ఆనందోత్సవం
సాక్షి, తిరుమల: వేంకటాచల క్షేత్రంలో బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది. మలయప్ప తన పట్టపు రాణులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా పూటకో వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కల్పవృక్ష, రాత్రి సర్వభూపాల వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు. ఉదయం కల్పవృక్ష వాహన సేవ, రాత్రి సర్వభూపాల వాహన సేవలో భక్తుల రద్దీ కనిపించింది. మంగళవారం 45 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 58 వేల మందికిపైగా అన్నప్రసాదం అందజేశారు.
ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శనలు : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక శోభ భక్తులను కట్టిపడేస్తోంది. వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలు అలరిస్తున్నాయి.