విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. గ్రామాల్లో సైతం నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉద్యోగులతోపాటు అన్ని వర్గాలు, వ్యాపారులు ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు సోమవారం నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి.
ఇప్పటికే కొన్ని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. కొన్ని కార్పొరేట్ స్కూళ్లు మాత్రం తెరిచే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్యోగులు వాటిని కూడా మూయిస్తామని స్పష్టం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి పేరుతో అన్ని ఉద్యోగ, కార్మిక, విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ సంఘాలన్నీ జిల్లాలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు బృందాలుగా వెళ్లి తెరిచి ఉన్న వాటిని మూయించాలని నిర్ణయించాయి.
24న జిల్లా బంద్
ఉద్యమంలో భాగంగా ఈ నెల 24న జిల్లా బంద్‌కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. వ్యాపార సంస్థలన్నీ మూతపడనున్నాయి. భారీ షాపింగ్ మాల్స్ నుంచి చిన్న చిన్న దుకాణాల వరకు తెరుచుకునే అవకాశాలు లేవు. అదే రోజు ఉద్యోగులంతా జాతీయ రహదారిని దిగ్బంధించనున్నారు. జిల్లాను పూర్తిగా స్తంభింపజేయడం ద్వారా సమైక్యాంధ్ర ఉద్యమ సెగ కేంద్రానికి తాకేలా చేయాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజీనామాలు చేయడకుండా ఉద్యమానికి దూరంగా ఉంటున్న ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేయాలన్నది యోచనగా కనిపిస్తోంది. జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలకు అన్ని వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
ఆటోలు బంద్: ఇప్పటికే జిల్లాలో ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. ప్రజలందరూ ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి జిల్లా బంద్ నిర్వహిస్తుండగా దీనికి ఆటో కార్మికుల నుంచి మద్దతు లభించింది. ఈ నెల 24న జిల్లాలో ఆటో కార్మికులు కూడా బంద్ పాటించనున్నారు. కానీ ఒక యూనియన్‌కు సంబంధించిన కార్మికులు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించారు.
హోటళ్లు మూసివేత: ఏపీఎన్జీవోల ఆధ్వర్యంలో జరిగే సీమాంధ్ర బంద్‌కు సంఘీభావంగా అదే రోజు బంద్ పాటిస్తున్నట్టు విశాఖ హోటల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు టి.సత్యనారాయణ ప్రకటించారు. విశాఖ,గాజువాక, గోపాలపట్నం,మధురవాడ, పెందుర్తి ప్రాంతాలలో హోటళ్లు, పార్లర్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, అతిథి గృహాలు మూసివేస్తామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చేస్తున్న ఈ బంద్‌కు వ్యాపారులంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
మళ్లీ కేంద్ర ప్రభుత్వ సంస్థల దిగ్బంధం
ఈ నెల 25, 26 తేదీలలో మరోసారి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దిగ్బంధించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఉద్యోగ సంఘాలు కేంద్ర కార్యాలయాలను ముట్టడించి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఆఫీసులకు తాళాలు వేశారు. మళ్లీ ఈ నెల 25, 26 తేదీల్లో కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించారు. దీంతో ఈ రెండు రోజుల పాటు మరోసారి బ్యాంకులు కూడా మూతపడనున్నాయి.
ఉద్యమంఉధృతం
Published Mon, Sep 23 2013 2:54 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement