బీడు బతుకులు
ఆదోని/ఆలూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలు కరువు కోరల్లో విలవిల్లాడుతున్నాయి. సగటు వర్షపాతం 1200 మిల్లీమీటర్లు కాగా.. ఈ ప్రాంతాల్లో 500 మిల్లీమీటర్లు కూడా మించని పరిస్థితి. సాగులో పెట్టుబడులు పెట్టడమే కానీ.. ఏనాడు లాభాలు ఎరుగని దయనీయం. అందునా నల్లరేగడి భూములు కావడంతో ఒక్క పంటతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అరకొర వర్షాలతో రైతన్న ఏటా ఆర్థికంగా చితికిపోతున్నాడు. పంటల సాగుకు ప్రత్యామ్నాయ జలవనరులు లేక చాలా మంది భూములను బీడు పెట్టుకుంటున్నారు. ఫలితంగా వేలాది మంది చిన్న, మధ్య తరగతి రైతులు పొట్ట చేతపట్టుకుని గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి తదితర నగరాల వైపు అడుగులేస్తున్నారు.
ఆదోనిలో పుట్టి పెరిగిన కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక తమకు మంచి రోజలు వస్తాయని ఆశించిన ఆలూరు, ఆదోని, హొళగుంద, చిప్పగిరి, హాలహర్వి, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర మండలాల ప్రజలకు నిరాశే మిగులుతోంది. తుంగభద్రకు ఉపనది అయిన వేదావతి ఆధారంగా సాగునీటి పథకాలు నిర్మిస్తే ఈ ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఐదేళ్లు పూర్తి కావస్తున్నా.. ఈ ప్రాంత రైతాంగాన్ని టీజీతో పాటు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు, రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కానీ పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాగునీటి పథకాల నిర్మాణానికి అధికారులు పంపిన ప్రతిపాదనలు పాలకుల కార్యాలయాల్లో బూజు పట్టిపోయాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుర్భర జీవనం గడుపుతున్నారు.
చెంతనే నీరున్నా...
కృష్ణా బేసిన్-9 పరిధిలోని తుంగభద్రకు వేదావతి ఉపనది. కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉంది. చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ప్రవహిస్తున్న ఈ నదిలో దాదాపు 87.8 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు కృష్ణా ట్రిబునల్ అంచనా వేసింది. 75 శాతం సగటు లభ్యతను లెక్కించి 56.4 టీఎంసీలు కరువు పీడిత ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో మన రాష్ట్రానికి 12.47 టీఎంసీలు, కర్ణాటకకు 38.07 టీఎంసీలు కేటాయించింది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టకపోగా.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు సైతం నోరుమెదపకపోవడం రైతులకు శాపమవుతోంది.