వన్నె తగ్గని వర్జిన్ యజమాని!
సినిమా రంగంలో ప్రముఖుడిగా వెలుగుతూ, వ్యాపారవేత్తగా కోట్ల రూపాయల వ్యవహారాలను చక్కదిద్దుతూ... ఖాళీ సమయంలో థ్రిల్లిచ్చే గేమ్స్‌ను ఆడుతూ గడిపేయడం...
ఇది ఏ రంగుల కల లాంటి జీవితం గురించో వర్ణన కాదు. రిచర్డ్ బ్రాసన్ వ్యక్తిగత జీవనశైలి గురించి వర్ణన. చాలా మందికి కల లాంటి జీవితాన్ని గడుపుతున్నాడాయన. హాలీవుడ్లో సినిమా స్టార్‌గా, వర్జిన్ మొబైల్ యజమానిగా, సముద్రాలపై సాహసక్రీడలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.
స్కూల్లో బ్రాసన్ తీరును గమనించి ఒక మాస్టారు... ‘‘రేయ్ నువ్వు అయితే కోటీశ్వరుడివి అవుతావు. లేకుంటే జైల్లో పడి, అక్కడే జీవితాన్ని ముగిస్తావు...’’ అనే వారట. మరి మాస్టారి మాటలపై గురి కుదిరిందో ఏమో కానీ కుర్ర బ్రాసన్ వెంటనే స్కూల్ మానేశాడు. చదువు మానేసి జీవితంలో సెటిలయ్యే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు.
అప్పటికి అతడికి 16 యేళ్లు, ఒక సాదాసీదా కుర్రాడు. కనీసం చదువు కూడా లేదు. అయితే ఏదో ఒకటి సాధించాలన్న తపన మాత్రం ఉంది. అదే అతడి చేత ఎన్నో ప్రయోగాలను చేయించింది. గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది. తీరా ఒకస్థాయికి చేరాక ఆ వెల్లువలో కొట్టుకుపోలేదు. సక్సెస్ కేవలం వ్యాపారంతోనూ, డబ్బుతోనూ ముడిపడి లేదని తనకు ఇష్టమైన రంగాలవైపు దృష్టిసారించి కొత్త మజాలను ఆస్వాదిస్తున్నాడు!
స్కూలు చదువుకు సగంలోనే స్వస్తి చెప్పి ఖాళీగా ఉన్న సమయంలో కొంత పెట్టుబడితో ‘స్టూడెంట్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించాడు బ్రాసన్. యువత లైఫ్‌స్టైల్‌కు గైడ్‌గా బ్రాసన్ తీర్చిదిద్దిన ఆ పత్రిక సూపర్‌సక్సెస్ అయ్యింది. బ్రాసన్ దశ తిరిగింది. 1970ల నాటికి బ్రిటన్‌లో వీడియో రికార్డ్‌లకు మంచి మార్కెట్ ఉండేది. బ్రాసన్ దృష్టివాటి మీద పడింది. అప్పటికే నాలుగేళ్లుగా పత్రికను వెలువరిస్తున్న ఈయన వీడియో రికార్డ్ డిస్క్ వ్యాపారంలోకి దిగాడు. లండన్‌లో ‘వర్జిన్ రికార్డ్స్’ పేరిట స్టోర్స్‌ను నెలకొల్పాడు. ఆ విధంగా ‘వర్జిన్’గ్రూప్‌కు పునాది పడింది.
షాప్‌కు ‘వర్జిన్’ అని పేరు పెట్టడంలోనే బ్రాసన్ చమత్కారమంతా దాగి ఉంది. తన కంపెనీలు, ఐడియాలు ఎన్నటికీ వన్నెతగ్గనివని బ్రాసన్ విశ్వాసం. అందుకే ఆయన కంపెనీకి ఆ పేరు పెట్టుకొన్నాడు. 1999లో వర్జిన్ మొబైల్ కంపెనీని స్థాపించాడు. ప్రస్తుతం ఇండియాతో సహా చాలా దేశాల్లో ఈ నెట్వ ర్క్ అందుబాటులో ఉంది. వర్జిన్ మొబైల్ అధిపతిగా 300 కోట్ల పౌండ్లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపారాల్లో ఒక ప్రముఖుడిగా నిలిచాడు బ్రాసన్.
సినిమాలు, సాహసక్రీడలు!
వ్యాపారవేత్తగా పనిలో మునిగితేలుతుండటం నుంచి వచ్చిన ఒక రకమైన విరక్తి బ్రాసన్ను సినిమాల వైపు మళ్లించింది. ‘ఫ్రెండ్స్’, ‘బే వాచ్’, ‘ది డే టుడే’వంటి టెలివిజన్ షోలలో బ్రాసన్ నటించాడు. ‘అరౌండ్ వరల్డ్ ఇన్ 80 డేస్’, ‘సూపర్‌మ్యాన్ రిటర్న్స్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా చేశాడు. వ్యాపారం, ఖాళీ సమయాల్లో నటన.. ఇవి మాత్రమేగాక సాహసపూర్వకమైన ఆటల్లో కూడా బ్రాసన్ పేరు పొందాడు. వర్జిన్ మొబైల్స్ తరపునే ‘అట్లాంటిక్ క్రాసింగ్ ఛాలెంజర్’ జరుగుతుంది. ఈ పోటీల్లో బ్రాసన్ కూడా పాల్గొని విజేతగా నిలిచాడు, బెలూన్ ఫ్లైట్‌తో అట్లాంటిక్ మహాసముద్రం దాటాడు. ప్రస్తుతం బ్రాసన్ ఉన్న స్థాయిని బట్టి మాస్టారి అంచనాలు ఒకరకంగా నిజం అయ్యాయని చెప్పవచ్చు!