ముళ్ల పొదలు, మురికి కాలువలే 'ఊయల'
సందర్భం
దివంగత సీఎం వైఎస్ రాజ శేఖరరెడ్డి, అప్పటి కేంద్రమంత్రి రేణుకా చౌదరి స్త్రీశిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రవేశ పెట్టిన ఊయల పథకాన్ని పటి ష్టంగా అమలు చేయించడంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు.
ఈ ఊయల పథకం ద్వారా ప్రత్యేక పరిస్థితిలో బిడ్డను వద్దనుకునే తల్లులు తమ పేరుతో మొదలుకొని వ్యక్తిగత సమాచారం ఏదీ తెలపకుండానే ఊయలలో బిడ్డను ఉంచితే చాలు ఆ బిడ్డ బాగోగులు స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే చూసుకునేది. ఎవరు ఏ మంచి పథకాన్ని ప్రవేశపెట్టినా దాన్ని నూటికి నూరు శాతం అమలు చేసి ప్రజలకు ప్రభుత్వ పథకాల ఫలితాలను అందజేయడం రాజశేఖరరెడ్డి నైజం.
కొందరు స్త్రీలు, యువతులు అనుకోని సందర్భా లలో గర్భవతులై పుట్టిన బిడ్డను చూసే దిక్కులేక ఏమి చేయాలో పాలుపోక తాము చావడమో లేదా కన్న బిడ్డని చంపడమో మాత్రమే ముందున్న మార్గం అయినప్పుడు కొందరు హృదయాన్ని పాషాణంగా మార్చుకొని రెండవ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
పొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాపలు ఇలా ఘోరమైన మృత్యువుకు బలవడం అందరిని కలచి వేస్తుంది. దీనికి తల్లులను రాక్షసులుగా తిట్టుకుంటాం కానీ, బిడ్డ పుట్టడా నికి అంతే కారణమైన తండ్రి జోలికి ఎవరూ వెళ్లరు.
ఈ దయనీయ స్థితిని ఆపడానికి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఊయల ఉండేటట్లు అందులో పిల్లలు వద్ద నుకున్న వారి వివరాలు సైతం తెలపనవసరం లేకుండా పిల్లలని ఊయలలో వదిలి పెడితే చాలు వారిని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పెంచేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం ఇప్పుడూ ఉన్నప్పటికీ స్త్రీశిశు సంక్షేమ శాఖ నిర్లక్ష్యంతో దీనికి కావలసిన నిధులు పుష్కలంగా ఉన్నా అనేకమంది పసిబిడ్డలు హత్యలకు గురౌతున్నారు.
ఈ పసిబిడ్డలు మురికి కాలువలు, ముళ్లపొదలు, పొత్తిళ్లుగా మారి ప్రాణాలు వదలకుండా ఉండాలంటే ఈ ఊయల పథకాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మితిమీరిన అవినీతి, నిర్లక్ష్యం కారణంగా పసిబిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారంటే అతిశయోక్తి కాదు. పిల్లల సంక్షే మంపై ఎలాంటి ధ్యాస, లక్ష్యం, లేని స్త్రీ శిశు సంక్షేమ శాఖ దురదృష్టంతో స్త్రీలు సమాజంలో నేరస్తులుగా నిల బడుతున్నా, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నా ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారే తప్ప, ఊరూరా ఊయల పథ కాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు.
ఊయల పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం తోపాటు, టీవీలు, పత్రికల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు గ్రామ సర్పంచులను అంగన్వాడీ కార్యకర్తలను ఊయల ప్రచార సారథులుగా చేసుకొని గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ఈ ఊయల తెగిన తాళ్లను బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వ్యాసకర్త రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు, మొబైల్ : 93910 24242
అచ్యుతరావు