మున్సిపల్, వ్యాట్ బిల్లులకు మండలి ఆమోదం
సాక్షి, హైదరాబాద్: పురపాలక, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు బిల్లులకు ఆదివారం శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎన్నికల సంస్కరణలు, అధికారులకు అధికారాల వికేంద్రీకర ణకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రవేశపెట్టగా, విలువ ఆధారిత పన్నుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండలిలో ప్రవేశపెట్టారు.
వ్యాట్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించ కపోవడం పేదలపై పెనుభారం మోపినట్లవుతోందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసికెళ్లేందుకు ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.