Value Fund
-
దీర్ఘకాలంలో పెట్టుబడులకు విలువ.. ఈ ఫండ్ గురించి తెలుసా?
టాటా ఈక్విటీ పీఈ ఫండ్ చాలా స్టాక్స్ ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుతున్నాయి. మరి ఈ సమయంలో ధైర్యం చేసి అధిక విలువల వద్ద షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన ఈ పనిని మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు చేసి పెడతారు. విడతల వారీగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు అంత సులభ సాధ్యం కాదు. కానీ ఫండ్స్ మేనేజర్లకు ఇది వృత్తిలో భాగం. స్టాక్స్ విలువలు ఖరీదుగా ఉన్న ఈ తరుణంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ధైర్యంగా ఎంచుకోతగిన ఒక విభాగం ఉంది. అదే వ్యాల్యూ ఫండ్స్. స్టాక్స్‌లో ఎంతో విలువ దాగుండి, ధరలో అది పూర్తిగా ప్రతిఫలించలేని తరుణంలో ఆయా స్టాక్స్‌లో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. టాటా ఈక్విటీ పీఈ ఫండ్ కూడా ఈ కోవలోనిదే. రాబడులు.. ఈ పథకం గడిచిన ఆరు నెలల్లోనూ, ఏడాది కాలంలో 18 శాతానికిపైనే రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి 22 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో పెట్టుబడులపై ఏటా 11 శాతం ప్రతిఫలాన్ని అందించింది. అన్ని కాలాల్లోకి ఒక్క ఐదేళ్ల కాల రాబడులే కాస్త వెనుక ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో 13 శాతం, పదేళ్లలో 19 శాతానికి పైనే వార్షిక రిటర్నులు ఈ పథకంలో ఉన్నాయి. ఎస్అండ్పీ బీఎస్ఈ 100టీఆర్ఐ సూచీ ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిశీలించొచ్చు. సూచీతో పోలిస్తే పదేళ్ల కాలంలో ఈ పథకమే ఏటా 4 శాతం చొప్పున పెట్టుబడులపై అధిక రాబడులు అందించింది. 2004లో ఈ పథకం మొదుల కాగా, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టింది. దీర్ఘకాలం కోసం, తక్కువ రిస్క్, మోస్తరు రాబడులు కావాలని కోరుకునే వారు టాటా ఈక్విటీ వంటి వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చన్నది నిపుణుల సూచన. పోర్ట్‌ఫోలియో.. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,019 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.51 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులను పరిశీలించగా, 70 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 25.61 శాతం కేటాయించగా, 4.35 శాతాన్ని చిన్న కంపెనీలకు కేటాయించింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో 32 శాతం మేర ఈ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా 11 శాతానికి పైన పెట్టుబడులను మెటీరియల్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 10 శాతం వరకు, ఆటోమొబైల్ కంపెనీలకు 8.58 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం వరకు కేటాయింపులు చేసింది. పెట్టుబడుల విభాగం.. వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ మంచి పనితీరును కలిగి ఉంది. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 70 శాతాన్ని.. సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ రోలింగ్ పీఈ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. అన్ని విభాగాల్లోనూ (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) చౌకగా లభించే విలువైన స్టాక్స్ కోసం ఈ పథకం ఎప్పటికప్పుడు అన్వేషిస్తుంటుంది. దీంతో పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే, వ్యాల్యూ ఫండ్స్‌లోని స్టాక్స్ వేగంగా పరుగులు పెట్టేది తక్కువ. తగిన సమయం వరకు వేచి ఉంటేనే మంచి ఫలితాలు అందుకోవడానికి వీలుంటుంది. అందుకే కనీసం ఐదేళ్లు, అంతకుమించిన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ తరహా పథకాలను ఎంచుకోవడం అనుకూలంగా ఉంటుంది. చౌక వ్యాల్యూషన్ల వద్ద గుర్తించి పెట్టుబడులు పెట్టడమే కాదు.. ఆయా స్టాక్స్ విలువలు తిరిగి ఖరీదుగా మారాయని భావించిన తరుణంలో వాటిల్లో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకంలో గమనించొచ్చు. -
కెనరా రోబెకో వేల్యూ ఫండ్
కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా వేల్యూ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఉండాల్సిన విలువ కన్నా తక్కువ ధరకు ట్రేడవుతున్న నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. సముచిత స్థాయిలో పెట్టుబడులకు భద్రత కలిపిస్తూ, రిస్కు భారం తక్కువగా ఉండే స్టాక్స్‌కు ప్రాధాన్యం లభిస్తుందని సేల్స్, మార్కెటింగ్ హెడ్ మోహిత్ భాటియా తెలిపారు. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఈక్విటీలకు అధిక కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. కెనరా రోబెకో వేల్యూ ఫండ్ ఎన్ఎఫ్వో ఆగస్టు 27న ముగుస్తుంది. తిరిగి క్రయ, విక్రయాలకు సెప్టెంబర్ 6న అందు బాటులోకి వస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. -
వ్యాల్యూ కోరుకునే వారి కోసం
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను చేకూర్చేందుకు ఈ పథకం ప్రయత్నిస్తుంటుంది. ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. 2008 మార్చిలో ప్రారంభమైన ఈ పథకం... అన్ని సమయాల్లోనూ రాబడుల పరంగా మెరుగ్గానే ఉంది. లార్జ్ క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ వంటి వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో కూడిన స్టాక్స్ దీని పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. మార్కెట్ విలువతో సంబంధం లేకుండా వ్యాల్యూ ఉండి... కాస్త ఆర్షణీయంగా లభించే షేర్లను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకుంటుంది. గడిచిన పదేళ్లలో సగటున వార్షికంగా 20 శాతం చొప్పున రాబడులిచ్చిన పథకం ఇది. మిడ్‌క్యాప్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఐడీఎఫ్సీ ప్రీమియర్ ఈక్విటీ, హెచ్డీఎఫ్సీ మిడ్‌క్యాప్ ఆపర్చునిటీస్, యూటీఐ మిడ్‌క్యాప్ పథకాల కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. అలాగే, వ్యాల్యూ ఫండ్స్ విభాగంలోని ఎల్ అండ్ టీ ఇండియా వ్యాల్యూ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ పథకాల కంటే కూడా 2– 7 శాతం మేర అధికంగా రిటర్నులివ్వటం గమనార్హం. వ్యాల్యుయేషన్ ఫోకస్... మిడ్‌క్యాప్ విభాగంలో విలువల పరంగా ఆకర్షణీయంగా ఉన్న స్టాక్స్‌కు 40– 60 శాతం నిధుల్ని కేటాయించింది. లార్జ్ క్యాప్‌లో వ్యాల్యూ స్టాక్స్‌కు 20–30 శాతం పెట్టుబడులను కేటాయించింది. కెమికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఫైనాన్స్ స్టాక్స్ ఎక్కువగా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్ పట్ల కూడా సానుకూలంగానే ఉంది. కెమిక్సల్ విభాగంలోని స్టాక్స్‌లో క్రమానుగతంగా ఎక్స్పోజర్ పెంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో బ్యాంకు స్టాక్స్‌కు ప్రాధాన్యం తక్కువగానే ఇచ్చింది. అలాగే, మెరుగైన రాబడులను ఒడిసి పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు పోర్ట్‌ఫోలియోలో మార్పులు కూడా చేస్తుంటుంది. బ్యాంకింగ్ స్టాక్స్‌ను పెద్దగా కొనుగోలు చేయకపోవడం వల్లే గతేడాది కాలంలో ఆ స్టాక్స్ పతనం అయినప్పటికీ పథకం రాబడులపై ప్రభావం పడలేదు. పెట్టుబడుల విధానం మొమెంటమ్ స్టాక్స్ వెంట పరుగులు తీసే విధానానికి దూరంగా ఉంటుంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరీటీల్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని అనుసరిస్తుంది. మార్కెట్లు పట్టించుకోని, వాస్తవ విలువ కంటే తక్కువకు లభించే స్టాక్స్‌పై ఫోకస్ పెడుతుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో 40 నుంచి గరిష్టంగా 65 స్టాక్స్ వరకు ఉంటాయి. అస్థిరతలు పెరిగితే డెట్ విభాగంలో 7–8 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. 7–10 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగే వారికి ఈ పథకం అనువుగా ఉంటుం ది. ఇటీవల సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మార్పులకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా బిర్లా సన్‌లైఫ్ ప్యూర్ వ్యాల్యూ ఫండ్ పేరుతోపాటు పెట్టుబడుల స్ట్రాటజీ కూడా మారలేదు. -
ఐసీఐసీఐ వేల్యూ సిరీస్-7
ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ సంస్థ వేల్యూ ఫండ్‌లో ఏడో సిరీస్‌ను ప్రవేశపెట్టింది. మే 19న ప్రారంభమయ్యే న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 2తో ముగుస్తుంది. ఇది 1,100 రోజుల క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ పథకం. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ. 5,000గా నిర్ణయించింది.