కృషితోనే లక్ష్య సాధన
డిచ్పల్లి (నిజామాబాద్): కృషితోనే లక్ష్యసాధన సాధ్యమవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్స్‌లర్ సి.పార్థసారథి సూచించారు.
యూనివర్సిటీ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో క్యాంపస్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో శనివారం 'పెయింట్ యువర్ డ్రీమ్స్' (కలలకు రూపమిద్దాం) రెండో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్థసారథి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే ప్రసంగం చేశారు. జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని, వాటిని అందిపుచ్చుకుంటే అద్భుత విజయాలు సొంతమవుతాయని వివరించారు. ఫోకస్‌తో లక్ష్యాలు ఎంచుకుని, ఇష్టమైన రంగంలో రాణించాలని అన్నారు. 'మీ జీవితానికి మీరే ఒక హీరోగా భావించుకుని అందుకు అనుగుణంగా ఎదగేందుకు కృషి చేయండి' అని విద్యార్థులకు పిలుపునిచ్చారు.