Usha Kumari
-
కలుపు మొక్కలే పంటకు శత్రువు
శ్రీకాకుళం అగ్రికల్చర్: వేరుశనగలో కలుపు మొక్కలు ఉంటే పంట ఎదుగుదల తగ్గుతుంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కలుపునివారణ పద్ధతులను తెలుసుకోకపోవడం వల్లే రైతులకు పెట్టుబడి తడిసిమోపెడవుతోంది. రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కలుపు మందులు వినియోగించి సరైన యాజమాన్య పద్ధతులు పాటి స్తే పంట లాభసాటిగా ఉంటుందని శ్రీకాకుళం మండల వ్యవసాయాధికారి ఎం.ఉషాకుమారి(88866 12670) అన్నారు. కలుపు నివారణ పద్ధతులను సూచించారు. కలుపు మొక్కలతోనే నష్టం వేరుశనగ పంటకు మొదటి శత్రువు కలుపు మొక్కలే. ఇవి వివిధ దశల్లో ఆశించి దిగుబడి తగ్గడానికి కారణమవుతాయి. వేరుశనగ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు సాలుల మధ్య కలుపు మొక్కలు తొందరగా పెరిగి వేరుశనగ పైరుకు పోషక పదార్థాలను విని యోగించుకుంటాయి. భూమి నుంచి నత్రజని 58 కిలోలు, భాస్వరం 8 కిలోలు, పొటాష్ 45 కిలోలు వినియోగించుకుంటాయని పరిశోధనల్లో తేలింది. కలుపు ఎక్కువగా ఉంటే ప్రతి హెక్టారు విస్తీర్ణంలో వేరుశనగ పంట వర్షాధారంగా సాగు చేసినప్పు డు దిగుబడి 22-39 శా తం, ఆరుతడి పంటగా వేరుశనగసాగు చేసినప్పుడు 30-50 శాతం వరకు తగ్గుతుంది. వేరుశనగ పంటలో కలుపు మొక్కల ఉద్ధృతి వర్షాధారంగా సాగు చేసినప్పుడు ఎక్కువగానూ, నీటి పారుదల కింద సాగు చేసినప్పుడు తక్కువగా ఉంటుంది. పురుగులు, తెగుళ్ల ఉద్ధృతి.. కలుపు మొక్కలు కొన్ని రకాల పురుగులు, తెగుళ్లకు ఆశ్రయమిచ్చి వేరుశనగ పంటకు నష్టం కలుగజేస్తున్నాయి. రైతు సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుంది. వేరుశనగ పంట లో వయ్యారి భామ కలుపు మొక్కలు పూవుల పుప్పొడి అధికంగా ఉన్నప్పుడు కలుపు మొక్కల ద్వారా కాండం కుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. వేరుశనగ పంటలో ఎన్నెద్దులాకు, గరిటికమ్మ, ఉత్తరేణి, చినపల్లేరు వంటి కలుపు మొక్క లు కొన్ని రకాల వైరస్ తెగుళ్లను ఆశించి శిలీంధ్రాలకు ఆశ్రయమిస్తాయి. పార్ధీని యం కలుపు మొక్కలు ఉన్న ప్రాంతం నుం చి గాలి, పుప్పొడి రేణువుల ద్వారా తెగులు కారక శిలీంధ్రాలు వేరుశనగ మొక్కలకు చేరుతాయి. తెగులు సోకిన పొద్దు తిరుగుడు పొలం నుంచి పంట మార్పిడి సమయంలో కాండంకుళ్లు వైరస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. కలుపులో రకాలు.. వేరుశనగ పంటను ఆశించే కలుపు మొక్కలు గడ్డి జాతికి చెందినవి. వెడల్పాకులు గల కలుపు మొక్కల్లో తుంగగడ్డి, ఊద, గరిక, ఊదర, చీపురుగడ్డి, కొర్రగడ్డి, ఉర్రంకి, బొంత, కుక్కవామింట, పెదపాయల కూర, గలిజేరు, పల్లేరు, గడ్డి చామంతి, ముళ్ల తోటకూర, నేల ఉసిరి, గురువుగూర, వయ్యారి బామ వంటివి పంటలను నాశనం చేసే కలుపు మొక్కలు. కలుపు నివారణ ఇలా... పంటను విత్తిన 25-30 రోజుల్లో కలుపును నిర్మూలించుకోవాలి. విత్తిన 30-35 రోజుల్లో పే కూలీలతో గొప్పు తవ్వి కలుపును నివారిం చాలి. విత్తిన 40-45 రోజుల నుంచి ఉడలు నేల లోకి దిగడం ప్రారంభమౌతుంది. ఈ దశ లో ఎట్టి పరిస్థితిల్లోనూ మొక్కలను, మట్టిని కదపకూడదు. ఒక వేళ ఆలస్యంగా కలుపు తీసే ప్రయత్నం చేస్తే ఊడలు దిగే ప్రక్రియకు అంతరాయం కలిగి కాయల సంఖ్య గణనీయం గా తగ్గిపోతుంది. విత్తిన మూడు రోజుల లోపల ఎకరాకు 1.25-1.5 లీటర్ల అలాక్లోర్ లేదా పెం డి మిథాలిన్ 30 శాతం మందు లేదా బ్యూటాక్లోర్ 50 శాతం మందును ఈ రెండింటి లో ఏదో ఒకదాన్ని 200 లీటర ్ల నీటిలో కలిపి నేలపై సమానంగా పడేలా పిచికారీ చేయూలి. -
జెడ్పీలో.. రాజకీయ రగడ..
= కొత్త సీఈవోగా సుబ్బారావు నియామకం = జీవో జారీ చేసిన ప్రభుత్వం = కీలకనేత అనుచరుడి హస్తం = జేసీ బదిలీ నిలుపుదల, జెడ్పీ సీఈవో నియామకంపై చర్చ = సీనియారిటీ, ట్రి బ్యునల్ తీర్పును పట్టించుకోని వైనం సాక్షి, మచిలీపట్నం : కాంగ్రెస్ పాలనలో రాజకీయ అండ, కీలక నేతల ఆశీస్సులు ఉంటే చాలు బదిలీ అయిన అధికారులు సైతం సీటు కదలక్కర్లేదు.. రాదనుకున్న పోస్టును దక్కించుకోవచ్చు.. తాజాగా జిల్లా పరిషత్ సీఈవో నియామకంలోనూ రాజకీయ నేతలదే పైచేయి అని తేటతెల్లమైంది. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి బదిలీని నిలుపుదల చేయించిన కీలక వ్యక్తి మరోమారు చక్రం తిప్పడంతో జెడ్పీ సీఈవో నియామకం తాము అనుకున్న అధికారికే దక్కింది. జెడ్పీ సీఈవోగా నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన పి.సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పంచాయతీరాజ్ అధికారులు శాఖాపరంగా తీసుకున్న చర్యలు, ట్రిబ్యునల్ తీర్పు వంటివాటిని పక్కనపెట్టి ముఖ్యనేత సిఫారసుతోనే ఈ తతంగం సాగినట్టు ప్రచారం సాగుతోంది. రెండు నెలల నుంచే పైరవీలు... జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన సీఎస్ కొండయ్యశాస్త్రి రెండు నెలల క్రితం బదిలీకావడంతో ఆ పోస్టుకు పైరవీలు ఊపందుకున్నాయి. దీంతో ఎవరికివారే సీఈవో పోస్టు కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఇన్‌చార్జిగానైనా ఆ బాధ్యతలు చేపట్టేందుకు జిల్లాలోని ఎంపీడీవోలు సైతం ఎడతెగని ప్రయత్నాలు చేశారు. దీంతో ఎట్టకేలకు నందివాడ ఎంపీడీవోగా పనిచేసిన చింతా కళావతిని ఇన్చార్జి జెడ్పీ సీఈవోగా నియమిస్తూ అప్పట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఎంపీడీవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణను డిప్యూటీ సీఈవో గాను, పి.అనురాధను జెడ్పీ ఏవోగాను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియామకాలను సవాల్ చేస్తూ తామే వారికంటే సీనియర్లమంటూ రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఏవో వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవో పి.కృష్ణమోహన్‌లు గత నెలలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ట్రిబ్యునల్ తీర్పును అమల్లోకి తేలేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులకు అర్హులం తామంటే తామేనని పలువురు ఉద్యోగులు పోటీ పడటంతోపాటు పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో పైరవీలు సాగాయి. కీలకనేత పట్టుతోనే.. జెడ్పీ సీఈవో నియామకం విషయంలో తొలి నుంచి నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన సుబ్బారావు పేరు వినిపించింది. అయినా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయంటూ సుబ్బారావుపై వ్యతిరేకత ఉన్నవారంతా నియామకాన్ని అడ్డుకునేందుకు పావులు కదిపారు. నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన కాలంలో సుబ్బారావుపై అనేక ఆరోపణలు ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ఆయన నియామకం జరగదని అంతా భావించారు. అయినా జిల్లా కీలక నేత పట్టుతో నియామకం జరిగినట్టు సమాచారం. ఆయన్ని ఏడాదిపాటు జెడ్పీ సీఈవోగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా ఈ నెల 16న జీవో నంబర్ 1786ను జారీ చేశారు. ఈ విషయం సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో గుప్పుమనడంతో చర్చ సాగుతోంది. నిబంధన మేరకే జరిగిందా? జిల్లా పరిషత్ సీఈవోగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన సీనియర్ ఉద్యోగులకే బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా ఉంది. దీనిపై ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు పంచాయతీరాజ్ ఉద్యోగులు చెబతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నత పోస్టుల్లో ఇతర శాఖలకు చెందినవారిని 50 శాతం వరకు నియమించుకోవచ్చన్న వెసులుబాటు ఉంది. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు 12 జిల్లాల్లో జెడ్పీ సీఈవోలుగా ఇతర శాఖల నుంచి వచ్చినవారినే నియమించారు.దీంతో ఇతర శాఖల నుంచి నియమించుకునేలా 50 శాతం వరకు ఇచ్చిన వెసులుబాటు దాటిపోయింది. అయినా రెవెన్యూశాఖకు చెందిన సుబ్బారావును నియమించుకునేలా ప్రత్యేకంగా ఆ నిబంధనను సవరించారన్న ప్రచారం ఉంది. కీలకనేత అనుచరుడి హస్తం.. జిల్లాలో చర్చనీయాంశంగా మారిన జాయింట్ కలెక్టర్ బదిలీ నిలుపుదలలోను, జెడ్పీ సీఈవో నియామకంలోను ఒక కీలకనేత అనుచరుడి హస్తం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఒకేరోజున కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జేసీ పి.ఉషాకుమారి బదిలీ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలో కొందరు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుపానును సాకుగా చూపి గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి సాయంతో జేసీ బదిలీని నిలుపుదల చేయించినట్టు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టినా కీలకనేత అండతో ఆ అనుచరుడు జేసీ బదిలీని నిలుపుదల చేయించగలిగారు. తాజాగా నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావును జెడ్పీ సీఈవోగా నియమించేలా అదే అనుచరుడు చక్రం తిప్పినట్టు ప్రచారం సాగుతోంది. -
‘ఆధార్’ ఊరట!
సాక్షి, మచిలీపట్నం : ప్రభుత్వం అందించే పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడం సరికాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జిల్లా వాసులకు ఊరటనిచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్డులో రివ్యూ పిటిషన్ వేయడంతో లబ్ధిదారుల్లో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ సర్కార్ అందించే సబ్సిడీలకు ఆధార్ కార్డులను ముడిపెట్టిన విషయం తెలిసిందే. గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దశలవారీగా ప్రభుత్వం అందించే అన్ని పథకాల సబ్సిడీలూ పొందేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకానికి ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా ఉండాలన్న నిబంధన ప్రధాన సమస్యగా మారింది. నేటికీ పూర్తికాని ‘ఆధార్’ జారీ ప్రక్రియ.. జిల్లాలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటికీ పూర్తికాలేదు. జిల్లాలోని ప్రతి మండలానికీ ఒక ఆధార్ కేంద్రం తెరుస్తామని జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి ఇచ్చిన హామీ రోజులు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరిచేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. వెరసి అటు ఆధార్ కార్డు రాక, ఇటు బ్యాంక్ ఖాతా లేక వేలాది మంది లబ్ధిదారులు ప్రభుత్వ సబ్సిడీని కోల్పోవాల్సిన పరస్థితి ఏర్పడింది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 10 లక్షల 64 వేల 257 వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వారిలో 5 లక్షల 64 వేల 363 మందికి మాత్రమే ఆధార్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. దీంతో వారికి మాత్రమే ఈ నెల నుంచి నగదు బదిలీ పథకం వర్తిస్తుంది. జిల్లాలో 4 లక్షల 99 వేల 894 గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారులకు ఆధార్ కార్డులు అందకపోవడంతో బ్యాంకు ఖాతాలను అందించలేకపోయారు. ఆధార్ కోసం ఫొటోలు దిగినవారికి కూడా నేటికీ కార్డులు అందలేదు. ఫొటోలు దిగనివారికి గ్యాస్ సబ్సిడీ దక్కడం లేదు. జిల్లాలో 96 శాతం ఆధార్ కార్డుల ఫొటోలు తీయడం పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి 70 శాతం మందికి కూడా పూర్తిస్థాయిలో ఆధార్ కార్డులు అందలేదు. పూర్తిస్థాయి ఆధార్ అందినవారు కొందరైతే, ఫొటోలు దిగినట్లు రసీదు మాత్రమే పొందినవారు మరికొందరు. జిల్లాలో ఈ నెల ఒకటి నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి రావడంతో ప్రతి లబ్ధిదారుడు కచ్చితంగా గ్యాస్ సిలిండర్‌కు రూ.1,016 చొప్పున చెల్లించాల్సిందే. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాలను సమర్పించిన వారికి మాత్రం ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. కార్డు అందనివారికి సబ్సిడీ అందటం లేదని, మరోవైపు గ్యాస్ కనెక్షన్ రద్దయ్యే ప్రమాదముందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్‌కు రూ.171 అదనపు భారం.. మరోవైపు నగదు బదిలీ అంటునే గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌కు రూ.1,016 వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రూ.435 మాత్రమే సబ్సిడీగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేస్తోంది. దీంతో సిలిండర్ ధర రూ.581 అవుతోంది. నగదు బదిలీ పథకం అమలుకు ముందు వరకు రూ.410 ఉన్న సిలిండర్‌కు ఒక్కసారిగా రూ.171 అదనంగా వసూలు చేస్తుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలపై పడకుండా రూ.50 సబ్సిడీగా దివ ంగత మహానేత వైఎస్ ప్రభుత్వం భరించిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కిరణ్ సర్కార్ వచ్చిన తరువాత గ్యాస్ ధరలు సిలిండర్‌కు రూ.25 చొప్పున తగ్గినా మామూలుగానే వసూలు చేశారు. ఇది చాలదన్నట్టు నగదు బదిలీలో రూ.171 అదనంగా వసూలు చేయడంపై జనం మండిపడుతున్నారు. ప్రజలకు ‘సుప్రీం’ ఊరట.. నగదు బదిలీ అమలులో లోపాలు లబ్ధిదారులకు శాపాలుగా పరిణమించిన తరుణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఊరటనిచ్చింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును ముడిపెట్టడం సరికాదని, ఆధార్ లేకున్నా సబ్సిడీని అందించాలంటూ మూడురోజుల క్రితం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు జిల్లాలోని ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాలు లేనివారికి పెద్ద ఊరటనే ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం పట్టుదలకు పోకుండా అట్టడుగు స్థాయిలో ప్రజలకు సబ్సిడీలను అందించటంపై దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
16 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వంతు?
సాక్షి, మచిలీపట్నం : చారిత్రక ఘట్టంగా నిలుస్తున్న సమైక్య పోరుకు జిల్లాలో నలుగురు కీలక అధికారులు దూరంగా ఉన్నారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా వెన్నుచూపని మిగిలిన ఉద్యోగవర్గాలు పోరాటపథంలో ముందుకెళుతున్నాయి. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు జేఏసీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయగలిగారు. ఇక ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ ఢిల్లీని తాకేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల్ని కూడా సమ్మెబాట పట్టించేందుకు చర్చలు జరుపుతున్నారు. దీనికి ఈ నెల 16న ముహూర్తం పెట్టారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయవాడపాటు జిల్లాలోని సుమారు 115 శాఖలకు చెందిన 35 వేల మంది ఇప్పటికే ఆందోళన బాటలో ఉన్నారు. ఐఏఎస్ అధికారులైన కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు హరిచందన, చక్రధర్‌బాబులు మాత్రం సమ్మెకు దూరంగానే ఉన్నారు. ఐఏఎస్‌లు సమ్మెచేసే అవకాశం లేనందునే సమైక్య ఉద్యమానికి దూరంగా ఉన్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ శాఖల దిగువస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగగా.. 17న ఉపాధ్యాయులు, 24న అధికారులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలు శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి మాస్ క్యాజువల్ లీవ్ పెడుతున్నట్టు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వారు ఈ నెల 7 నుంచి మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, డీఆర్డీఏ పీడీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు ఎనిమిది రోజులుగా సమైక్య పోరు చేస్తున్నారు. ఢిల్లీకి సెగ తగిలేలా.. సమైక్య ఉద్యమం మొదలై 47 రోజులు దాటినా పాలకులకు చీమకుట్టినట్టు లేదు. అందుకే ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్చేలా జేఏసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్జీవోలు, నాన్ పొలిటికల్ జేఏసీ, స్వచ్ఛంద సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేసేలా కార్యాచరణ రూపొందించారు. పోస్టల్, ఎల్ఐసీ వంటి సంస్థల్లో ఉద్యోగులను కూడా సమ్మెబాట పట్టేలా జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కలిసివస్తే 16 నుంచి సమ్మెబాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.