ఆర్థిక ఇబ్బందులూ.. మానసిక వేదనే
ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు కారణాలివి!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో పాటు మానసికంగా తీవ్ర వేదనతోనే సినీ నటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్ పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ మంగళవారం రాత్రి 9 నుంచి మూడు గంటల ఉదయ్‌కిరణ్ భార్య విషిత, కుటుంబీకులు, స్నేహితుల్ని వివిధ కోణాల్లో విచారించారు. బుధవారం కూడా కుటుంబీకులతో పాటు మరికొందరిని ప్రశ్నించారు. ఉదయ్‌కిరణ్ మాజీ మేనేజర్, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ చిత్ర నిర్మాత మున్నాతో పాటు ఆ చిత్రం కోసం రూ. 17 లక్షలు ఉదయ్‌కిరణ్ ద్వారా మున్నాకు అప్పుగా ఇచ్చిన మహిళనూ గురువారం ప్రశ్నించాలని పోలీసులు యోచిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం దర్యాప్తులో తేలిన విషయాలు ఇలా ఉన్నాయి... దీర్ఘ కాలంగా సరైన అవకాశాల్లేక పోవడంతో ‘ఒక్క చాన్స్’ కోసం చాలామంది నిర్మాతలు, దర్శకుల్ని ఉదయ్ కలిశారు.
వారు సరైన విధంగా స్పందించకపోవడం ఆయనను తీవ్రంగా కలచివేశాయి. ఈ నేపథ్యంలో ఉదయ్‌కిరణ్ తన ముందు మరో నటుడి నటనను ప్రశంసించినా తట్టుకోలేని స్థితికి చేరుకున్నాడట. కెరీర్‌ను అభివృద్ధి చేసుకోవడం పైనే దృష్టి పెట్టిన ఆయన పిల్లలు కూడా వద్దనుకున్నాడు. ఇటీవల చెన్నై వెళ్లి తమిళ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొంతమంది అతనెవ్వరో తెలియనట్లు ప్రవర్తించడం ఉదయ్‌ను మరింత కుంగదీసింది. మరోవైపు దాదాపు 4 నెలలుగా స్నేహితులు, సన్నిహితులు కలవకపోవడం, కనీసం ఫోన్‌లోనూ పలుకరించకపోవడం, కొంతమంది నిర్మాతలకు ఫోన్‌చేసినా వారి నుంచి స్పందన లేకపోవడం వంటి కారణాలు ఉదయ్‌ను మానసికంగా మరింతగా దెబ్బతీశాయి. ఇంటి అద్దె ఆర్నెల్లుగా బకాయి పడ్డారట. దీంతో ‘నీ సంపాదనపై బతకాల్సి వస్తోంది’ అంటూ భార్య విషిత వద్ద తరచూ బాధ పడేవాడట.
ఆర్థిక కారణాలు కావు: మున్నా
ఉదయ్‌కిరణ్ మాజీ మేనేజర్ మున్నా బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ, ‘‘ఉదయ్‌కిరణ్ ఎవరో అనుమానించారనో, అవమానించారనో, అప్పులు చెల్లించలేకో, సినిమాల్లో అవకాశాలు రాలేదనో ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదు. ఆయనకు ఉన్న భూముల్లో ఏ స్థలం అమ్మినా అప్పులు తీరిపోతాయి. ఆయన ఆత్మహత్య వెనుక ఫైనాన్సియర్ల ఒత్తిడి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఆయనకు సినిమా అవకాశాలు వచ్చినా కథ నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదు. చచ్చిపోయేంత బాధ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సినిమా కోసం తీసుకున్న ఫైనాన్స్‌తో ఆయనకు సంబంధం లేదు’’ అని వివరించారు.