ఖాళీగా అపార్ట్‌మెంట్‌లు
అరకొరగా విక్రయాలు దిగిరాని ధరలు
ఉయ్యూరు : గ్రీన్ బెల్ట్ ప్రభావం రియల్ వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఉయ్యూరు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి. ఎక్కడికక్కడే రియల్ వెంచర్లు ఖాళీగా దర్శనమిస్తూ పొదలను తలపిస్తున్నాయి. వెంచర్లలో సరైన వసతులు కల్పించకపోవడం.. కొన్ని వెంచర్లకు సీఆర్‌డీఏ అనుమతులు లేకపోవడం కూడా రియల్ ఢమాల్‌కు కారణం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అపార్ట్‌మెంట్లదీ అదే పరిస్థితి.
బీడుభూములుగా వెంచర్లు
పట్టణంతోపాటు మండలంలోని గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కాటూరు, గరికపర్రు రోడ్డు, యాకమూరు రోడ్లలో 100 ఎకరాలకుపైగా పొలాల్లో వ్యాపారులు వెంచర్లు వేశారు. శివారు ప్రాంతాల్లో సెంటు రూ.4 నుంచి రూ.5 లక్షలు, పట్టణంలో ప్రధాన రహదారి కిలోమీటరు లోపల సెంటు రూ.10 లక్షలకుపైగా ధరలు నిర్ణయించారు. వెంచర్లు వేసిన ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది.
ఖాళీగా 400 ప్లాట్లు..!
పట్టణంలో అపార్ట్‌మెంట్ల సంస్కృతి విపరీతంగా పెరిగింది. తొలుత ఈ అపార్ట్‌మెంట్ల నిర్మాణం లాభాలను తెచ్చిపెట్టడంతో ఎక్కువ మంది ఈ నిర్మాణాలపై దృష్టి పెట్టారు. దుర్గా ఎస్టేట్స్, ఫ్లోరా రోడ్డు, శ్రీనివాస రోడ్డు, కాటూరు రోడ్డు, రాజర్షి నగర్, మూర్తిరాజుగూడెం డొంక, తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించారు. పదికిపైగా అపార్ట్‌మెంట్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగస్తులు, దూర ప్రాంతాల వ్యక్తులకు ఈ అపార్ట్‌మెంట్లను భూతద్దంలో చూపి దళారులు ఎలాగొలా కట్టబెడుతున్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.25 నుంచి రూ.30 లక్షలు, డబల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు రూ.18 నుంచి రూ.24 లక్షలుకు రేట్లు ఫిక్స్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా కానీ 400 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.