V. satya narayana
-
స్మిమ్మింగ్ఫూల్లపై పోలీసుల కార్డన్‌సెర్చ్
యాకుత్‌పురా: దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి పాతబస్తీలోని స్విమ్మింగ్ పూల్లపై కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ పర్యవేక్షణలో చార్మినార్, మీర్‌చౌక్, ఫలక్ నుమా, సంతోష్‌నగర్ డివిజన్లలో సెర్చ్ నిర్వహించారు. గత నెల 23వ తేదీన మదీనానగర్‌లోని వైఎస్పీ స్విమ్మింగ్ ఫూల్లో ఈతకు వెళ్లిన రిజ్వాన్ అనే యువకుడు మృతి చెందాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు స్విమ్మింగ్ ఫూల్లపై కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు రెయిన్‌బజార్ పీఎస్ పరిధి నుంచి ప్రారంభమైన ఈ సెర్చ్ రాత్రి వరకు కొనసాగింది. రెయిన్‌బజార్ పీఎస్ పరిధిలోని రెండుతో పాటు మొఘల్‌పురా, సలాల, బహదూర్‌పురా, ఖిల్వత్‌లోని మొత్తం 12 స్విమ్మింగ్ పూల్లలో సెర్చ్ నిర్వహించారు. ఐదు స్విమ్మింగ్ పూల్లలో సీసీ కెమెరాలు, కలుషిత నీరు, లైఫ్ జాకెట్లు లేవు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఐదు స్విమ్మింగ్ పూల్‌లను పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న స్విమ్మింగ్ ఫూల్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. -
వాళ్లు లాక్కెళ్లింది బంగారు గొలుసు కాదట!
చాంద్రాయణగుట్ట: చైన్ స్నాచింగ్ జరిగిన 24 గంటల్లోనే దక్షిణ మండలం పోలీసులు సీసీ టీవీ కెమెరాల సాయంతో నిందితులను కటకటాల్లోకి పంపారు. కాగా నిందితులు లాక్కెళ్లింది రోల్డ్ గోల్డ్ అని తేలింది. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. డబీర్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోదేఅలీషా కిడికీ ప్రాంతంలో ఈ నెల 7వ తేదీన ఒంటరిగా నడిచి వెళుతున్న కొప్పెర్ల రాణి (26) మెడలోని మంగళ సూత్రాన్ని బైక్‌పై వచ్చిన యువకులు తెంచుకు పోయారు. దీనిపై డబీర్‌పురా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, స్థానికంగా ఉన్న మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో నిందితులు పారిపోతున్నట్లు వీడియో ఫుటేజి లభించింది. దీని ఆధారంగా నిందితులను పహాడీషరీఫ్ షాయిన్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ తల్హా అలియాస్ అహ్మద్ (23), తలాబ్‌కట్టా అమన్‌నగర్ బి ప్రాంతానికి చెందిన ఉమర్ బిన్ ఆబేద్ అలియాస్ ఉమర్ ఖాన్(21)గా గుర్తించారు. ఇటీవలే సౌదీ నుంచి వచ్చిన వీరు తాగుడు డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేశారు. అయితే, ఆ చైన్ బంగారంది కాదని తెలుసుకున్న నిందితులు కంగు తిన్నారు. నిందితుల నుంచి లాక్కెళ్లిన గొలుసుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
మహిళా చైన్ స్నాచర్లకు కౌన్సెలింగ్
యాకుత్‌పురా(హైదరాబాద్): పోలీసులు చేపట్టిన నేరస్తుల సమగ్ర సర్వేలో గురువారం భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న తల్లీకూతుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ నిర్వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ హెచ్చరించారు. వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా ఆమన్‌నగర్-బి ప్రాంతానికి చెందిన కైరున్నీసా (45)కు ఫౌజియా (19), మరో బాలిక (13)లు కూతుళ్లున్నారు. కైరున్నీసా గత కొన్ని నెలలుగా కూతుళ్లతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో పిక్ ప్యాకెటింగ్, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. సుల్తాన్‌బజార్‌లో రెండు, అఫ్జల్‌గంజ్‌లో రెండు, చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదై ఉన్నాయి. నేరస్తుల సర్వేలో అదుపులోకి తీసుకున్న వీరిని విచారించి వదిలేశారు. -
ఆర్థిక ఇబ్బందులూ.. మానసిక వేదనే
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు కారణాలివి! సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు మానసికంగా తీవ్ర వేదనతోనే సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ మంగళవారం రాత్రి 9 నుంచి మూడు గంటల ఉదయ్‌కిరణ్ భార్య విషిత, కుటుంబీకులు, స్నేహితుల్ని వివిధ కోణాల్లో విచారించారు. బుధవారం కూడా కుటుంబీకులతో పాటు మరికొందరిని ప్రశ్నించారు. ఉదయ్‌కిరణ్ మాజీ మేనేజర్, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ చిత్ర నిర్మాత మున్నాతో పాటు ఆ చిత్రం కోసం రూ. 17 లక్షలు ఉదయ్‌కిరణ్ ద్వారా మున్నాకు అప్పుగా ఇచ్చిన మహిళనూ గురువారం ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్యాప్తులో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి... దీర్ఘ కాలంగా సరైన అవకాశాల్లేక పోవడంతో ‘ఒక్క చాన్స్’ కోసం చాలామంది నిర్మాతలు, దర్శకుల్ని ఉదయ్ కలిశారు. వారు సరైన విధంగా స్పందించకపోవడం ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఉదయ్‌కిరణ్ తన ముందు మరో నటుడి నటనను ప్రశంసించినా తట్టుకోలేని స్థితికి చేరుకున్నాడట. కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడం పైనే దృష్టి పెట్టిన ఆయన పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఇటీవల చెన్నై వెళ్లి తమిళ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొంతమంది అతనెవ్వరో తెలియనట్లు ప్రవర్తించడం ఉదయ్‌ను మరింత కుంగదీసింది. మరోవైపు దాదాపు 4 నెలలుగా స్నేహితులు, సన్నిహితులు కలవకపోవడం, కనీసం ఫోన్లోనూ పలుకరించకపోవడం, కొంతమంది నిర్మాతలకు ఫోన్‌చేసినా వారి నుంచి స్పందన లేకపోవడం వంటి కారణాలు ఉదయ్‌ను మానసికంగా మరింతగా దెబ్బతీశాయి. ఇంటి అద్దె ఆర్నెల్లుగా బకాయి పడ్డారట. దీంతో ‘నీ సంపాదనపై బతకాల్సి వస్తోంది’ అంటూ భార్య విషిత వద్ద తరచూ బాధ పడేవాడట. ఆర్థిక కారణాలు కావు: మున్నా ఉదయ్‌కిరణ్ మాజీ మేనేజర్ మున్నా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘ఉదయ్‌కిరణ్ ఎవరో అనుమానించారనో, అవమానించారనో, అప్పులు చెల్లించలేకో, సినిమాల్లో అవకాశాలు రాలేదనో ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు. ఆయనకు ఉన్న భూముల్లో ఏ స్థలం అమ్మినా అప్పులు తీరిపోతాయి. ఆయన ఆత్మహత్య వెనుక ఫైనాన్సియర్ల ఒత్తిడి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సినిమా అవకాశాలు వచ్చినా కథ నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదు. చచ్చిపోయేంత బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్‌తో ఆయనకు సంబంధం లేదు’’ అని వివరించారు.