Uyyuru Municipality
-
మున్సిపోల్స్‌పై ఖాకీల డేగకన్ను..
సాక్షి, విజయవాడ: ఈనెల 10న జరుగనున్న మున్సిపల్ ఎన్నికలపై విజయవాడ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్, ఉయ్యూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీపీ బత్తిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. సీపీ నిత్య పర్యటనలతో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో మొత్తం 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నట్లు సీపీ తెలపారు. ఎన్నికల విధుల్లో 67 మొబైల్, 27 స్ట్రైకింగ్, 12 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన 1900 మందిని 110 సీఆర్పీసి కింద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుండి పోలింగ్ కేంద్రాలను అధీనంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తే ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. -
పంచాయతీలకు మించిన ఫలితాలు రాబోతున్నాయి..
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డుల్లో మహిళా అభ్యర్థులు ఏకంగా 13 వార్డుల నుంచి బరిలో నిలిచారు. ప్రచారంలో ఎమ్మెల్యే పార్థసారధి అన్నీ తానై వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ అభ్యర్ధులని ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపోల్స్‌లో ప్రచార సరళిపై ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిపాలనకు ప్రజలు బహ్మరధం పడుతున్నారన్నారు. మున్సిపోల్స్‌లో పంచాయితీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకానికి ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమం అటకెక్కిందని, దాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ఏడాదిన్నర కాలంగా అహర్నిశలా శ్రమిస్తున్నారన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రజలకు చూపించారన్నారు. ప్రజల గుండెల్లో సీఎం జగన్ చెరగని స్థానం సంపాదించుకున్నారని ఆకాశానికెత్తారు. పల్లె తీర్పుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ప్రస్తుత టీడీపీ పరిస్థితి నడి సముద్రంలో మునుగుతున్న నావ లాంటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు వేసినా తెలుగుదేశాన్ని ఒడ్డుకు చేర్చలేరని, ఆయన రిటైరెంట్ తీసుకొంటే ఉన్న కాస్త పరువైనా మిగులుతుందని సూచించారు. -
ఉత్కంఠగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
ఉయ్యూరు: ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్, వైఎస్ చైర్ పర్సన్ ఎన్నిక ఉత్కంఠగా సాగింది. టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు సంయుక్తంగా రాజకీయం నడిపి తమ వారికి పదవులు వచ్చేట్లు చేశారు. ఎట్టకేలకు ఒప్పందం ప్రకారం చైర్మన్‌గా అబ్దుల్ ఖుద్దూస్, వైస్ చైర్ పర్సన్‌గా పండ్రాజు సుధారాణిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైస్ చైర్ పర్సన్, చైర్మన్లతో జాయింట్ కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. -
రియల్‌కు గ్రీన్ బెల్ట్ దెబ్బ
ఖాళీగా అపార్ట్మెంట్లు అరకొరగా విక్రయాలు దిగిరాని ధరలు ఉయ్యూరు : గ్రీన్ బెల్ట్ ప్రభావం రియల్ వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఉయ్యూరు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి. ఎక్కడికక్కడే రియల్ వెంచర్లు ఖాళీగా దర్శనమిస్తూ పొదలను తలపిస్తున్నాయి. వెంచర్లలో సరైన వసతులు కల్పించకపోవడం.. కొన్ని వెంచర్లకు సీఆర్డీఏ అనుమతులు లేకపోవడం కూడా రియల్ ఢమాల్కు కారణం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అపార్ట్మెంట్లదీ అదే పరిస్థితి. బీడుభూములుగా వెంచర్లు పట్టణంతోపాటు మండలంలోని గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కాటూరు, గరికపర్రు రోడ్డు, యాకమూరు రోడ్లలో 100 ఎకరాలకుపైగా పొలాల్లో వ్యాపారులు వెంచర్లు వేశారు. శివారు ప్రాంతాల్లో సెంటు రూ.4 నుంచి రూ.5 లక్షలు, పట్టణంలో ప్రధాన రహదారి కిలోమీటరు లోపల సెంటు రూ.10 లక్షలకుపైగా ధరలు నిర్ణయించారు. వెంచర్లు వేసిన ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఖాళీగా 400 ప్లాట్లు..! పట్టణంలో అపార్ట్మెంట్ల సంస్కృతి విపరీతంగా పెరిగింది. తొలుత ఈ అపార్ట్మెంట్ల నిర్మాణం లాభాలను తెచ్చిపెట్టడంతో ఎక్కువ మంది ఈ నిర్మాణాలపై దృష్టి పెట్టారు. దుర్గా ఎస్టేట్స్, ఫ్లోరా రోడ్డు, శ్రీనివాస రోడ్డు, కాటూరు రోడ్డు, రాజర్షి నగర్, మూర్తిరాజుగూడెం డొంక, తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించారు. పదికిపైగా అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగస్తులు, దూర ప్రాంతాల వ్యక్తులకు ఈ అపార్ట్మెంట్లను భూతద్దంలో చూపి దళారులు ఎలాగొలా కట్టబెడుతున్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.25 నుంచి రూ.30 లక్షలు, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రూ.18 నుంచి రూ.24 లక్షలుకు రేట్లు ఫిక్స్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా కానీ 400 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.