ఐదు నెలల కిందటే పెళ్లి.. కేదార్నాథ్ యాత్రకు వెళ్లి నవ వరుడి మృతి
ఐదు నెలల క్రితం జరిగిన వివాహానంతరం కోటి ఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెట్టిన ఓ నవజంట భవిష్యత్తు గురించి ఎన్నో కలల కంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలోనే విధికి కన్నుకుట్టడంతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో నవ వరుడి ప్రాణాలు గాలిలో కలిసిపోగా నవవధువు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషాద వార్తతో రాజాం మండల పరిధిలోని బొద్దాం గ్రామస్తులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
సాక్షి, విజయనగరం: రాజాం సిటీ మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవిరావుకు, పట్టణ పరిధిలోని సారథికి చెందిన కల్యాణితో ఫిబ్రవరి 12న వివాహమైంది. రవిరావు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ భార్య కల్యాణితో జీవనం సాగిస్తున్నాడు. ఈ నవజంట వారం రోజుల క్రితం కేథారినాథ్ యాత్రకు హైదరాబాద్ నుంచి బయల్దేరింది. యాత్ర జాలీగా సాగుతున్న సమయంలో శనివారం రాత్రి (తెల్లవారితే ఆదివారం) అక్కడ భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో ప్రయాణికులంతా గల్లంతయ్యారని తొలుత భావించారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూటీం బాధితులను రక్షించే క్రమంలో కల్యాణితోపాటు మరికొంతమందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. ముమ్మరగాలింపు చర్యలు చేపట్టిన తరువాత రవిరావు (29) మృతిచెందినట్లు గ్రామస్తులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా మృతుని కుటుంబ సభ్యులంతా తగరపువలసలో జరుగుతున్న బాలసారె కార్యక్రమంలో ఉన్నారు. రవిరావు మృతి విషయం తెలుసుకున్న వీరంతా విషాదంలో మునిగిపోయారు.
చదవండి: పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్
అధికారుల ఆరా..
గ్రామానికి చెందిన రవిరావు దంపతులు తీర్థయాత్రకు వెళ్లి ప్రమాదం బారిన పడిన విషయంపై తహసీల్దార్ ఎస్కే రాజు, ఆర్ఐ విద్యాసాగర్లు గ్రామానికి వచ్చి ఆరా తీశారు. రవిరావు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లను కోరినట్లు గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ నక్క వర్షిణి, సర్పంచ్ నక్క తవిటమ్మతో పాటు గ్రామస్తులు తెలిపారు.