మట్టి దెయ్యం
చాలాసేపటిగా చీకట్లో ఒక్కడే పడుకుని ఉన్నాడు వెంకటయ్య. చీకటికి, ఒంటరితనానికి అతడి జీవితం ఏళ్లుగా అలవాటు పడిపోయింది. మానవ జీవితంలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి మాత్రమే ఉంటే.. వెంకటయ్య అనే మానవుడి జీవితంలో చీకటి, ఒంటరితనం అనే రెండు అదనపు భూతాలు కూడా కలిసి మొత్తం ఏడు భూతాలు ఉన్నాయి!పూరింట్లో నులక మంచం మీద పడుకుని ఉన్నాడు వెంకటయ్య. మంచం మీద పల్చటి దుప్పటి ఉంది. వెంకటయ్య తలకింద బూరుగు దూది దిండు ఉంది. దగ్గర ఎవ్వరూ లేకుండా ఒక్కడే అలా పడుకుని, పైన చూరును చూసుకుంటూ దీర్ఘంగా ఆలోచనల్లోకి వెళ్లిపోవడం వెంకటయ్యకు ఇష్టమైన వ్యాపకం. అరవై ఏళ్లు దాటాయి వెంకటయ్యకు. బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఇష్టమైన వ్యాపకంలోకి పూర్తిగా వచ్చేయడానికి వీలు కలిగాక అతడు ఆ పూరింట్లోంచి బయటికి రావడమే మానేశాడు.
వెంకటయ్యకు భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు పిల్లలున్నారు. వాళ్లంతా వెంకటయ్య ఉంటున్న పూరింటికి ఎదురుగా ఉన్న పెద్ద భవంతిలో ఉంటారు. అది వెంకటయ్య కట్టించిందే. పూరిల్లు మాత్రం వెంకటయ్య కట్టుకున్నది. మట్టిగోడలు, తాటాకులతో కట్టుకున్నాడు. భవంతిలోని వాళ్లు ఇక్కడికి రావడమే కానీ, వెంకటయ్య భవంతిలోకి వెళ్లడు. ఓ రోజు చెప్పేశాడు. ‘నేనిక నా ఇంట్లోనే ఉండిపోతాను. మీరంతా మనింట్లో ఉండండి’ అని! ఆ ‘ఓ రోజు’కు ఉన్న ప్రత్యేకత ఏం లేదు. ‘ఓ రోజు’ అంతే. ఆ మాటకు అతడి భార్యేమీ ఖిన్నురాలైపోలేదు. భర్త మట్టిమనిషి అని ఆమెకు తెలుసు. మట్టి అంటకుండా తిరిగే లోకానికి దూరంగా ఉంటానంటే ఆమె కాదనడానికి ఏముంటుంది! అయితే ఒక మాట మాత్రం అంది. ‘నేనూ మీతోనే ఈ పూరింట్లో ఉంటాను’ అని. ఆ మాటకు వెంకటయ్య నవ్వాడు. ఆమెకు చుట్టూ పిల్లలుండాలి. ఆ పిల్లల పిల్లలు ఉండాలి. ఇరుగు పొరుగు వచ్చి వెళుతుండాలి. ఒంట్లో బాగున్నా, లేకున్నా.. ఇన్నేళ్లలో తనెప్పుడూ ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని కోరుకున్నట్లు అతడికి గుర్తు లేదు. అందుకే నవ్వి, ‘నాకు చీకటంటే ఇష్టం’ అన్నాడు.‘నేనూ చీకట్లోనే ఉంటాను’ అంది ఆవిడ. ‘నాకు ఒంటరితనం అంటే ఇష్టం’ అన్నాడు. ‘నేనూ ఒంటరితనంలోనే ఉంటాను’ అనడానికి లేకుండా పోయింది ఆవిడకు. ఇద్దరు కలిసి ఉంటే అది ఒంటరితనం అవుతుందా! అందుకే ఆ మాట అనలేకపోయింది.
వెంకటయ్య సంపాదించాల్సిందంతా సంపాదించి, భార్యకు, పిల్లలకు ఇచ్చినంతా ఇచ్చి, పిల్లలకు ఉద్యోగాలొచ్చి, వాళ్లకు పెళ్లిళ్లయ్యాక తనొక్కడు ఇటు వేరుగా పూరింట్లోకి వచ్చేశాడు. వస్తూ వస్తూ భవంతిలోంచి పూరింట్లోకి తన మంచినీళ్ల కుండను భద్రంగా తెచ్చుకున్నాడు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఆ కుండలోని నీళ్లే తాగుతున్నాడు అతను. అందుకే దానిని తెచ్చుకున్నాడు. మిగతా తిండీ తిప్పలు అక్కడి నుంచే ఇక్కడికి అడక్కుండానే, వేళ మీరకుండా వచ్చేస్తుంటాయి. అప్పుడప్పుడు మనవలు వచ్చి ఆడుకుని వెళుతుంటారు. అల్లరి మరీ ఎక్కువైనప్పుడు భార్యను పిలిచి, ‘వీళ్లను తీసుకెళ్లు’ అన్నట్లు ఆమె వైపు చూస్తాడు. వెంకటయ్య ఉంటున్న ఇంట్లో అతడి నులక మంచం, అతడి కళ్లజోడు తప్ప పిల్లలు ఎక్కి, దిగి, లాగి, జరిపి, నెట్టి, పడేసి, పగలగొట్టేవేమీ ఉండవు. ఉండవనే అతడూ అనుకున్నాడు కానీ ఆ రోజు అల్లరి ఎక్కువై, భార్యకు కబురు పంపేలోపే అతడు మంచినీళ్లు తాగే కుండను పగలగొట్టేశారు పిల్లలు! అది వెంకటయ్య ఊహించని పరిణామం. అది వెంకటయ్య తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న మట్టి కుండ. చిన్నప్పట్నుంచీ ఆ కుండ తనతోనే ఉంది. బ్యాచిలర్‌గా ఉన్న రోజుల్లో అతడితో పాటు ఆ కుండ అతడు అద్దెకు తీసుకుని చదువుకుంటున్న రూమ్‌కి వచ్చేసింది. పెళ్లయ్యాక భార్యతో పాటు అతడి ఇంట్లోకి అడుగుపెట్టింది. పెళ్లైన ఈ ముప్పై ఐదేళ్లలో ఇంట్లో రెండు మూడు ఫ్రిజ్‌లు మారిపోయాయి కానీ, కుండ మారిపోలేదు. ఆ రాత్రి వెంకటయ్యకు కల వచ్చింది. తన కుండ పగిలిపోనట్లు! పగిలిపోనందుకు కలలో చాలా సంతోషించాడు. తెల్లారి లేవగానే పిల్లల్ని కుండ దగ్గరకు రానివ్వకూడదని కలలోనే అనుకున్నాడు. కల కూడా కుండలా పగిలిపోయినప్పుడు కానీ అతడికి మెలకువ రాలేదు. మెలకువ వచ్చి నీళ్లు తాగుదామంటే కుండ లేదు! పక్కనే భార్య పెట్టి వెళ్లిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగబుద్ధి కాలేదు వెంకటయ్యకు.
కుండ పగిలిన మర్నాడే కుమ్మరి దగ్గరు వెళ్లాడు వెంకటయ్య. అతడి చేతిలో సంచి ఉంది. ఆ సంచిలో పగిలిన తన కుండ పెంకులు ఉన్నాయి. ఆ పెంకుల్ని నీళ్లలో నానబెట్టి, మట్టి ముద్దగా చేసి, ఆ ముద్దతో చిన్న పాత్రంత కుండనైనా సరే తయారు చేసిమ్మని అడిగాడు. అలా వీలు కాదని కుమ్మరి అనడంతో కనీసం కుండపై మూతనైనా తయారు చేసి ఇమ్మన్నాడు. అలా చెయ్యడం కూడా కష్టం అన్నాడు కుమ్మరి. నిరాశగా చూశాడు వెంకటయ్య. అక్కడ ఉన్న కుండల్లో తన కుండను పోలిన కుండను ఒకదాన్ని కొనుక్కున్నాడు. కుండతో పాటు కుండపై మూత కూడా ఇచ్చాడు కుమ్మరి. కొత్త కుండను తీసుకుని ఆ ఎండలో అలాగే నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. బాగా దాహంగా ఉంది అతడికి. బాటిల్లో నీళ్లు ఉన్నాయి. తాగబోయి ఆగాడు. సంచీ తీసి అందులోంచి పెద్ద మూతంత ఉన్న పెంకును తీసి బాటిల్లోని నీళ్లను ఆ పెంకులో ఒంపుకుని, ఆ నీటిని తాగాడు. ప్రాణానికి హాయిగా అనిపించింది. ఆ రాత్రి వెంకటయ్య భార్య కొత్త కుండను కడిగి, వెంకటయ్య మంచం పక్కనే పెట్టి, నిండా నీళ్లు పోసి పైన మూత పెట్టింది. ఆమె అలా వెళ్లిపోగానే, వెంకటయ్య ఆ మూతను తీసి పక్కన పెట్టి, దాని స్థానంలో అంతక్రితం తను నీళ్లు తాగిన కుండ పెంకును మూతగా పెట్టాడు. తన పాత కుండతో అతడు బంధాన్ని తెంపుకోలేకపోతున్నాడు.
ఆ రాత్రి వెంకటయ్య చాలాసేపటికి వరకు నిద్రపోలేదు. చీకట్లో అలాగే మేల్కొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పటికో నిద్ర పడుతుండగా చిన్నగా చప్పుడు వినిపించింది. ఎవరో మంచినీళ్ల కోసం కుండపై మూత తీస్తున్న చప్పుడు అది! మంచంపై పక్కకు ఒత్తిగిలి ఆ చీకట్లోనే కుండవైపు చూశాడు. మూత కదులుతోంది!! కళ్లు చికిలించి కాస్త దగ్గరగా చూశాడు. మూత కదులుతున్నట్లేం అనిపించలేదు. భ్రాంతి అనుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. నిద్రలోకి జారుకుంటుండగా మళ్లీ మూత కదిలిన చప్పుడయింది. ఈసారి అతడు తలతిప్పి చూడలేదు. పూర్తిగా నిద్రలోకి వెళ్లిపోయాడు.పెద్దగా చప్పుడైతే ఉలిక్కిపడి లేచాడు వెంకటయ్య. లేచి, లైటు వేశాడు. కొత్త కుండ పగిలి ముక్కలై ఉంది. వాటి మధ్యలో పాత కుండ పెంకు మూత చెక్కు చెదరకుండా ఉంది!!
- మాధవ్ శింగరాజు