ఆ ఐదుగురు
అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఓ అందమైన యువతిని తెగించి మరీ రక్షించాడు సోంబాబు. అతడి ఒంటిపై చాలా గాయాలు ఉండడం చూసి ఆ యువతి.. ‘‘ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. కానీ అదేంటీ మీ ఒంటి మీద అన్ని దెబ్బలున్నాయి’’ అని అడిగింది. ‘‘మిమ్మల్ని రక్షించడానికి బయలుదేరిన మరో నలుగురిని చితగ్గొట్టి రావాల్సి వచ్చింది మరి’’ చెప్పాడు సోంబాబు.
అప్పుడేం చేశారు?
‘‘ఈ రోజు బస్సులో నా జేబులోని పర్సు ఎవరో కొట్టేశారోయ్’’ భార్యతో చెప్పాడు వెంగళ్రావ్. ‘‘అదేమిటీ? మీ జేబులో చెయ్యి పెట్టినప్పుడు ఆ దొంగ వెధవ ఎవరో మీరు చూడలేదా?’’ ‘‘అది నా చెయ్యే అనుకున్నానోయ్’’ వెంగళ్రావ్ సమాధానం.
బావిలో పడకుండా..!
రాము: నాకు, నా భార్యకు మధ్య గొడవ జరిగితే నేను వెంటనే మా పెరడులోని బావిని పెద్దచెక్కతో మూసి వేస్తాను.
సోము: ఎందుకూ.. మీ ఆవిడ అందులో దూకుతుందని భయమా?!
రాము: కాదు.. నన్ను తోసేస్తుందని భయం.
పాసయ్యే మార్గం
తండ్రి: అదేంట్రా... ఒకేరకం పుస్తకాలు రెండెందుకు కొన్నావు?
కొడుకు: ‘ఈ పుస్తకం చేతిలో ఉంటే సగం పరీక్ష పాసయినట్టే’ అని రాసుంది. అందుకే రెండు పుస్తకాలు కొన్నా!