మరియప్పన్ కు రూ. 75 లక్షలు..
రియో: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు రూ. 75 లక్షల నజరానాను కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనున్నాడు. దాంతో పాటు కాంస్య పతకం సాధించిన మరో అథ్లెట్ వరుణ్ భాటికి రూ. 30 లక్షల నగదు పురస్కారం దక్కనుంది.
భారత అథ్లెట్లు పారాలింపిక్స్ కు వెళ్లేముందు వారిని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణ సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు పేర్కొంది.
ఈ మేరకు మరియప్పన్ కు రూ.75 లక్షలు, భాటికి రూ.30 లక్షలు నజరానా దక్కనుంది. భారత్ నుంచి ఈసారి 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. పారా ఒలింపిక్స్ ఆరంభమైన రెండు రోజుల్లోనే భారత ఖాతాలో పతకాలు చేరడంపై ఆ అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురస్తోంది. పారాలింపిక్స్‌లో సత్తాచాటిన మరియప్పన్, భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు.మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. రియోలో మరిన్ని పతకాలు సాధించి భారత కీర్తిని మరింత పెంచాలంటూ ఆకాంక్షించాడు.
రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు.