సాక్షి, మచిలీపట్నం : చారిత్రక ఘట్టంగా నిలుస్తున్న సమైక్య పోరుకు జిల్లాలో నలుగురు కీలక అధికారులు దూరంగా ఉన్నారు. ఎవరెన్ని ఆంక్షలు విధించినా వెన్నుచూపని మిగిలిన ఉద్యోగవర్గాలు పోరాటపథంలో ముందుకెళుతున్నాయి. ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు జేఏసీ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా ఉన్నతాధికారులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేయగలిగారు. ఇక ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమ సెగ ఢిల్లీని తాకేలా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల్ని కూడా సమ్మెబాట పట్టించేందుకు చర్చలు జరుపుతున్నారు. దీనికి ఈ నెల 16న ముహూర్తం పెట్టారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సాగుతున్న ఉద్యమంలో ప్రభుత్వోద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విజయవాడపాటు జిల్లాలోని సుమారు 115 శాఖలకు చెందిన 35 వేల మంది ఇప్పటికే ఆందోళన బాటలో ఉన్నారు. ఐఏఎస్ అధికారులైన కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, విజయవాడ, నూజివీడు సబ్ కలెక్టర్లు హరిచందన, చక్రధర్‌బాబులు మాత్రం సమ్మెకు దూరంగానే ఉన్నారు.
ఐఏఎస్‌లు సమ్మెచేసే అవకాశం లేనందునే సమైక్య ఉద్యమానికి దూరంగా ఉన్నట్టు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి ప్రభుత్వ శాఖల దిగువస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమ్మెకు దిగగా.. 17న ఉపాధ్యాయులు, 24న అధికారులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలు శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి మాస్ క్యాజువల్ లీవ్ పెడుతున్నట్టు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. వారు ఈ నెల 7 నుంచి మాస్ క్యాజువల్ లీవ్ పెట్టి ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి, అదనపు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, డీఆర్డీఏ పీడీ, సోషల్ వెల్ఫేర్ అధికారులు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు ఎనిమిది రోజులుగా సమైక్య పోరు చేస్తున్నారు.
ఢిల్లీకి సెగ తగిలేలా..
సమైక్య ఉద్యమం మొదలై 47 రోజులు దాటినా పాలకులకు చీమకుట్టినట్టు లేదు. అందుకే ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్చేలా జేఏసీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎన్జీవోలు, నాన్ పొలిటికల్ జేఏసీ, స్వచ్ఛంద సంఘాలు పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడంపై ఉద్యమకారుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేసేలా కార్యాచరణ రూపొందించారు. పోస్టల్, ఎల్‌ఐసీ వంటి సంస్థల్లో ఉద్యోగులను కూడా సమ్మెబాట పట్టేలా జేఏసీ నేతలు చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు కలిసివస్తే 16 నుంచి సమ్మెబాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏదిఏమైనా ఉద్యోగులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.