గంటాపై ముప్పేట దాడి
అటు కాంగ్రెస్ చెన్నా దాసు, ఇటు టీడీపీ రెబెల్ అనిత
మరో పక్క ఇండిపెండెంట్ డాక్టర్ శ్రీనివాస్..
మాజీమంత్రికి తప్పని ఓట్ల చీలిక
వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్‌కు అనుకూల పవనాలు
పాపం..గంటా సారుకు భీమిలిలో తల బొప్పికట్టక తప్పేలా లేదు. గత్యంతరం లేక ఇక్కడ అసెంబ్లీ బరిలో నిల్చున్న మాజీ అమాత్యులపని కుడితిలో పడ్డ ఎలుకలా అయింది. కాంగ్రెస్ అభ్యర్థి చెన్నాదాసు, టీడీపీ రెబెల్ అనిత, స్వతంత్ర అభ్యర్థిడాక్టర్ శ్రీనివాస్.. ఈ త్రయం భారీగా ఓట్లను చీలుస్తుండటంతో శ్రీనివాసునికి చుక్కెదురు తప్పదన్నది దేశం శ్రేణుల భావన. మొత్తం మీద ఫ్యానుగాలి జోరుగా వీస్తుండటంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సీతారామ్‌కు పరిస్థితి సానుకూలంగా ఉంది.
తగరపువలస, న్యూస్‌లైన్ : భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. కాంగ్రెస్‌ను వీడిన తరువాత జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేయాలో చివరి వరకు తేల్చుకోలేక ఒకానొక దశలో పోటీ నుంచి విరమించుకోవడానికే నిర్ణయించా రు. అయితే చంద్రబాబు ఒత్తిడితో విశాఖ పార్లమెంట్‌కు పోటీ చే యాలని భావించినా వైఎస్సార్సీపీ నుంచి వైఎస్ విజయమ్మ పేరు ఖరారు కావడంతో ఆమెపై నెగ్గడం అంత ఆషామాషీ కాదని వెనక్కు తగ్గారు. అప్పటికే జిల్లాలో టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంతో భీమిలి అయితే సేఫ్ అని భావించారు.
ఇక్కడ మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్న 20 వేలమంది మత్స్యకార ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి చెన్నా దాసు వెంట నడుస్తుండటంతో మొదటిసారి కంగుతిన్నారు. టీడీపీ రెబెల్‌గా దిగిన అనిత గంటాను పత్రికాముఖంగానే పార్టీకి పట్టిన శనిగ్రహమని తిట్టిపోయడంతో చెమటలు పట్టాయి. ఇక రాజు ఫౌండేషన్ పేరుతో భీమిలి నియోజకవర్గంలో పలుసేవా కార్యక్రమాలు చేపట్టిన ఎన్ఆర్ఐ కంటుభుక్త రామానాయుడు తన సోదరుడు డాక్టర్ శ్రీనివాస్‌ను ఇండిపెండెంట్‌గా పోటీకి దించారు. ఈయనకు కూడా నియోజకవర్గంలో మెజారిటీ సామాజికవర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
ఇలా మూడువైపులా టీడీపీ ఓట్లను చీల్చే ఈ ముగ్గురికీ తోడు ఇప్పటికే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకసారి, వైఎస్ విజయమ్మ మూడుచోట్ల నిర్వహించిన ప్రచారాలకు టీడీపీలో వణుకు పుట్టించింది. భీమిలిలో దాదాపు ఓటమి అంచున ప్రయాణిస్తున్న గంటా విశాఖ ఎంపీగా పోటీ చేసి విజయమ్మ చేతిలో ఓటమి పొందినా గౌరవం ఉండేదని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్పీలో చక్రం తిప్పి, కాంగ్రెస్‌లో మంత్రిగా అజమాయిషీ చెలాయించిన గంటా టీడీపీలో కూడా తన హవా కొనసాగించాలనుకుని మొదటిసారి తప్పుతోవ పట్టారని వినిపిస్తోంది.
ఈ ఎన్నికల తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా, వైఎస్ విజయమ్మ విశాఖ ఎంపీగా ఎన్నిక కావడం దాదాపు ఖాయమని ఇప్పుడు కర్రి సీతారామ్ చేతిలో కూడా గంటా ఓటమి చెందితే తమ భవిష్యత్తు ఏమిటని దేశం శ్రేణులు మథనపడుతున్నాయి. ఎన్నికల తరువాత మళ్లీ నియోజకవర్గబాధ్యతలు మోసే నాయకుడు ఐదేళ్ల వరకు టీడీపీకి లభించరని తెలుస్తోంది. టీడీపీలో నియోజకవర్గం మీద అభ్యర్థి నుంచి కార్యకర్త వరకు తమ భవిష్యత్తుపైనే తలపట్టుకుని కూర్చున్నారు.