ఐసీడీఎస్‌లో నిధుల స్వాహా..? | ICDS funds looted..? | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌లో నిధుల స్వాహా..?

Published Sun, Oct 27 2013 3:36 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

ICDS funds looted..?

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఓ అధికారిణి రూ.75 లక్షలు స్వాహా చేశారని ఆ శాఖలో జోరుగా చర్చ సాగుతోంది. ఆదిలాబాద్ రూరల్ సీడీపీవోపై ఆ కార్యాలయంలోనే పనిచేసే యూడీసీ ఫిర్యాదు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదుపై స్పందించిన అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటయ్య విచారణ చేపట్టారని, ఇటీవల సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను సీజ్ చేశారని సమాచారం. దీనిపై ఆయన నివేదిక తయారు చేసి కలెక్టర్ అహ్మద్‌బాబుకు అందజేసినట్లు సమాచారం.
 
ఈ మేరకు కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ, రూరల్ సీడీపీవో, సంబంధిత సూపర్‌వైజర్లను శనివారం విచారణ కోసం పిలిపించారు. అయితే కలెక్టర్ వివిధ సమావేశాలతో బిజీగా ఉండడంతో రాత్రి వరకు ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. మరోపక్క సీడీపీవోపై సస్పెన్షన్ వేటు పడిందని ఆ శాఖలో సాయంత్రం నుంచి పుకార్లు వినిపించాయి. అయితే అది వాస్తవం కాదని ఏజేసీ వెంకటయ్య తెలిపారు. కలెక్టర్ ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని వివరించారు.
 
రూ.75 లక్షలు స్వాహా..?
ఐసీడీఎస్ ఆదిలాబాద్ రూరల్ సీడీపీవోగా ప్రభావతి కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఆమె ముథోల్ ఇన్‌చార్జి సీడీపీవోగానూ వ్యవహరిస్తున్నారు. కాగా ఐసీడీఎస్ కార్యాలయంలో యూడీసీగా ఉన్న రాణి ఏప్రిల్ 16న ఆదిలాబాద్ రూరల్ సీడీపీవో కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఆ సమయంలో ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పకుండా కొన్ని రిజిస్టర్లు, సర్వీసు బుక్‌లు మాత్రమే ఇచ్చారని, రూ. 58.71 లక్షలు పేమెంట్ కాని నిధులు ఖాతాలో ఉండడంతో ఈ విషయంలో సీడీపీవోను ఆమె ప్రశ్నించినట్లు శాఖలో చెప్పుకుంటున్నారు. అదేవిధంగా రూ.10 లక్షలకు సంబంధించిన చెక్కులు కూడా బ్యాంక్‌లో బౌన్స్ అయినట్టు పేర్కొంటున్నారు. ఈ నిధులు ఎక్కడివి, దానికి సంబంధించిన రికార్డులు ఏవి అనే విషయంలో సీడీపీవో, యూడీసీ మధ్య వివాదం మొదలై తారస్థాయికి చేరుకుందని శాఖ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు.
 
కాగా ఆ నిధులు అంగన్‌వాడీలకు సంబంధించి భవనాల అద్దె, అంగన్‌వాడీలు, ఆయాల టీఏ, అమృతహస్తం, అంగన్‌వాడీలకు అదనపు గౌరవ వేతనం, వంట చెరుకు, వీవో బిల్స్ తదితర వాటికి సంబంధించి సీడీపీవో అంగన్‌వాడీలకు ఇవ్వకుండా కాజేస్తున్నారని ఆమె ఏజేసీకి ఫిర్యాదు చేశారు. అంగన్‌వాడీల లోపాలను ఎత్తిచూపుతూ ఆయాలు, వర్కర్లను నయానబయాన బెదిరించి వారికి డబ్బులు అందించినట్లుగా బలవంతంగా సంతకాలు తీసుకొని నిధులను స్వాహా చేశారని యూడీసీ తన ఫిర్యాదులో వివరించినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయంలో ఏజేసీ నాలుగు రోజుల కిందట సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసినప్పుడు సీడీపీవో ప్రభావతితోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయంలో లేరు. ఆ క్రమంలోనే టీఏ బిల్లుల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. సీడీపీవో కార్యాలయంలో పనిచేసే అటెండర్‌కు కూడా ఈ వ్యవహారంలో పాత్ర ఉందన్న ప్రచారం సాగుతోంది. ఆమె ఆదేశాలకనుగుణంగా సదరు అటెండర్ అంగన్‌వాడీల నుంచి వ్యవహారాన్ని చక్కదిద్దడంలో సిద్ధహస్తుడని చెప్పుకుంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement