2019 ఎన్నికల్లో సత్తా చాటుదాం
కడప రూరల్: జనాభాలో అత్యధిక శాతం కలిగిన బీసీ వర్గాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు అన్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ఆయన మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, నాయకులు బంగారు నాగయ్య యాదవ్, చేలో రవి తదితరులు పాల్గొన్నారు.
సమావేశం రసాభాసా..
ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు సమక్షంలోనే ఆ సంఘానికి చెందిన నాయకులు గొడవపడ్డారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకృష్ణయాదవ్ అక్కడికి వచ్చి ‘నాకు తెలియకుండా ఇక్కడ సమావేశం ఎలా నిర్వహిస్తారని.?’ప్రశ్నించడంతోనే గొడవ ప్రారంభమైంది. తరువాత ఆయన వేదిక పైకి వచ్చాక ఎక్కువ సేపు ప్రసంగిస్తుండడంతో ఆ సంఘానికి చెందిన కొంతమంది నాయకులు ఇక చాలించమని సైగలు చేశారు. దీంతో బాలకృష్ణయాదవ్ అనుచరులు ఒక్కసారిగా ముందుకు తోసుకువచ్చారు.బాలకృష్ణ యాదవ్ ప్రసంగానికే అడ్డుతగులుతారా అని గొడవపడ్డారు.దీంతో ఆ సంఘం నేతల మధ్య కాసేపు ఘర్షణ, ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొంతమంది అక్కడ ఉన్న కుర్చీలను విసిరేశారు. ఈ పరిణామాలపై సంఘం రాష్ట్ర అధ్యక్షులు విస్తుపోయారు. చివరికి జోక్యం చేసుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సమస్యల కోసం పారాడాల్సిన మనమే ఇలా గొడవపడడం ఏమాత్రం బాగలేదని అసహనం వ్యక్తం చేశారు.