా, ప్రజలకు మంచి యైన దాన్ని చేయడానికి మౌలిక ఆవశ్యకత జాతీయ రాజ్యాల ఏర్పాటే. కానీ అరబ్బు, అరబ్బేతర ప్రాంతాల్లోని చాలా సున్నీ ముస్లిం దేశాలు జాతీయ రాజ్యాలను ఏర్పరచుకోవడంలో విఫలమై అంతర్యుద్ధాల్లోకి దిగజారాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ క్షీణత మరమ్మతులకు వీలుకానంతగా దిగజారినట్టనిపి స్తోంది. చరిత్ర శిథిలాలు, తప్పిదాల శకలాల అతుకుల బొంతగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఆవిర్భావం అందుకు గొప్ప ఉదాహణ. ఈ తీవ్రవాద భూతం తమ శత్రువులను నాశనం చేస్తుందనే ఆశ తో ప్రాంతీయ, ప్రపంచ శక్తులు దానికి ఆర్థిక వనరులను సమకూర్చాయి. అది తన పోషకులకు కూడా అంతే విధ్వంసకారి అని ఇప్పుడు వాటికి అర్థమైంది.
ప్రమాదంలో కనీసం ఓ సుగుణం ఉంది. ఒకప్పుడు ఊహింపశక్యంకాని కూటములను అది పెంపొందింపజేస్తుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఐఎస్ఐఎస్ విషయంలో కుదిరిన మౌన ఒప్పందం కచ్చితంగా అలాంటి వాటి లోకెల్లా ఆసక్తికరమైనది. అవి రెండూ ఆ కూటమిలోకి భిన్న దృక్పథాలతో వచ్చినవి. విభిన్నమైన యుద్ధానంతర పరిస్థితులు వాటికవే సమస్యాత్మక దశ కు ఊపిరిపోస్తాయి. కానీ ఇప్పటికైతే అవి తమ పరిమిత ఒప్పందాన్ని సమం జసమైనదిగా చేసే దారి కోసం అన్వేషిస్తున్నాయి. అమెరికా వైమానిక దళం మద్దతుతో ఇరాన్‌కు చెందిన అల్ కుద్స్ సైనికాధికారులు, సైన్యమూ ఇరాకీ భూతల ప్రతిఘటనా దాడికి నేతృత్వం వహించాయి. సహకారం వల్ల తక్షణ వ్యూహాత్మక లాభాల అనుభవమూ, విశాల ప్రయోజనకరమైన అంశాలు కలసి అమెరికా, ఇరాన్‌ల మధ్య అణు ఒప్పందం కుదరడాన్ని అనివార్యం చేశాయి. దీనికి కూడా అవాంతరాలు త లెత్తే అవకాశం ఉంది. అయితే అణు ఒప్పందం కుదిరితే ఇరాన్‌పై ఆంక్షల సడలింపు గురించి ఇప్పటికే ఐరాస భద్రతా మండలి సమాలోచనలు జరుపుతున్నది. అంతా అనుకున్నట్టే జరిగితే అమెరికా, ఇరాన్‌లు రెండూ ఇరాక్ హింసాగ్ని గుండాన్ని చల్లార్చడానికి కలిసి ప్రయత్నించడం ప్రారంభమవుతుంది. రెండిటిలో ఏదీ ఈ పనిని ఒంటరిగా చేయలేదు. ఇరాక్ భూభాగంపై ఇరాన్ కాల్బలం కవాతు చేయగలిగిన స్థితిలో ఉంది, అమెరికా సేనలు అక్కడ కాలు మోపే పరిస్థితి లేదు.
తాత్కాలికమే అయినా అదీ ఉన్న స్థితి. ఐఎస్ఐఎస్ ఒక వ్యాధిలాగా తీవ్ర పర్యవసానాలతో ప్రబలి...అల్‌కాయిదా సమస్యను నల్లి కాటులా అనిపించేలా చేసే ప్రమాదకర అత్యవసర పరిస్థితిని రెంటిలో ఏదీ తక్కువగా అంచనా వేయడం లేదు. మనం మాట్లాడుతున్నది ఆత్మాహుతి దాడులకు పంపే ఉగ్రవాదుల గురించి కాదు.... అరబ్బు ప్రాంతాల్లోనూ, వాటిని దాటి కూడా విఫల పరిపాలన సృష్టించిన శూన్యాన్ని భర్తీ చేస్తూ దేశాలను ఆక్రమించడానికి జిహాద్ పేరిట సిద్ధంగా ఉన్న సేనల గురించి. ఈ పెద్ద లక్ష్యంతో పోలిస్తే ఇతరత్రా సమాం తర ప్రయోజనాలు ఏవైనా సాపేక్షంగా తక్కువ మూల్యం చెల్లించాల్సినవే. ఐఎస్ఐఎస్ కేంద్రంగా నెలకొనే అరాచక పరిస్థితులకు చెల్లించాల్సి మూల్యం అంచనాకు అందేది కాదు. ఇది అధ్యక్షుడు బరాక్ ఒబామా పదవీ కాలంలోని మిగతా భాగం గడిచేలోగా పూర్తయ్యే పనేమీ కాదు. అయితే ఆయన దీన్ని ప్రారంభించకపోతే ఆయన వారుసునిగా వచ్చేవారు కూడా ఆ పని చే యలేరు.
1979లో అమెరికా, ఇరాన్‌ల మధ్య విభేదాలు తలెత్తడం, అదే ఏడాది సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చే యడంతో అంతవరకు ఉన్న ప్రయోజనాల పరస్పర అనుసంధానాల సంతులనం తలకిందులైంది. పశ్చి మ ఆసియాలో జరిగిన మూడు అరబ్బు-ఇజ్రాయెల్ యుద్ధాలను, లెబనాన్ సంక్లిష్ట కల్లోలాన్ని, పాలస్తీనా కోసం సాగిన బహుముఖ యుద్ధాలను ఆ సంతులనం తట్టుకుని నిలిచింది. షియా-సున్నీ శాంతికి హామీని కల్పిం చింది. సుదీర్ఘమైన ఈ డ్రామాలోని ఉప ఇతివృత్తం ఆ షియా-సున్నీ సంబం ధాలే. సోవియట్ సేనలు నిష్ర్కమించాయి, వారి యూనియన్ మరణిం చింది. కానీ పర్యవసానాలు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. అమెరికా- ఇరాన్ అణు ఒప్పందం సైతం వారి మధ్య చెప్పుకోదగినంతటి సౌహార్ద్రతకు దారితీస్తుందని చెప్పలేం. ఆదర్శవంతమైన దాని కోసం అన్వేషణలో మంచి దాన్ని విడనాడవద్దనేది అంతర్జాతీయ జీవితంలోని మౌలిక నియమం. ఇప్పటికిదే ఉత్తమం.
- ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు