వాస్తు దోషమట
ఆర్వీఎంలో నిధులు దుబారా
పీవో చాంబర్ మార్పు.. మరుగుదొడ్లు మరో చోటికి
పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల కొరత
ఇక్కడేమో వృథా ప్రయాస
ఆదిలాబాద్ టౌన్ :
రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) కార్యాలయూనికి వాస్తు దోషమట..! ఎన్ని విమర్శలు వచ్చినా ఆర్వీఎం అధికారుల తీరు మారడం లేదు. పీవోలు మారినప్పుడల్లా కార్యాలయ భవనంలో మార్పుల పేరిట లక్షల నిధులు దుబారా చేస్తున్నారు. దీనికి అంతే లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే అనేక అక్రమాలకు నిలయంగా మారిన ఆర్వీఎంలో తాజాగా నిధుల దుబారా వ్యవహారం విస్తు పోయేలా చేస్తోంది.
ఒక వైపు ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అసౌకర్యానికి గురవుతుంటే.. ఇక్కడేమో అధికారులు పాఠశాలల్లో వసతులకు వెచ్చించాల్సిన లక్షల రూపాయల నిధులను తమ కార్యాలయాల్లో వాస్తు దోషం పేరిట వెచ్చించడంపై విమర్శలు వస్తున్నారుు. ఇన్‌చార్జీగా ఉన్న అధికారి ఇలా వాస్తు దోషాల పేరిట మార్పులు చేయిస్తుండడంలో మర్మమేమిటో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారి మారినప్పుడల్లా..
ఆర్వీఎంలో పీవోలు మారినప్పుడల్లా సౌకర్యం, సౌలభ్యం, వాసు ్తదోషాల పేరిట భవనంలో ఏదో ఒక మార్పులు చేసుకుంటూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇన్చార్జి పీవోగా ఉన్న శ్రీనివాస్‌ను తప్పించి డీఆర్డీఏ ఏపీడీగా ఉన్న రాజేశ్వర్ రాథోడ్‌ను నెల రోజుల క్రితం నియమించారు. తాజాగా ఆర్వీఎం భవనంలో వాస్తుదోషం ఉందని ఓ పంచాగకర్త చెప్పడంతో ఆగమేఘాలపై భవనంలో మార్పులకు సిద్ధమయ్యారు.
ప్రస్తుతం సెక్టోరియల్ అధికారులు ఉన గదిని పీవో చాంబర్‌గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్టోరియల్ అధికారుల కోసం ప్రస్తుతం మరుగుదొడ్లను తొలగించి దాన్ని మరో గదికి కలుపుతూ నిర్మించాలని యోచిస్తున్నారు. మరుగుదొడ్లను వేరే చోటికి మెట్ల కిందకు తరలిస్తున్నారు. దీనికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో పీవోలుగా పని చేసిన వారు మారినప్పుడల్లా వారి అనువుకు తగ్గట్టు చాంబర్‌ను మార్చుకుంటూ వచ్చారు.
పాఠశాలల్లో వసతులు కరువు
జిల్లాలో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి సరఫరా, తాగునీటి సదుపాయం, ప్రహరీలు, విద్యుత్ సరఫరా, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఇతర అవసరాల నిమిత్తం రూ.310 కోట్లు అవసరమని ఆర్వీఎం అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. విద్యా సంవత్సరాలు అనేకంగా మారుతున్న విద్యార్థులకు వసతులు సమకూరడం లేదు. లక్షల నిధులతో ఎన్నో పాఠశాలల్లో చిన్నపాటి వసతులను మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. అధికారులు తమ సౌకర్యం కోసం కార్యాలయాల్లో మార్పులకు వెచ్చిస్తున్న నిధులతో పాఠశాలల్లో కొన్ని సమస్యలైనా తీర్చగలిగే పరిస్థితి ఉన్నప్పటికి ఆర్వీఎం అధికారులు అలాంటి వాటికి అసక్తి చూపరన్న విమర్శలు ఉన్నాయి. ఆర్వీఎం భవనంలో ఉన్నత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా వాస్తుదోషం పేరిట నిధులు వెచ్చిచేందుకు మాత్రం ఆర్వీఎం అధికారులు వెనుకాముందు ఆలోచించకుండా ఖర్చు చేయడంలో స్వార్థం ఉందన్న ఆరోపణలు లేకపోలేదు.
విశాలంగా ఉంచేందు కోసం..
కార్యాలయం ఇరుకుగా ఉంది. ఉద్యోగుల సౌలభ్యం కోసం గదులను విశాలంగా చేసేందుకు మరుగుదొడ్లలను తొలగించాం. పై అంతస్తులో ఉన్న అన్ని విభాగాలను గ్రౌండ్ ఫ్లోర్‌కు తీసుకువస్తాం. రికార్డు గదిని పైకి మారుస్తాం. - రాజేశ్వర్ రాథోడ్, ఆర్వీఎం పీవో