veerabrahmaiah
-
ఎమ్మెల్యేలు ఎస్సంటేనే..
మెట్పల్లి రూరల్ : జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారు ఔనంటేనే తహసీల్దార్లను, ఎంపీడీవోలను బదిలీ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల సమయంలో నియమావళి మేరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో జిల్లాలోని దాదాపు అన్ని మండలాల తహసీల్దార్లను, ఎంపీడీవోలను వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు బదిలీ చేశారు. వారందరిని తిరిగి పాత స్థానాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు తహసీల్దార్లు, ఎంపీడీవోలు తమకు అనుకూలమైన, గతంలో పనిచేసిన మండలాల్లో తిరిగి పోస్టింగ్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో తమ ఎమ్మెల్యేలకు సహకరించే వారిని మాత్రమే తిరిగి బదిలీ చేయాలని సూచిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీడీవోలు, తహసీల్దార్ల బదిలీలకు అనుకూలంగా కాన్సెంట్ లెటర్లు కలెక్టర్‌కు అందిస్తేనే బదిలీ ఉత్తర్వులు ఇస్తున్నట్లు వినికిడి. దీంతో తమకు అనుకూలమైన స్థానాల కోసం తహసీల్దార్లు, ఎంపీడీవోలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
నేత కార్మికుడి కుటుంబానికి బాసట
ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : నేతకార్మికుడి ఆకలిచావుపై కలెక్టర్ వీరబ్రహ్మయ్య చలించిపోయారు. బాధిత కుటుం బానికి ఆపన్నహస్తం అందించారు. నేతన్న కుటుంబానికి గూడు కల్పించాలని, చితికిపోయిన వారికి అండగా నిలవాలని తహశీల్దార్‌ను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేటకు చెందిన నేత కార్మికుడు దొంత రాజమల్లు(60) మంగళవారం రాత్రి ఆకలిచావుకు గురయ్యాడు. ‘ఆకలిచావు’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో గురువారం కథనం ప్రచురితమైంది. దీనికి కలెక్టర్ వీరబ్రహ్మయ్య స్పందించారు. ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ సుమతో మాట్లాడి నేతన్న కుటుంబం వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తహశీల్దార్ రాజమల్లు కుటుంబం స్థితిని ఫొటోలు తీసి కలెక్టర్‌కు పంపించారు. ఆరోగ్య ఉపకేంద్రంలో తలదాచుకుంటున్న వైనాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. మృతుడి భార్య ఎల్లవ్వ, జాడతెలియకుండా పోయిన పెద్దకుమారుడు మహేందర్, చిన్న కుమారుడు సాగర్ వివరాలను అందజేశారు. సాగర్ మెకానిక్ షెడ్డులో వాహనాలను శుభ్రం చేస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబానికి ఆసరాగా ఉంటున్న విషయాన్ని వివరించారు. బాధిత కుటుంబానికి నేతన్న కుటుంబాల ప్యాకేజీ కింద రూ.1.50 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు, రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా రూ.10 వేల నగదు, కార్మిక కుటుంబానికి పింఛన్ అందజేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని తహశీల్దార్ తెలిపారు. మృతుడి చిన్నకుమారుడు సాగర్‌కు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.