
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే పార్థసారధి ఆధ్వర్యంలో అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 వార్డుల్లో మహిళా అభ్యర్థులు ఏకంగా 13 వార్డుల నుంచి బరిలో నిలిచారు. ప్రచారంలో ఎమ్మెల్యే పార్థసారధి అన్నీ తానై వ్యవహరిస్తూ, వైఎస్సార్సీపీ అభ్యర్ధులని ఆశీర్వదించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపోల్స్‌లో ప్రచార సరళిపై ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ప్రజలు బహ్మరధం పడుతున్నారన్నారు.
మున్సిపోల్స్‌లో పంచాయితీలకు మించిన ఫలితాలు సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం జగన్ మీద ఉన్న నమ్మకానికి ఫలితాలు ప్రతిబింబంగా నిలుస్తాయన్నారు. టీడీపీ హయాంలో ప్రజా సంక్షేమం అటకెక్కిందని, దాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ఏడాదిన్నర కాలంగా అహర్నిశలా శ్రమిస్తున్నారన్నారు. సంక్షేమం అంటే ఎలా ఉంటుందో సీఎం జగన్ ప్రజలకు చూపించారన్నారు. ప్రజల గుండెల్లో సీఎం జగన్ చెరగని స్థానం సంపాదించుకున్నారని ఆకాశానికెత్తారు. పల్లె తీర్పుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ప్రస్తుత టీడీపీ పరిస్థితి నడి సముద్రంలో మునుగుతున్న నావ లాంటిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు వేసినా తెలుగుదేశాన్ని ఒడ్డుకు చేర్చలేరని, ఆయన రిటైరెంట్ తీసుకొంటే ఉన్న కాస్త పరువైనా మిగులుతుందని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment