ఘన విజయం అనంతరం కుప్పంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆనందోత్సాహాలు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికలతో మొదలైన వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర తాజాగా జరిగిన రెండో దశ నగరపాలక(కార్పొరేషన్), పురపాలక (మున్సిపాల్టీ), నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అప్రతిహతంగా కొనసాగింది. నెల్లూరు కార్పొరేషన్‌తో సహా 12 మున్సిపాల్టీ, నగరపాలక సంస్థలకు తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు మరోసారి ఆశీర్వదించారు. సోమవారం పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఎంపీ, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల తరహాలోనే రెండో దశ నగర, పురపాలక ఎన్నికల్లోనూ ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు.
ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ నామరూపాలు లేకుండా పోయింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్‌లకుగానూ(ఒకటి ఏకగీవ్రం) అన్నిచోట్లా వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇక్కడ టీడీపీకి కనీసం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీని వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. 25 వార్డులకు కుప్పం మున్సిపాలిటీలో ఎన్నికలు జరగ్గా ఏకగ్రీవంతో కలిపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 19 వార్డుల్లో ఘన విజయం సాధించారు. టీడీపీ కేవలం ఆరు వార్డులకే పరిమితమైంది.
పెనుకొండ, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లి, గురజాల, కొండపల్లి, జగ్గయ్యపేట, ఆకివీడు పురపాలక, నగర పంచాయతీలను కూడా వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. దర్శి నగర పంచాయతీలో మాత్రమే టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ఇక్కడ 20 వార్డులు ఉండగా వైఎస్సార్‌సీపీ 7 వార్డుల్లో, టీడీపీ 13 వార్డుల్లో గెలుపొందాయి.
100 % ఒకే పార్టీకి ఇదే తొలిసారి..
తొలి విడత జరిగిన ఎన్నికల్లో 12 నగర పాలక సంస్థలనూ వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకోగా తాజాగా నెల్లూరుతో కలిపి 13 కార్పొరేషన్లలో విజయబావుటా ఎగురవేసింది. ఇక తాజా ఫలితాలతో అధికార పార్టీకి దక్కిన పురపాలక సంస్థల సంఖ్య 74 నుంచి 84కు పెరిగాయి. ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన వంద శాతం నగర పాలక సంస్థలను, 97.67 శాతం పురపాలక, నగర పంచాయతీలను ఒకే పార్టీ కైవశం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
సంక్షేమాభివృద్ధి పథకాలు.. సురిపాలనతో
2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లను సాధించి 175 శాసనసభ స్థానాలకుగానూ 151 చోట్ల, 25 లోక్‌సభ స్థానాలకుగానూ 22 చోట్ల వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను అమలు చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో ఫలాలను అందించడం ద్వారా పరిపాలనలో నూతన అధ్యాయానికి తెరతీశారు.
పరిపాలన సంస్కరణలను తెచ్చి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పరిపాలనను తీసుకెళ్లారు. రెండున్నరేళ్లలో దాదాపు 15 నెలలు రెండు విడతలుగా కరోనా మహమ్మారి విరుచుకుపడి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా సంక్షేమ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. మంత్రివర్గంతో పాటు రాజ్యసభ, శాసనమండలి సభ్యులుగా, గ్రామ పంచాయతీ, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల ఛైర్మన్లు/ఛైర్‌పర్సన్లుగా 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే అవకాశమిచ్చి సామాజిక న్యాయానికి సిసలైన నిర్వచనం చూపారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని శక్తిగా..
అవినీతికి అడ్డుకట్ట వేసి పారదర్శకమైన పరిపాలన అందిస్తుండటంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. రాష్ట్రంలో 13,092 గ్రామ పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల్లో 10,536 (80.47 శాతం) పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారు. పరిషత్ ఎన్నికల్లో 9,583 ఎంపీటీసీ స్థానాలకు 8249 స్థానాల్లో (86 శాతం) విజయం చేకూర్చారు. 638 జడ్పీటీసీ స్థానాలకుగానూ 630 స్థానాల్లో (98 శాతం) అధికార పార్టీ అభ్యర్థులనే ప్రజలు ఆశీర్వదించారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్ణణ, నగర ప్రాంతాల్లోనూ వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా ప్రజలు తీర్చిదిద్దారని స్పష్టమవుతోంది.
సాగనంపిన కుప్పం..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరువు కాపాడుకునేందుకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. వార్డుకో ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ/మాజీ ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జిగా నియమించారు. మాజీ మంత్రులు, . బయట ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి ప్రచారం చేసినా ప్రజలు ఆయన్ను తిరస్కరించారు. తన కుమారుడు లోకేష్‌ను కుప్పం పంపి దౌర్జన్యాలకు దిగేలా శ్రేణులను ప్రేరేపించి భయోత్పాతం సృష్టించారు. డబ్బులు వెదజల్లారు. ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించారు. చివరకు తనదైన రీతిలో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారు. ఆయన ఎన్ని చేసినా కుప్పం మున్సిపాల్టీ ప్రజలు ‘ఓటే’ అస్త్రంగా తిరుగులేని తీర్పు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
261 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపు
నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 328 డివిజన్‌లు, వార్డులకు, 19 కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న 25 డివిజన్‌లు, వార్డులకు కలిపి మొత్తం 353 డివిజన్‌లు, వార్డు స్థానాల ఎన్నికలకు ఎస్‌ఈసీ నోటిఫికెషన్ విడుదల చేసింది. మొత్తం 1206 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఏకగ్రీవాలతో కలుపుకుని వైఎస్సార్‌సీపీ 261, టీడీపీ 82, జనసేన 5, స్వతంత్ర అభ్యర్థులు ఐదు చోట్ల గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment