అగ్రకులాలను బీసీలో కలిపితే సహించం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు
అరండల్‌పేట: అగ్రకులాలను బీసీల్లో చేర్చే హక్కు ఏ కమీషన్‌కు లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు. శనివారం స్థానిక గుజ్జనగుండ్లలోని ప్రగడ కోటయ్య చేనేత భవన్లో జిల్లాలోని బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కాపులను బిసీల్లో చేర్చే అంశంలో మంజునాథ కమీషన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. త్వరలో పదివేల మందితో బీసీల గుండెచప్పుడు కమీషన్‌కు వినిపించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సంఘ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు మాట్లాడుతూ చేనేత భవన్ వద్ద వసతిగృహం ఆనుకొని రైతుబజార్ నిర్మాణాన్ని అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు కుమ్మరి క్రాంతికుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి బీసీ సంఘాన్ని పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే యువత, విద్యార్ధులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశానికి సంఘం నగర అధ్యక్షుడు కన్నా మాస్టారు అధ్యక్షత వహించారు.