జెడ్పీలో.. రాజకీయ రగడ.. | ZP .. Political Galleries .. | Sakshi
Sakshi News home page

జెడ్పీలో.. రాజకీయ రగడ..

Published Tue, Nov 19 2013 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ZP .. Political Galleries ..

= కొత్త సీఈవోగా సుబ్బారావు నియామకం
 = జీవో జారీ చేసిన ప్రభుత్వం
 = కీలకనేత అనుచరుడి హస్తం
 = జేసీ బదిలీ నిలుపుదల, జెడ్పీ సీఈవో నియామకంపై చర్చ
 = సీనియారిటీ, ట్రి బ్యునల్ తీర్పును పట్టించుకోని వైనం

 
సాక్షి, మచిలీపట్నం : కాంగ్రెస్ పాలనలో రాజకీయ అండ, కీలక నేతల ఆశీస్సులు ఉంటే చాలు బదిలీ అయిన అధికారులు సైతం సీటు కదలక్కర్లేదు.. రాదనుకున్న పోస్టును దక్కించుకోవచ్చు.. తాజాగా జిల్లా పరిషత్ సీఈవో నియామకంలోనూ రాజకీయ నేతలదే పైచేయి అని తేటతెల్లమైంది. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి బదిలీని నిలుపుదల చేయించిన కీలక వ్యక్తి మరోమారు చక్రం తిప్పడంతో జెడ్పీ సీఈవో నియామకం తాము అనుకున్న అధికారికే దక్కింది. జెడ్పీ సీఈవోగా నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన పి.సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పంచాయతీరాజ్ అధికారులు శాఖాపరంగా తీసుకున్న చర్యలు, ట్రిబ్యునల్ తీర్పు వంటివాటిని పక్కనపెట్టి ముఖ్యనేత సిఫారసుతోనే ఈ తతంగం సాగినట్టు ప్రచారం సాగుతోంది.
 
రెండు నెలల నుంచే పైరవీలు...

 జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేసిన సీఎస్ కొండయ్యశాస్త్రి రెండు నెలల క్రితం బదిలీకావడంతో ఆ పోస్టుకు పైరవీలు ఊపందుకున్నాయి. దీంతో ఎవరికివారే సీఈవో పోస్టు కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేయగా ఇన్‌చార్జిగానైనా ఆ బాధ్యతలు చేపట్టేందుకు జిల్లాలోని ఎంపీడీవోలు సైతం ఎడతెగని ప్రయత్నాలు చేశారు. దీంతో ఎట్టకేలకు నందివాడ ఎంపీడీవోగా పనిచేసిన చింతా కళావతిని ఇన్‌చార్జి జెడ్పీ సీఈవోగా నియమిస్తూ అప్పట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మచిలీపట్నం ఎంపీడీవోగా పనిచేసిన జీవీ సూర్యనారాయణను డిప్యూటీ సీఈవో గాను, పి.అనురాధను జెడ్పీ ఏవోగాను నియమించిన సంగతి తెలిసిందే.

ఈ నియామకాలను సవాల్ చేస్తూ తామే వారికంటే సీనియర్లమంటూ రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ఏవో వి.జ్యోతిబసు, ఉయ్యూరు ఎంపీడీవో పి.కృష్ణమోహన్‌లు గత నెలలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయినా పంచాయతీరాజ్ అధికారులు మాత్రం ట్రిబ్యునల్ తీర్పును అమల్లోకి తేలేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులకు అర్హులం తామంటే తామేనని పలువురు ఉద్యోగులు పోటీ పడటంతోపాటు పంచాయతీరాజ్ కమిషనర్ స్థాయిలో పైరవీలు సాగాయి.
 
కీలకనేత పట్టుతోనే..

జెడ్పీ సీఈవో నియామకం విషయంలో తొలి నుంచి నూజివీడు ఆర్డీవోగా పనిచేసి బదిలీ అయిన సుబ్బారావు పేరు వినిపించింది. అయినా ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయంటూ సుబ్బారావుపై వ్యతిరేకత ఉన్నవారంతా నియామకాన్ని అడ్డుకునేందుకు పావులు కదిపారు. నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన కాలంలో సుబ్బారావుపై అనేక ఆరోపణలు ఉన్నతాధికారులకు చేరాయి. దీంతో ఆయన నియామకం జరగదని అంతా భావించారు. అయినా జిల్లా కీలక నేత పట్టుతో నియామకం జరిగినట్టు సమాచారం. ఆయన్ని ఏడాదిపాటు జెడ్పీ సీఈవోగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ద్వారా ఈ నెల 16న జీవో నంబర్ 1786ను జారీ చేశారు. ఈ విషయం సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో గుప్పుమనడంతో చర్చ సాగుతోంది.
 
నిబంధన మేరకే జరిగిందా?

జిల్లా పరిషత్ సీఈవోగా పంచాయతీరాజ్ శాఖకు చెందిన సీనియర్ ఉద్యోగులకే బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా ఉంది. దీనిపై ఇటీవల పంచాయతీరాజ్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు పంచాయతీరాజ్ ఉద్యోగులు చెబతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నత పోస్టుల్లో ఇతర శాఖలకు చెందినవారిని 50 శాతం వరకు నియమించుకోవచ్చన్న వెసులుబాటు ఉంది. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు 12 జిల్లాల్లో జెడ్పీ సీఈవోలుగా ఇతర శాఖల నుంచి వచ్చినవారినే నియమించారు.దీంతో ఇతర శాఖల నుంచి నియమించుకునేలా 50 శాతం వరకు ఇచ్చిన వెసులుబాటు దాటిపోయింది. అయినా రెవెన్యూశాఖకు చెందిన సుబ్బారావును నియమించుకునేలా ప్రత్యేకంగా ఆ నిబంధనను సవరించారన్న ప్రచారం ఉంది.
 
 కీలకనేత అనుచరుడి హస్తం..


 జిల్లాలో చర్చనీయాంశంగా మారిన జాయింట్ కలెక్టర్ బదిలీ నిలుపుదలలోను, జెడ్పీ సీఈవో నియామకంలోను ఒక కీలకనేత అనుచరుడి హస్తం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇటీవల ఒకేరోజున కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, జేసీ పి.ఉషాకుమారి బదిలీ జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాలో కొందరు తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తుపానును సాకుగా చూపి గన్నవరం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి సాయంతో జేసీ బదిలీని నిలుపుదల చేయించినట్టు సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పట్టుబట్టినా కీలకనేత అండతో ఆ అనుచరుడు జేసీ బదిలీని నిలుపుదల చేయించగలిగారు. తాజాగా నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన సుబ్బారావును జెడ్పీ సీఈవోగా నియమించేలా అదే అనుచరుడు చక్రం తిప్పినట్టు ప్రచారం సాగుతోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement