టాటా ఈక్విటీ పీఈ ఫండ్
చాలా స్టాక్స్ ధరలు జీవిత కాల గరిష్టాలకు చేరుతున్నాయి. మరి ఈ సమయంలో ధైర్యం చేసి అధిక విలువల వద్ద షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం సరిపోకపోవచ్చు. సాధారణ ఇన్వెస్టర్లకు కష్టమైన ఈ పనిని మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు చేసి పెడతారు. విడతల వారీగా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం అన్నది రిటైల్ ఇన్వెస్టర్లకు అంత సులభ సాధ్యం కాదు. కానీ ఫండ్స్ మేనేజర్లకు ఇది వృత్తిలో భాగం.
స్టాక్స్ విలువలు ఖరీదుగా ఉన్న ఈ తరుణంలో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ధైర్యంగా ఎంచుకోతగిన ఒక విభాగం ఉంది. అదే వ్యాల్యూ ఫండ్స్. స్టాక్స్‌లో ఎంతో విలువ దాగుండి, ధరలో అది పూర్తిగా ప్రతిఫలించలేని తరుణంలో ఆయా స్టాక్స్‌లో ఈ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. టాటా ఈక్విటీ పీఈ ఫండ్ కూడా ఈ కోవలోనిదే.
రాబడులు..
ఈ పథకం గడిచిన ఆరు నెలల్లోనూ, ఏడాది కాలంలో 18 శాతానికిపైనే రాబడులను ఇచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా ఇచ్చిన రాబడి 22 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో పెట్టుబడులపై ఏటా 11 శాతం ప్రతిఫలాన్ని అందించింది. అన్ని కాలాల్లోకి ఒక్క ఐదేళ్ల కాల రాబడులే కాస్త వెనుక ఉన్నాయి. ఏడేళ్ల కాలంలో 13 శాతం, పదేళ్లలో 19 శాతానికి పైనే వార్షిక రిటర్నులు ఈ పథకంలో ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 100టీఆర్‌ఐ సూచీ ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా పరిశీలించొచ్చు.
సూచీతో పోలిస్తే పదేళ్ల కాలంలో ఈ పథకమే ఏటా 4 శాతం చొప్పున పెట్టుబడులపై అధిక రాబడులు అందించింది. 2004లో ఈ పథకం మొదుల కాగా, అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఏటా 18 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడి తెచ్చి పెట్టింది. దీర్ఘకాలం కోసం, తక్కువ రిస్క్, మోస్తరు రాబడులు కావాలని కోరుకునే వారు టాటా ఈక్విటీ వంటి వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించొచ్చన్నది నిపుణుల సూచన.
పోర్ట్‌ఫోలియో..
ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.6,019 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 95.51 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లో పెట్టుబడులను పరిశీలించగా, 70 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 25.61 శాతం కేటాయించగా, 4.35 శాతాన్ని చిన్న కంపెనీలకు కేటాయించింది.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో 32 శాతం మేర ఈ కంపెనీల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా 11 శాతానికి పైన పెట్టుబడులను మెటీరియల్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ స్టాపుల్స్ కంపెనీలకు 10 శాతం వరకు, ఆటోమొబైల్ కంపెనీలకు 8.58 శాతం, ఇంధన రంగ కంపెనీలకు 6 శాతం వరకు కేటాయింపులు చేసింది.
పెట్టుబడుల విభాగం..
వ్యాల్యూ ఫండ్స్ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ మంచి పనితీరును కలిగి ఉంది. ఈ పథకం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 70 శాతాన్ని.. సెన్సెక్స్‌తో పోలిస్తే తక్కువ రోలింగ్ పీఈ ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. అన్ని విభాగాల్లోనూ (స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్) చౌకగా లభించే విలువైన స్టాక్స్ కోసం ఈ పథకం ఎప్పటికప్పుడు అన్వేషిస్తుంటుంది.
దీంతో పెట్టుబడుల విషయంలో ఈ పథకానికి స్వేచ్ఛ ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే, వ్యాల్యూ ఫండ్స్‌లోని స్టాక్స్ వేగంగా పరుగులు పెట్టేది తక్కువ. తగిన సమయం వరకు వేచి ఉంటేనే మంచి ఫలితాలు అందుకోవడానికి వీలుంటుంది. అందుకే కనీసం ఐదేళ్లు, అంతకుమించిన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ తరహా పథకాలను ఎంచుకోవడం అనుకూలంగా ఉంటుంది. చౌక వ్యాల్యూషన్ల వద్ద గుర్తించి పెట్టుబడులు పెట్టడమే కాదు.. ఆయా స్టాక్స్ విలువలు తిరిగి ఖరీదుగా మారాయని భావించిన తరుణంలో వాటిల్లో పెట్టుబడులను తగ్గించుకోవడం ఈ పథకంలో గమనించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment