జ్ఞాన సమాజ దార్శనికులు
విశ్వవిద్యాలయం అంటేనే భవిష్యత్తు అని అర్థం. వైస్ చాన్సలర్ అంటే జ్ఞాన సమాజాన్ని సృష్టించే ఒక సామాజిక కార్యకర్త. తెలంగాణ రాష్ట్రంలో ఆరు విశ్వవిద్యాలయాలలో వి.సి. పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మన ఉన్నత విద్య ఏ రకంగా ఉందో అంచనా వేయవచ్చును. ప్రభుత్వం తక్షణం దీన్ని గాడిలో పెట్టాలి.
విశ్వవిద్యాలయాలు ఎంత సమర్థవంతంగా ఉంటే ఉన్నత విద్యారంగం నుంచి అంతే సమర్థవంతులను సమాజానికి అందిస్తుంది. విశ్వవిద్యాల యాలు జీర్ణావస్థకు చేరుకుంటే ప్రగతికి తీరని ఆటంకం అవుతుంది. విశ్వవిద్యాలయ వ్యవస్థ అందించిన సమర్థులైన వ్యక్తులే నేడు దేశంలోని మొత్తం పాలనా రంగాన్ని నడిపిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలను ముందుకు నడిపిస్తూ దిశానిర్దేశం చేయగలిగిన సమర్థవంతులను ఉన్నత విద్యావ్యవస్థే అందించింది. ఇందుకు ప్రధాన కారణం విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దే వైస్‌చాన్సలర్లు, బోధనా రంగంలో నిష్ణాతుల వల్లనే ఉన్నత విద్యారంగం శక్తిమంతం అవుతుంది. ఇపుడు మన యూనివర్సిటీల ను గతంలో యూనివర్సిటీల వ్యవస్థతో పోల్చుకుంటే చాలా ఎక్కువ తేడా కనిపిస్తుంది. ఒక విశ్వవిద్యాలయానికి వి.సి నియామకం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసేది. ఇందుకోసం ప్రత్యేకించి సెర్చ్ కమిటీ వేసేవారు. సమర్థుడైన వ్యక్తిని వెతికి పట్టుకునేందుకు పాలనా రంగంలోని వారు, ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు కలిసి ఆలోచించి వి.సి.ని నియమించడం జరిగేది. అలా నియమితులైన వి.సి.ల కృషితో ఆ వ్యవస్థ వెలుగుతూ ఉండేది.
కానీ ఇపుడు విశ్వవిద్యాలయ వి.సి.ల నియామకం రాజకీయ నియామకాలుగా, తమ అనుయాయులను నింపుకునే వ్యవస్థగా మారాయి. ఇది వ్యవస్థకు చాలా ప్రమాదకరమైనది. ఇపుడు తెలంగాణ కన్న కలలతో స్వరాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో నియమితులయ్యే వి,సి.లతో ఉన్నత విద్యావ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన జరగాలి. సమర్థులను వెతికి పట్టుకోవాలి. ఇందులో రాజకీయ అంశాలను పక్కనబెట్టి ఉన్నత విద్యా వ్యవస్థను పకడ్బందీగా నడిపించే సారథుల కోసం వెతకాలి. ఏ ప్రలోభాలకు లొంగని వ్యక్తులవల్ల మాత్రమే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. విద్యావ్యవస్థ దెబ్బతింటే దాని ప్రభావం మిగిలిన అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
విద్యారంగం వెలుగులు సమాజంపై పడి వ్యవస్థ వెలుగొందుతుంది. ఈ విశ్వవిద్యాలయాలకు ఒక్కరోజు కూడా వి.సి. లేకుండా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎవరో కనుక్కొని చెప్పాల్సిన పని లేదు. విద్యారంగ నిపుణులందరికీ విద్యారంగ ప్రేమికులందరికీ ఈ విషయం తెలిసిందే. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పనిచేసిన డేవిడ్ స్టార్ బోర్డాన్ రాసిన ది కేర్ అండ్ కల్చర్ ఆఫ్ మ్యాన్ పుస్తకంలో తన అనుభవాలను తెలియజేశాడు. విద్యారంగాన్ని మానవుల అవసరాలను తీర్చే సాధనంగా డేవిడ్ స్టార్ బోర్డాన్ పేర్కొన్నాడు. భవిష్యత్తుకు మనం వెచ్చించే డబ్బు ఉత్కృష్ట వ్యయంగా పరిగణించబడుతుంది. విశ్వవిద్యాలయం అంటేనే భవిష్యత్తు అని అర్థం. సమాజాన్ని సంరక్షించడం అనే పదం చాలా క్లిష్టమైనది.
ఏ సంస్థలైతే (విశ్వ విద్యాలయాలు) సమాజాన్ని సంరక్షించటానికి ఏర్పడ్డా యో వాటిని అవగాహన చేసుకోవటం, వాటిని కాపా డటమే ప్రజాస్వామిక ప్రభుత్వాల కర్తవ్యం అని మరు వరాదు. విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిలే ప్రధానమైన అంగం. కానీ వైస్ చాన్సలర్ విశ్వవిద్యా లయానికి ప్రతీక. విద్యా ప్రమాణాలు పడిపోయినా, పరిశోధనలో నాణ్యత తగ్గినా, పరీక్షా పత్రాలు బయటపడ్డా, విద్యా ప్రాంగణంలో ఆందోళనలున్నా దానికి సంపూర్ణమైన బాధ్యత వైస్ చాన్సలర్దే అవుతుంది. ఏ రంగంలో పగుళ్లు వచ్చినా ఆ దుమ్ము అంతా వైస్ చాన్సలర్ నెత్తిమీదనే పడుతుంది. దేశంలో ఏ ఉద్యోగం అయినా వైస్ చాన్సలర్ పదవితో పోల్చలేం. ఆ పదవి కాలపరిమితి స్వల్పం. వారి అధికారాలు చాలా తక్కువ. భద్రత చాలా బలహీనంగా ఉంటుంది. కానీ ఆ బాధ్యతలు మాత్రం వైరుధ్యాలతో కూడుకున్న ఉన్నతమైన బాధ్యతలు.
అందుకే వైస్ చాన్సలర్ నుంచి సమాజం ఎంతో ఆశిస్తుంది. అలాంటి సమర్థులు కావాలని సమాజం డిమాండ్ చేస్తుంది. ఆ పదవిలో ఉన్నవారిపై సానుభూతి తక్కువగా ఉంటుంది. అలాంటి బాధ్యత గల పోస్టును భర్తీ చేసేటప్పుడు సమర్థుల కోసం అన్వేషించాలి కానీ పోస్టులను నింపటం ఎంతమాత్రం కాదు. అలాంటి వి.సి.పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆరు విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్నాయంటే మన ఉన్నత విద్య ఏ రకంగా ఉందో అంచనా వేయవచ్చును. దీన్ని గాడిలో పెట్టవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ముందున్నది.
వైస్ చాన్సలర్ పోస్టులకు చూడవలసింది యోగ్యతలు కాదు. ఆ వ్యక్తి దార్శనికుడై ఉండాలి. విభిన్న వైరుధ్యాలున్న విద్యావ్యవస్థ నుంచి విభిన్న వ్యక్తులు వస్తారు. వివిధ శాఖలు, వివిధ రకాల విద్యార్థుల చేత పని చేయించాలి. టీచింగ్, లెర్నింగ్‌లపై దృష్టి పెట్టాలి. సత్యాన్వేషణే లక్ష్యంగా ముందుకు సాగాలి. జ్ఞాన నిల్వ చేయటం, జ్ఞాన ప్రసారం, జ్ఞాన సృష్టి జరగాలి.
విశ్వవిద్యాలయం జ్ఞానకేంద్రం మాత్రమే కాకుండా సమాజ మార్పుకు కారణభూతం అవుతుంది. తొలిసారిగా విశ్వవిద్యాలయం మెట్లెక్కిన విద్యార్థులకు దశా దిశా నిర్దేశించాలి. నేడు ఉన్నత విద్య మాస్ ఎడ్యుకేషన్ అయింది. సామాజిక న్యాయం, సమత్వం తేవటం దీని లక్ష్యం కావాలి. సత్యాన్వేషణ అనేది వెతికితే దొరికే వజ్రం కాదు. అది జ్ఞానమై నిరంతరం క్రమంగా ఎదగవలసి ఉంటుంది. ఈ జ్ఞాన ఫలితాలను చూడాలి. భవిష్యత్తును అంచనా వేసే దార్శనికుడిగా వి.సి. ఉండాలి. వి.సి. అంటే ఒక సామాజిక కార్యకర్త. జ్ఞాన సమాజాన్ని సృష్టించి దాని ద్వారా విశాల సమాజం నిర్మించేందుకు దోహదపడాలి. తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై వి.సిల నియామకం చేపట్టాలి. అన్ని విశ్వ విద్యాలయాలకు సమర్థులను ఎంపిక చేయాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంకంటే భిన్నంగా వ్యవహరించాలి. సమర్థులైన వి.సి.ల కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలి.
- (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ)
చుక్కా రామయ్య